మరో కుట్ర! | Karnataka Agrees To Release Some Water From Cauvery To Tamil Nadu | Sakshi

మరో కుట్ర!

Published Tue, Oct 4 2016 3:26 AM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM

Karnataka Agrees To Release Some Water From Cauvery To Tamil Nadu

కావేరి బోర్డు అనుమానమే!
  సుప్రీంలో కేంద్రం అడ్డు
  మోదీ సర్కారుపై రాష్ట్రంలో ఆక్రోశం
  కమలనాథుల్లో భిన్న స్వరాలు
  కోర్టు కన్నెర్రతో కంటితుడుపు చర్యగా నీళ్లు

 
 కావేరిజలాలపై తమిళులకు ఉన్న హక్కుల్ని కాలరాయడానికి కేంద్రం నడుం బిగించింది. కర్ణాటక కుట్రల్ని తలదన్నే రీతిలో కొత్త కుట్రకు కేంద్రం వ్యూహ రచన చేయడం తమిళనాట ఆక్రోశాన్ని రగిలిస్తోంది. కావేరి అభివృద్ధి మండలి ఏర్పాటు కష్టమే అంటూ కేంద్ర సర్కారు సుప్రీంకోర్టులో స్పష్టం చేయడంతో బీజేపీపై ఇక్కడి రాజకీయ పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. ఎక్కడ కోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందేమోనని కర్ణాటక నీరు విడుదలకు పూనుకుంది.
 
 సాక్షి, చెన్నై: తమిళనాడు-కర్ణాటక మధ్య కావేరి జల వివాదం జఠిలం అవుతోంది. కావేరి ట్రిబ్యునల్ తీర్పు మేరకు అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రం మీదున్నా, కర్ణాటకలో రాజకీయ లబ్ధికోసం పాలకులు కాలయాపన చేసే పనిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లోకి ఆ తీర్పు ఎక్కినా, ఆచరణలో పెట్టడంలో జరుగుతున్న జాప్యం కావేరి జలాల కోసం పెద్ద సమరమే చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. సుప్రీం కోర్టును ఆశ్రయించి నీటిని విడుదల చేయించుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు స్పందిస్తున్నా, కర్ణాటక పాలకులు, కేంద్ర ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు.
 
 మరో కుట్ర: గత నెల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వుల హెచ్చరిక మేరకు ట్రిబ్యునల్ తీర్పు అమలుకు తగ్గ ప్రయత్నాల్లో కేంద్రం నిమగ్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ బోర్డుకు ప్రతినిధిగా సుబ్రమణ్యం పేరును సిఫారసు చేశారు. నిన్నటి వరకు అన్ని సజావుగానే సాగినా, సోమవారం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున దాఖలైన పిటిషన్ తమిళనాట ఆక్రోశాన్ని రగిల్చింది. అందులో కావేరి అభివృద్ధి మండలి తక్షణ ఏర్పాటు కష్టం అని, ఈ ఉత్తర్వుల్ని కేంద్రానికి ఇచ్చే అధికారం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌కు లేదన్నట్టుగా కేంద్రం స్పష్టం చేయడంతో తమ హక్కుల్ని కాలరాయడానికి కేంద్రం కొత్త కుట్రతో బయలు దేరిందన్న ఆందోళనను డెల్టా అన్నదాతలు వ్యక్తం చేస్తున్నారు. ట్రిబ్యునల్ తీర్పులో అభివృద్ధి మండలి ఏర్పాటుపై సిఫారసు చేయబడిందే గానీ, తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందే అన్న స్పష్టత లేదని, ఈ దృష్ట్యా, తక్షణం బోర్డును ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చడం గమనార్హం.
 
 అలాగే, ఈ బోర్డు ఏర్పాటు అన్నది పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశంగా పేర్కొనడం తమిళనాడులోని రాజకీయ పక్షాల నాయకులు అగ్గి మీద బుగ్గిలా మండి పడుతున్నారు. గత వారం రెండు రాష్ట్రాల మధ్య ఢిల్లీలో జరిగిన చర్చల్లో బోర్డు ఏర్పాటుకు తగ్గ ప్రాథమిక కసరత్తులు చేపట్టామని నీటి పారుదల శాఖ మంత్రి ఉమాభారతి వ్యాఖ్యానిస్తే, ఇప్పుడు కేంద్రం తన మాట మార్చడాన్ని తప్పబడుతున్నారు. నిర్ణయంలో మార్పు ఏమిటో అంటూ సుప్రీం కోర్టు సైతం వ్యాఖ్యలు చేయడం బట్టి చూస్తే, కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రుల ఒత్తిళ్లకు మోదీ సర్కారు తలొగ్గినట్టు స్పష్టం అవుతోంది. అయితే ఈ విషయంలో సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది మంగళవారం తేలనున్నది.
 
 ఆక్రోశం: తమకు కావేరి మీదున్న హక్కుల్ని కాలరాయడానికి కేంద్రం కొత్త కుట్రతో ముందుకు సాగుతుండడం తమిళనాట ఆక్రోశాన్ని రగిల్చి ఉన్నది. డెల్టా అన్నదాతలు, రైతు సంఘాలు తీవ్రంగా కేంద్రం తీరును దుయ్యబట్టే పనిలో పడ్డారు. రైతు సంఘం నాయకులు టీఆర్ పాండియన్ పేర్కొంటూ తమ హక్కుల్ని కాలరాయడానికి కేంద్రం సైతం సిద్ధంగా ఉందని, ట్రిబ్యునల్ ఆదేశాల అమల్లో ఇన్నాళ్లు సాగిన జాప్యం వెనుక కేంద్రం తీరు ఏమిటో అన్నది తాజాగా స్పష్టమైనట్టు మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచే విధంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్ని బహిష్కరించి , పోరాటాలకు అన్ని పార్టీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
 
 డీఎంకే అధినేత ఎం.కరుణానిధి పేర్కొంటూ, కర్ణాటకలో త్వరలో జరగనున్న ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ లబ్ధి కోసం  కేంద్రం నాటకం రచించినట్టుందని మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి కోసం తమిళుల హక్కులకు అడ్డు పడితే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలని, అత్యవసరంగా అసెంబ్లీని సమావేశ పరచడంతో పాటుగా అఖిల పక్షానికి పిలుపు నివ్వాలని డిమాండ్ చేశారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల్ని ధిక్కరించే విధంగా ముందుకు సాగుతుండడం బట్టి చూస్తే, భవిష్యత్తుల్లో కావేరి జలాలు తమిళులకు దక్కేనా అన్న  ఆందోళన ఉందన్నారు.
 
 సీపీఎం నేత జి.రామకృష్ణన్ పేర్కొంటూ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిగా వ్యవహరించాల్సిన కేంద్రం, తాజాగా ఆ చిచ్చుకు మరింత ఆజ్యం పోయడానికి సిద్ధమైనట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీకే నేత తిరుమావళవన్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నం అయిందని, అందరూ ఏకం అవుదామని ఆయా పార్టీలకు పిలుపు నిచ్చారు. డీఎంకే దళపతి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ పేర్కొంటూ కర్ణాటకకు కేంద్రం వత్తాసు పలుకుతున్నదన్న విషయం తాజాగా స్పష్టమైందని మండి పడ్డారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి పేర్కొంటూ నిన్నటి వరకు బోర్డు ఏర్పాటు ప్రయత్నాల్లో ఉండి, ఇప్పుడు మాట మార్చడం కేంద్రానికి తగదు అని మండి పడ్డారు. తమిళులకు ద్రోహం లక్ష్యంగా కేంద్రం సైతం కుట్రలకు పాల్పడుతున్నట్టుందని, దీనిని ప్రతి ఘటించి తీరుతామన్నారు.
 
 బీజేపీ నేతలు అయితే, భిన్న స్వరాలు పలకడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాల్ని పట్టించుకోని కర్ణాటక సరా్కారు,  బోర్డు ఏర్పాటు చేసినంత మాత్రన నీటిని విడుదల చేస్తుందా? అని బీజేపీ సీనియర్ నేత హెచ్ రాజా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ పేర్కొంటూ తమిళులకు వ్యతిరేకంగా ఎవరు కుట్రలు చేసినా సహించబోమని, కేంద్ర మంత్రులు మధ్యవర్తులుగా ఉండాలే గానీ, ఒక రాష్ట్రానికి అనుకూలంగా స్పందించకూడదని వ్యాఖ్యానించడం ఆలోచించదగ్గ విషయమే.
 
 మంగళవారం కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో అన్న ఉత్కంఠ ఉంది. ఇక, ఎక్కడ కోర్టు ఆగ్రహానికిగురికావాల్సి ఉంటుందో అన్న బెంగతో తమిళనాడుకు కంటితుడుపు చర్యగా నీటి విడుదలకు కర్ణాటక సర్కారు నిర్ణయించడం కొసమెరుపు. తాజా పరిణామాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రత పెంచి ఉన్నారు. ఆదివారం కర్ణాటక పోలీసులు తమిళ వాహనాల మీద దాడి చేసిన సమాచారం ఇక్కడి వర్గాల్లో ఆగ్రహాన్ని రేపుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement