Mahadayi River
-
చెవుల్లో పూలు పెడుతున్నారు: ప్రకాశ్‌రాజ్
సాక్షి, బెంగళూరు: బీజేపీ నాయకుల అబద్ధాలు తమను కష్టాల్లో నెట్టాలా చేస్తున్నాయని బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. ఆదివారం హుబ్లీ నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... తానేమైనా ప్రశ్నలను వేస్తే హిందూమత వ్యతిరేకి అనటం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తాను ఆరంభించిన ‘జస్ట్ ఆస్కింగ్’ ఒక రాజకీయ పార్టీ కాదని అదొక ఆందోళన అని స్పష్టం చేశారు. అందరినీ ప్రశ్నించే బాధ్యత తమకు ఉందని అన్నారు. మహదాయి విషయంలో అబద్ధాలు చెబుతున్నారని, ప్రధానమంత్రే ప్రజలు చెవుల్లో పూలుపెట్టే పనిచేస్తున్నారని ప్రకాశ్‌రాజ్ దుయ్యబట్టారు. అల్ప సంఖ్యాకులను దేశం నుంచి బయటికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో బీజేపీపై ధ్వజమెత్తారు. దలితులకు తానే ఆశాకిరణమని ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. గనుల యజమానులను క్షమించాల్సింది యడ్యూరప్ప కాదని, కర్ణాటక ప్రజలని అన్న ఆయన తన పోరాటంలో ఎలాంటి రాజకీయం, దురుద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. -
నీళ్లు – నిప్పులు
అంతా సవ్యంగా ఉందనుకుంటుండగా మళ్లీ నదీ జలాల్లో నిప్పు రాజుకుంది. కర్ణాటకలో మహాదాయిగా, గోవాలో మాండోవిగా పారుతున్న నది తాజా వివాదానికి కేంద్ర బిందువు. ఆ నది నీళ్లు విడుదల చేయాలంటూ కర్ణాటక రైతాంగం, వివిధ కన్నడ సంస్థలు దాదాపు నెలరోజులుగా ఆందోళన చేస్తున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్త బంద్ జరిగింది. బెంగళూరుకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 4న వస్తున్నందున ఆ రోజు నగర బంద్‌కు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి పోటీగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చే రోజైన ఫిబ్రవరి 10న బీజేపీ బంద్ పాటించబోతోంది. పడమటి కనుమల్లో పుట్టి గోవాలో అరేబియా సముద్రంలో కలిసే మహాదాయి కర్ణాటక కన్నా గోవాలోనే ఎక్కువ మేర పారుతుంది. దాని నిడివి 77 కిలోమీటర్లు కాగా అందులో కర్ణాటకలో ప్రవహించేది 29 కిలోమీటర్ల మేర మాత్రమే. జలాలను కృష్ణా ఉపనది మలప్రభ బేసిన్‌కు మళ్లించి నాలుగు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించాలన్నది కర్ణాటక ప్రతిపాదన. ఇందు కోసం మహాదాయిపై ఆనకట్టలు, కాలువలు నిర్మించాలని 80వ దశకంలో నిర్ణయిం చింది. ఇందువల్ల తమకున్న ఏకైక మంచినీటి నది ఎండిపోతుందని, భారీమొ త్తంలో అడవి నాశనమవుతుందని, పర్యావరణం దెబ్బతింటుందని 2002లో గోవా సుప్రీంకోర్టుకెళ్లింది. పర్యవసానంగా ఆ నిర్మాణాలను న్యాయస్థానం ఆపేసింది. అప్పటినుంచీ ప్రతి సీజన్లోనూ మలప్రభ ప్రాంతానికి నీరివ్వాలని ఆందోళనలు రేగడం, ఏదో మేరకు అంగీకారం కుదిరి వాటిని చల్లార్చడం రివాజు. ఈ వివాదంపై 2010లో ట్రిబ్యునల్ నియమించినా అది ఇంతవరకూ అవార్డు ప్రకటించలేదు. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ పక్షాల జోక్యంతో ఉద్రిక్తతలు పెరగడం, అశాంతి రగలడం తప్పడం లేదు. నదీజలాల వివాదంపై మన రాజ్యాంగంలోని 262వ అధికరణ మాట్లాడు తోంది. ఈ అధికరణ ప్రకారం నదీజలాల వినియోగం, పంపిణీ, నియంత్రణ వంటి అంశాల్లో రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తినా, ఫిర్యాదులు వచ్చినా పరి ష్కారం కోసం తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 1956లో నదీ జలాల బోర్డు చట్టం, అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం తీసుకొచ్చింది. బోర్డు ఇంతవరకూ సాకారం కాలేదుగానీ, అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం కింద దేశంలో ఏడు ట్రిబ్యునళ్లు ఏర్పడ్డాయి. ఇందులో కృష్ణా నదికి సంబంధించి రెండు ట్రిబ్యునళ్లుం డగా... రావి–బియాస్, గోదావరి, నర్మద, కావేరి, మహాదాయి, వంశధార వివా దాలపై ఇతర ట్రిబ్యునళ్లు ఏర్పడ్డాయి. అసలు ట్రిబ్యునళ్ల ఏర్పాటులోనే అంతులేని జాప్యం చోటుచేసుకోగా, వాటిల్లో కొన్ని సుదీర్ఘ సమయం వెచ్చించి ప్రకటించిన నిర్ణయాలకు సైతం దిక్కూ మొక్కూ లేకుండా పోతోంది. దేశంలో ఇంతవరకూ కృష్ణా ట్రిబ్యునల్–1, గోదావరి ట్రిబ్యునల్, నర్మద ట్రిబ్యునల్ మాత్రమే అవార్డులు ప్రకటించాయి. మిగిలినవి ప్రకటించినా వివిధ దశల్లో ఆగిపోయాయి. కొన్ని అవా ర్డులపై వివాదాలు సుప్రీంకోర్టుకెళ్లాయి. ఇవిగాక మహారాష్ట్రలోని బాభలీ ప్రాజెక్టుపై 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు, ముళ్ల పెరియార్ డ్యామ్ వివా దం విషయంలో అదే కోర్టు 2014లో ఇచ్చిన ఆదేశాల అమలుకు కేంద్రం ముగ్గురు సభ్యులతో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచ పునరుత్పాదక జల వనరుల్లో మన దేశంలో ఉన్నవి కేవలం 4 శాతం మాత్రమే. ప్రకృతి సహకరిస్తే సమృద్ధిగా వానలు పడతాయి. నదులు, సరస్సులు, చెరువులు, కుంటలు నిండుతాయి. అది పగబడితే చుక్క నీటికి దిక్కుండదు. భూగర్భ జలాలు కూడా అడుగంటుతాయి. వాతావరణంలో పెనుమార్పుల పర్యవ సానంగా రుతువులు గతి తప్పుతున్నాయి. అయితే అతివృష్టి...లేకపోతే అనావృష్టి తప్ప సవ్యంగా వర్షాలు పడటం అరుదుగా మారింది. కనుక ఉన్నకొద్దీ జలవివా దాలు పెరుగుతాయే తప్ప తగ్గవు. అయితే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ సమస్యపై నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి, శాశ్వత పరిష్కారం కనుగొన డానికి ముందుకు రావడం లేదు. సమస్య తలెత్తినప్పుడు తాత్కాలికంగా సర్దుబాటు చేసి, గండం గట్టెక్కితే చాలనుకుంటున్నారు. ట్రిబ్యునళ్లు అవార్డులివ్వ డంలో జాప్యం చేసినా, ఇచ్చిన అవార్డుల అమలు అసాధ్యమవుతున్నా పట్టిం చుకునే దిక్కులేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, డిక్రీలు సైతం బేఖాతరైన సందర్భాలు న్నాయి. ప్రతి అవార్డుపైనా, ఆదేశాలపైనా తిరిగి న్యాయస్థానాలను ఆశ్రయించడం పరిపాటి. ఇతరత్రా సమయాల్లో జాతి గురించి, జాతి ప్రయోజనాల గురించి గుండెలు బాదుకునేవారు నదీజలాల వివాదం వచ్చేసరికి ‘ప్రాంతీయ పూనకం’లో అన్నీ మరిచిపోతారు. చర్చలకంటే, పరిష్కారాలకంటే స్థానికుల్ని రెచ్చగొట్టడమే పార్టీలకు ప్రధానమైపోతుంది. వివాద పరిష్కారంలో జాప్యం జరిగితే అది మరింత ఉగ్రరూపం దాలుస్తుంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ల మధ్య ఉన్న రావి– బియాస్ వివాదం మొదలై 31 ఏళ్లవుతోంది. ఇప్పుడున్న ట్రిబ్యునళ్లను రద్దు చేసి వాటిస్థానంలో బహుళ బెంచ్‌లు ఉండే ఒక శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని రెండేళ్లక్రితం కేంద్రం నిర్ణయించింది. అందు కోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల(సవరణ)బిల్లు రూపొందించింది. నిరుడు మార్చిలో లోక్‌సభలో ఆ బిల్లు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఏ వివాదాన్నయినా ముందు నిపుణుల కమిటీ పరిశీలించి ఏడాదిలోగా ఒక పరిష్కారాన్ని సూచిస్తుంది. అప్పటికీ వివాదం సమసిపోనట్టయితే అది ట్రిబ్యునల్ ముందుకొస్తుంది. అలాగే నిరంతరం వివిధ నదుల్లోని జల పరిమాణానికి సంబంధించిన డేటా సేకరణకు ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పుతారు. ఈ బిల్లులో ఇతర అంశాలేమిటి, వాటిలోని లోటు పాట్లేమిటన్న సంగతలా ఉంచి దానిపై ఇంకా చర్చే మొదలుకాలేదు. కనీసం వచ్చే సమావేశాల్లోనైనా దానిపై లోతుగా చర్చించి వీలైనంత త్వరలో చట్టం చేసి పనులు మొదలు పెడితే మహాదాయిలాంటి అనేక వివాదాల పరిష్కారంవైపు తొలి అడుగు పడుతుంది. అందుకోసం అందరూ చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. -
నేడు కర్ణాటక బంద్
సాక్షి, బెంగళూరు: కళసా బండూరి, మహదాయి నదీ జలాల వివాదంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకుని శాశ్వత పరిష్కారాన్ని చూపాలంటూ పలు కన్నడ పోరాట సంఘాలు నేడు (గురువారం) రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో అంతటా ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. వాటాళ్ చళువళి పార్టీ అధ్యక్షుడు వాటాళ్ నాగరాజు, కన్నడ పోరాట సంఘాల సమాఖ్య ముఖ్య నేత సా.రా.గోవిందులు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడువేల కన్నడ పోరాట సంఘాలు మద్దతు తెలిపినట్లు వాటాళ్ నాగరాజు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక బంద్ ఎట్టిపరిస్థితుల్లోనూ జరిగి తీరుతుందని బీదర్ నుంచి చామరాజనగర వరకు మైసూరు నుంచి కోలారు వరకు బంద్‌ను సంపూర్ణం చేయడానికి సకల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉత్తర కర్ణాటక రైతుల సాగు, తాగునీటి అవసరాల కోసం అతిముఖ్యమైన కళసా బండూరీ, మహదాయి నదీ జలాల పంపిణీలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు కూడా మహదాయి,కళసా బండూరీపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంతో రాష్ట్ర రైతుల కోసం తామే ఉద్యమాల బాట పట్టినట్లు చెప్పారు. కర్ణాటక బంద్ సందర్భంగా నేడు ఉదయం పది గంటలకు బెంగళూరు టౌన్‌హాల్ నుంచి ఫ్రీడంపార్క్ వరకు కన్నడ పోరాట సంఘాల నేతలు, వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీ జరుపుతామని చెప్పారు. డిగ్రీ పరీక్షల వాయిదా బంద్ సందర్భంగా విద్యార్థులు, తమ ఆస్తుల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర‡వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కర్ణాటక ప్రైవేటు పాఠశాలల సంఘం ప్రధాన కార్యదర్శి శశికుమార్ తెలిపారు. నేడు జరగాల్సిన మొదటి,మూడవ సంవత్సరం బీ.ఏ, బీఎస్సీ, బీబీఎం తదితర అన్ని పరీక్షలను బెంగళూరు యూనివర్శిటీ అధికారులు వాయిదా వేశారు. ఫిబ్రవరి 8వ తేదీన మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనుండగా, ఫిబ్రవరి 5వ తేదీన బీఎస్సీ,బీ.ఏ. మూడవ సంవత్సరం పరీక్షలు జరుపుతారు. ఆసుపత్రులు తెరిచే ఉంటాయి బంద్‌కు కేవలం నైతిక మద్దతు మాత్రమే తెలుపుతామని ఆసుపత్రులు, మెడికల్ దుకాణాలు రోజువారీలానే తెరచే ఉంటాయంటూ ఐఎంఏ నాయకుడు డా.రవీంద్రనాథ్ తెలిపారు. నైతిక మద్దతుగా నల్లటి రిబ్బన్లతో విధులకు హాజరవుతామంటూ తెలిపారు. బీఎంటీసీ, ఆర్టీసీ సేవలు యథాతథం రాష్ట్ర బంద్ సందర్భంగా బీఎంటీసీ సేవలు యథావిధిగా ఉంటాయని సంస్థ ఎండీ పొన్నురాజ్ తెలిపారు. అయితే బంద్ తీవ్రరూపం దాలిస్తే పరిస్థితిని బట్టి బస్సులను నిలిపివేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కేఎస్ఆర్టీసీ సేవలకు కూడా ఢోకా ఉండదని చెప్పారు. షూటింగ్‌లు, సినిమా థియేటర్లు బంద్ గురువారం సినిమా షూటింగ్‌లను నిలిపివేయనున్నట్లు కన్నడ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సా.రా.గోవిందు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. అయితే పెట్రోలు బంకులు యథావిధిగా పనిచేస్తాయని ఆ యజమానుల సంఘం తెలిపింది. కన్నడ పోరాట సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు ఆటో సంఘాలు,లారీ యజమాన్య సంఘాలు మద్దతు తెలుపగా ప్రైవేటు టాక్సీలు, మెట్రోరైళ్లు మాత్రం ఎప్పటిలానే సంచరించనున్నాయి.. సంయమనం పాటించండి: సీఎం నేడు (గురువారం)రాష్ట్ర బంద్ సందర్భంగా ప్రజలు,విద్యార్థులు సంయమనం పాటించాలంటూ సీఎం సిద్ధరామయ్య కోరారు. చట్ట అతిక్రమణ చర్యలకు పాల్పడరాదని కోరారు. ఈ బంద్‌తో తమకు సంబంధం లేదని ఆయన చెప్పారు. బంద్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బెంగళూరులో 15వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్ తెలిపారు. -
మహదాయి హింసాత్మకం !
రోజురోజుకూ తీవ్రమవుతున్న రైతుల పోరాటం ధార్వాడ బంద్‌లో చెలరేగిన అల్లరి మూకలు గోవా బస్సుకు నిప్పు దుకాణాలపై రాళ్లు బెంగళూరు: మహదాయి నది అనుసంధానంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న రైతుల ఆందోళనలు ఇప్పుడు హింసాత్మకంగా మారుతున్నాయి. కళసా బండూరి కాలువా పథకంతో పాటు మహదాయి న ది అనుసంధానంపై గత కొన్ని రోజులు గా హుబ్లీ-ధార్వాడ, గదగ్ జిల్లాల్లోని రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ అంశంపై అఖిలపక్షం ప్రధాని నరేంద్రమోదీతో నిర్వహించిన సమావేశం విఫలమైన నేపథ్యంలో ఈ ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. అంతేకాక అఖిలపక్షం ప్రధానితో జరిపిన సమావేశం విఫలమైన నేపథ్యంలో బుధవారం నిర్వహించిన హుబ్లీ-ధార్వాడ బంద్ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. బంద్ నేపథ్యంలో హుబ్లీ-ధార్వాడ జిల్లా లో పూర్తిగా జనజీవనం స్తంభించింది. బంద్ సందర్భం లో కొన్ని అల్లరిమూకలు చెలరేగాయి. ఇక ఇదే సందర్భంలో ధార్వాడలోని బస్టాండ్‌లో ఆగి ఉన్న గోవాకు చెందిన బస్‌కు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో బస్ పూర్తిగా దగ్దమైంది. ఇదే సందర్భంలో కొంతమంది ఆందోళనకారులు దుకాణాలపై రాళ్లురువ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్తంభించిన రవాణా..... బంద్ నేపథ్యంలో ధార్వాడ జిల్లా వ్యాప్తంగా రవాణా స్తంభించింది. జిల్లాలోని కలఘటగి, కుందగోళ, నవల గుంద, నరగుంద పట్టణాలతో పాటు ఇతర అన్ని ప్రాం తాలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఇక బంద్ నేపథ్యంలో కేఎస్ఆర్టీసీ బస్‌లతో పాటు టెంపోలు, జీప్‌లు వంటి ప్రైవేటు రవాణా సైతం స్తంభించడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. తెల్లవారుఝామున కొన్ని ప్రాంతాల్లో ఆటో సంచారం కనిపించినా, టికెట్ ధరను మూడింతలు చేసి ప్రయాణికుల నుంచి వసూలు చేయడంతో ప్రజల జేబులకు చిల్లు తప్పలేదు.