సాక్షి, బెంగళూరు: ప్రధాన ప్రతిపక్షం లిస్టు తయారీలో తలమునకలైంది. గతానుభవాల దృష్ట్యా ఈసారి జాగ్రత్తగా అడుగులేస్తోంది. అభ్యర్థుల తుది జాబితాలో తమకు చోటు దక్కుతుందో లేదోనని మథనపడుతూ గతనెల రోజులుగా బీజేపీ నేతలు చూస్తున్న ఎదురుచూపులకు ఎట్టకేలకు సోమవారం లోపు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి ప్రజాదరణ కలిగిఉన్న నేతలకు టికెట్లు ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. అదేవిధంగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు, గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన నేతలకు కూడా టికెట్లు ఇవ్వాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవడంతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇలా ఇప్పటి వరకు ఎంపిక చేసిన అభ్యర్థుల తుదిజాబితాపై శనివారం బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప,రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధర్‌రావుల నేతృత్వంలో నగరశివార్లలోని ఓ రెసార్ట్‌లో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఇద్దరు కంటే ఎక్కువ ఆశావహులున్న నియోజకవర్గాల్లో టికెట్లు ఎవరికి ఇవ్వాలో, టికెట్లు దక్కని నేతలను ఎలా బుజ్జగించాలనే విషయాలతో పాటు తీవ్రమైన పోటీ ఉండే, ముఖ్యమైన నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. టికెట్లు దక్కలేదని ఎవరూ అల్లరి చేయరాదని, వారికి తగిన అవకాశం కల్పిస్తామని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు, రేపు ఢిల్లీలో మథనం 16 రకాల కేటగిరీల్లో సమీక్షలు నిర్వహించి రూపొందించిన అభ్యర్థుల జాబితాతో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, కేంద్రమంత్రి అనంతకుమార్‌లు నేడు (ఆదివారం)ఢిల్లీకి చేరుకోనున్నారు. నెలరోజుల పాటు ముమ్మర కసరత్తులు చేసి సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాపై పార్టీ సీనియర్ నేతలతో పాటు స్క్రీనింగ్ కమిటీతో చర్చించిన అనంతరం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా వంద మంది అభ్యర్థులతో మొదటి జాబితాను సోమవారం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు విజయం బీజేపీదేనన్న నమ్మకం ఉన్న మరో 40 నియోజకవర్గాలకు కూడా అదేరోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాలకు మరింత లోతుగా విశ్లేషణలు,సమీక్షలు నిర్వహించి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడానికి బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం నగరానికి చేరుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ లిస్టుపై కసరత్తుకు నాయకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment