ఓ లాడ్జిలో తెలంగాణకు చెందిన ఓ రియల్టర్ కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
- యజమాని మృతి.. భార్య, కుమారుల పరిస్థితి విషమం
- కరీంనగర్‌కు చెందిన వారుగా అనుమానం
తిరువణ్ణామలై (తమిళనాడు): తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఓ లాడ్జిలో తెలంగాణకు చెందిన ఓ రియల్టర్ కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుటుంబ యజమాని రవికుమార్ (55) మృతి చెందగా, అతని భార్య, ఇద్దరు కుమారుల పరిస్థితి విషమంగా ఉంది. భార్య పద్మ, కుమారులు శశి, శంకర్‌లతో కలసి రవికుమార్ మూడు నెలలక్రితం తిరువణ్ణామలై సెంగం రోడ్డులోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. గది తీసుకున్న సమయంలో కరీంనగర్ అని మాత్రం నమోదుచేశారు. పూర్తి వివరాలు తెలియరాలేదు.
సోమవారం ఉదయం 10 గంటల వరకు గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది కిటికీలు తెరిచిచూడగా నలుగురూ స్పృహ తప్పి పడిఉన్నారు. తలుపులు పగలగొట్టి పరిశీలించగా శీతలపానీయాల్లో విషం కలిపి తాగినట్లు తెలిసింది. వెంటనే నలుగురినీ తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవికుమార్ మంగళవారం ఉదయం మృతిచెందాడు. మిగిలిన ముగ్గురి పరిస్థితి సైతం విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.