డీఎంకేను ఎవ్వరూ చీల్చలేరు
డీఎంకేను చీల్చేందుకు ఇంత వరకు ఎవ్వరూ పుట్టలేదని ఆ పార్టీ అధినేత ఎం.కరుణానిధి స్పష్టం చేశారు. పార్టీలో చీలికకు ఆస్కారం లేదని, బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తున్నారని ఆయన అన్నారు.
సాక్షి, చెన్నై: డీఎంకేను చీల్చేందుకు ఇంతవరకు ఎవ్వరూ పుట్టలేదని ఆ పార్టీ అధినేత ఎం.కరుణానిధి అన్నారు. డీఎంకే నాయకుడు, ఎమ్మెల్యే అన్భళగన్ సోదరుడు కరుణానిధి, పునిద వల్లి దంపతుల కుమార్తె కే.మీనా అలియాస్ మోనీషా వివాహం తిరుత్తణికి చెందిన చంద్రశేఖర్, జయలక్ష్మి దంపతుల కుమారుడు యువరాజ్‌తో శుక్రవారం జరిగింది. డీఎంకే రాష్ట్ర కార్యాలయం అన్నాఅరివాళయంలో అధినేత ఎం.కరుణానిధి సమక్షంలో ఈ వివాహం జరిగింది.
ఈసందర్భంగా కరుణానిధి ప్రసంగిస్తూ డీఎంకే ఒక కుటుంబం అని, ఈ కుటుంబాన్ని పరిరక్షించేందుకు అన్భళగన్ లాంటి వాళ్లెందరో ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ వలే, ఈ అన్భళగన్ కూడా ఎల్లప్పుడూ పార్టీకి వెన్నెంటి ఉండి తన సేవల్ని అందిస్తారన్న నమ్మకం ఉందన్నారు. డీఎంకే మీద రకరకాల పుకార్లు, ప్రచారాలు సాగుతున్నాయని గుర్తుచేస్తూ, డీఎంకేను చీల్చడం లేదా నిర్వీర్యం చేయడానికి ఇంత వరకు ఎవ్వరూ పుట్టలేదని స్పష్టం చేశారు.
పేరు మార్పు: తన పేరు కరుణానిధి అని, ఈ పేరులోని చివరి రెండు పదాలు ‘నిధి’ ఉత్తరాధి భాషగా పేర్కొన్నారు. తనపేరును మార్చేందుకు గతంలో ఓ మారు ప్రయత్నం జరిగిందని గుర్తుచేశారు. తన పేరును అరుల్ సెల్వర్‌గా మార్చేందుకు ప్రయత్నం జరిగిన సమయంలో తాను దివంగత నేత అన్నాను ఆశ్రయించినట్టు పేర్కొన్నారు. ఆయన సూచన మేరకు తన పేరును కరుణానిధిగానే నేటికీ కొనసాగిస్తూ వస్తున్నానని వివరించారు.
తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చొద్దంటూ ఆయన ఇచ్చిన సూచ న మేరకు తాను ముందుకు సాగుతూ వస్తున్నానని, ఈ కరుణానిధి ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాడని, ఉంటానని, ఉండి తీరుతానని ప్రజల్ని ఉద్దేశించి వ్యా ఖ్యానించారు. ఈ వివాహ వేడుకలో డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే.స్టాలిన్, నాయకులు ఆర్కాట్ వీరా స్వామి, దయానిధి మార న్, వీపీ.దురైస్వామి, సద్గున పాండియన్, టీకేఎస్.ఇళంగోవన్, ఆర్.భారతీ, సుభావీర పాండియ న్, వీసీకే నేత తిరుమావళవన్ పాల్గొన్నారు.