రాజ్యసభ నేతగా కనిమొళి
Published Thu, Aug 15 2013 3:09 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
రాజ్యసభలో డీఎంకే నేతగా కరుణానిధి గారాలపట్టి కనిమొళి వ్యవహరించనున్నారు. ఈ మేరకు సిఫారసు లేఖను రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీకి డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ బుధవారం పంపారు. ఇక నుంచి కరుణ దూతగా ఢిల్లీలో కనిమొళి చక్రం తిప్పనున్నారు.
సాక్షి, చెన్నై: క్రీయాశీలక రాజకీయాల్లో కనిమొళి చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. 2జీ స్పెక్ట్రమ్ కేసు ఇరకాటంలో పెట్టినా, కారాగార జీవితం అనుభవించినా ఆమెలోని ఆత్మ విశ్వాసం సడలలేదు. తనకంటూ మద్దతుదారుల్ని కూడగడుతున్నారు. తన గారాలపట్టిని అం దలం ఎక్కించాలని కరుణానిధి పలుమార్లు ప్రయత్నించారు. తనయు లు అళగిరి, స్టాలిన్ నుంచి ఎక్కడ చిక్కులు ఎదురవుతాయోనన్న బెంగ తో వెనక్కు తగ్గారు. లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా తన దూతగా ఢిల్లీలో కనిమొళిని పరిచయం చేయడానికి సిద్ధమయ్యూరు.
అన్సారీకి లేఖ
రాష్ట్రం నుంచి 19 మంది రాజ్యసభ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో డీఎంకే సభ్యులుగా కనిమొళి, వసంతి స్టాన్లీ, కె.పి.రామలింగం, సెల్వగణపతి, తంగవేలు, జిన్నా ఉన్నారు. డీఎంకే రాజ్యసభ నేతగా తిరుచ్చి శివ ఇది వరకు వ్యవహరించే వారు. ఆయన పదవీ కాలం గత నెలతో ముగిసింది. శివకు రాజ్యసభ అవకాశం మళ్లీ దక్కలేదు. అదృష్టం కొద్దీ కనిమొళి మళ్లీ ఎంపికయ్యారు. దీంతో రాజ్యసభలో డీఎంకే నేత పదవి ఖాళీ ఏర్పడింది. ఈ పదవిని కనిమొళి ద్వారా భర్తీ చేయడానికి కరుణానిధి నిర్ణయించారు. తమ పార్టీ రాజ్యసభ వ్యవహారాల నేతగా కనిమొళిని ఎంపిక చేస్తూ సిఫారసు లేఖను సిద్ధం చేశారు. ఈ లేఖను పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ బుధవారం ఢిల్లీకి పంపించా రు. దీనిని అన్సారీ ఆమోదించడమే తరువాయి. ఇక ఢిల్లీలో కరుణ దూతగా కనిమొళి చక్రం తిప్పనున్నారు.
Advertisement
Advertisement