సాక్షి, బెంగళూరు: కళసా బండూరి, మహదాయి నదీ జలాల వివాదంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకుని శాశ్వత పరిష్కారాన్ని చూపాలంటూ పలు కన్నడ పోరాట సంఘాలు నేడు (గురువారం) రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో అంతటా ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. వాటాళ్ చళువళి పార్టీ అధ్యక్షుడు వాటాళ్ నాగరాజు, కన్నడ పోరాట సంఘాల సమాఖ్య ముఖ్య నేత సా.రా.గోవిందులు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడువేల కన్నడ పోరాట సంఘాలు మద్దతు తెలిపినట్లు వాటాళ్ నాగరాజు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక బంద్ ఎట్టిపరిస్థితుల్లోనూ జరిగి తీరుతుందని బీదర్ నుంచి చామరాజనగర వరకు మైసూరు నుంచి కోలారు వరకు బంద్‌ను సంపూర్ణం చేయడానికి సకల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ఉత్తర కర్ణాటక రైతుల సాగు, తాగునీటి అవసరాల కోసం అతిముఖ్యమైన కళసా బండూరీ, మహదాయి నదీ జలాల పంపిణీలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు కూడా మహదాయి,కళసా బండూరీపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంతో రాష్ట్ర రైతుల కోసం తామే ఉద్యమాల బాట పట్టినట్లు చెప్పారు. కర్ణాటక బంద్ సందర్భంగా నేడు ఉదయం పది గంటలకు బెంగళూరు టౌన్‌హాల్ నుంచి ఫ్రీడంపార్క్ వరకు కన్నడ పోరాట సంఘాల నేతలు, వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీ జరుపుతామని చెప్పారు.
డిగ్రీ పరీక్షల వాయిదా
బంద్ సందర్భంగా విద్యార్థులు, తమ ఆస్తుల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర‡వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కర్ణాటక ప్రైవేటు పాఠశాలల సంఘం ప్రధాన కార్యదర్శి శశికుమార్ తెలిపారు. నేడు జరగాల్సిన మొదటి,మూడవ సంవత్సరం బీ.ఏ, బీఎస్సీ, బీబీఎం తదితర అన్ని పరీక్షలను బెంగళూరు యూనివర్శిటీ అధికారులు వాయిదా వేశారు. ఫిబ్రవరి 8వ తేదీన మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనుండగా, ఫిబ్రవరి 5వ తేదీన బీఎస్సీ,బీ.ఏ. మూడవ సంవత్సరం పరీక్షలు జరుపుతారు.
ఆసుపత్రులు తెరిచే ఉంటాయి
బంద్‌కు కేవలం నైతిక మద్దతు మాత్రమే తెలుపుతామని ఆసుపత్రులు, మెడికల్ దుకాణాలు రోజువారీలానే తెరచే ఉంటాయంటూ ఐఎంఏ నాయకుడు డా.రవీంద్రనాథ్ తెలిపారు. నైతిక మద్దతుగా నల్లటి రిబ్బన్‌లతో విధులకు హాజరవుతామంటూ తెలిపారు.
బీఎంటీసీ, ఆర్టీసీ సేవలు యథాతథం
రాష్ట్ర బంద్ సందర్భంగా బీఎంటీసీ సేవలు యథావిధిగా ఉంటాయని సంస్థ ఎండీ పొన్నురాజ్ తెలిపారు. అయితే బంద్ తీవ్రరూపం దాలిస్తే పరిస్థితిని బట్టి బస్సులను నిలిపివేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కేఎస్‌ఆర్టీసీ సేవలకు కూడా ఢోకా ఉండదని చెప్పారు.
షూటింగ్‌లు, సినిమా థియేటర్లు బంద్
గురువారం సినిమా షూటింగ్‌లను నిలిపివేయనున్నట్లు కన్నడ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సా.రా.గోవిందు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. అయితే పెట్రోలు బంకులు యథావిధిగా పనిచేస్తాయని ఆ యజమానుల సంఘం తెలిపింది. కన్నడ పోరాట సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు ఆటో సంఘాలు,లారీ యజమాన్య సంఘాలు మద్దతు తెలుపగా ప్రైవేటు టాక్సీలు, మెట్రోరైళ్లు మాత్రం ఎప్పటిలానే సంచరించనున్నాయి..
సంయమనం పాటించండి: సీఎం
నేడు (గురువారం)రాష్ట్ర బంద్ సందర్భంగా ప్రజలు,విద్యార్థులు సంయమనం పాటించాలంటూ సీఎం సిద్ధరామయ్య కోరారు. చట్ట అతిక్రమణ చర్యలకు పాల్పడరాదని కోరారు. ఈ బంద్‌తో తమకు సంబంధం లేదని ఆయన చెప్పారు. బంద్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బెంగళూరులో 15వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment