కనిమొళి,స్టాలిన్
డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి పగ్గాల్ని ఎంపీ, గారాల పట్టి కనిమొళికి అప్పగించారు. యువజన విభాగం పగ్గాలను మళ్లీ స్టాలిన్‌కే కట్టబెట్టారు. ఈ మేరకు డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆదేశాలతో ప్రధాన కార్యదర్శి అన్భళగన్ వివిధ విభాగాల నిర్వాహకుల్ని శుక్రవారం ప్రకటించారు.
సాక్షి, చెన్నై:డీఎంకేలో ప్రక్షళన పర్వం సాగిన విషయం తెలిసిందే. పార్టీ పరంగా జిల్లాల సంఖ్యను 65కు పెంచారు. పార్టీ పదవుల భర్తీ ప్రజాస్వామ్య బద్ధంగా సంస్థాగత ఎన్నికల ద్వారా విజయవంతం చేశారు. రాష్ర్ట పార్టీ అధ్యక్షుడిగా కరుణానిధి, ప్రధాన కార్యదర్శిగా అన్భళగన్, కోశాధికారిగా ఎంకే స్టాలిన్‌ను మళ్లీ ఎన్నుకున్నారు. ఈ సారి పదవుల భర్తీల్లో కనిమొళికి పార్టీ పరంగా అందలం ఎక్కిస్తారన్న ప్రచారం సాగింది. అయితే, పార్టీ పరంగా ఎలాంటి పదవులు ఆమెకు కట్టబెట్టలేదు.
ఎట్టకేలకు ఆమెకు చిన్న ప్రమోషన్ ఇచ్చే రీతిలో సాంస్కృతిక విభాగం నుంచి మహిళా విభాగం పోస్టును అప్పగించారు. డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి పగ్గాలను కనిమొళికి అప్పగిస్తూ అన్భళగన్ ప్రకటించారు. యువజన విభా గం ఆవిర్భావ కాలం నాటి నుంచి ప్రధాన కార్యదర్శిగా స్టాలిన్ కొనసాగుతూనే వచ్చారు. ఈ సారి మళ్లీ స్టాలిన్‌కు కోశాధికారి పగ్గాలే దక్కాయి. దీంతో యువజన పగ్గాల్లోను మార్పు జరగలేదు. ఆ పదవిని మళ్లీ స్టాలిన్‌కు కట్టబెడుతూ అధిష్టానం నిర్ణయించింది.
కరుణతో అయ్యర్ భేటీ
డీఎంకే అధినేత ఎం.కరుణానిధిని కాంగ్రెస్ ఎంపీ మణిశంకరయ్యర్ కలుసుకున్నారు. ఉదయం గోపాలపురంలో ఈ భేటీ సాగడంతో ప్రధాన్యత సంతరించుకుంది. ఉప ఎన్నికల మద్దతు విషయంగా ఏమైనా చర్చ సాగుతున్నదేమోనన్న సంకేతాలతో మీడియా ఉరకలు తీసింది. అయితే, కేవలం మర్యాదేనని అయ్యర్ స్పష్టం చేయడంతో విస్తుపోక తప్పలేదు. ఈ భేటీ గురించి మణి శంకరయ్యర్ మాట్లాడుతూ, కరుణానిధిని కలుసుకుని చాలాకాలం అవుతోందని, ఇప్పుడు చెన్నై వచ్చిన దృష్ట్యా, మర్యాద పూర్వంగా ఆయన్ను కలుసుకున్నానన్నారు.
తమ భేటీ పిచ్చా పాటికే పరిమితంగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీన పడ్డ మాట వాస్తవమేనని, అందరూ కలసి కట్టుగా పునర్ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఓ ప్రశ్నకు అయ్యర్ సమాధానం ఇచ్చారు. జయంతి నటరాజన్ వ్యాఖ్యల గురించి అధిష్టానం స్పందించిందని, తనది అధిష్టానం బాటేనని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
డీఎంకేతో కాంగ్రెస్ మళ్లీ దోస్తీ కట్టేనా..? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, రాజ్య సభలో డీఎంకే ఎంపీ కనిమొళి తాను, మరి కొందరు ఎంపీలందరూ ఒకే జట్టుగా తమిళులనాడు సమస్యలపై గళం విప్పుతున్నామని, తమకు రాజ్య సభలో కూటమి లేదని, అందరిదీ ప్రజా సమస్య పరిష్కారం మాత్రమే మార్గంగా పేర్కొన్నారు. డీఎంకే తో కాంగ్రెస్ కూటమి అన్నది అధిష్టానం చూసుకుంటుందన్నారు.