మహదాయి హింసాత్మకం !
రోజురోజుకూ తీవ్రమవుతున్న రైతుల పోరాటం
ధార్వాడ బంద్‌లో చెలరేగిన అల్లరి మూకలు
గోవా బస్సుకు నిప్పు దుకాణాలపై రాళ్లు
బెంగళూరు: మహదాయి నది అనుసంధానంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న రైతుల ఆందోళనలు ఇప్పుడు హింసాత్మకంగా మారుతున్నాయి. కళసా బండూరి కాలువా పథకంతో పాటు మహదాయి న ది అనుసంధానంపై గత కొన్ని రోజులు గా హుబ్లీ-ధార్వాడ, గదగ్ జిల్లాల్లోని రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ అంశంపై అఖిలపక్షం ప్రధాని నరేంద్రమోదీతో నిర్వహించిన సమావేశం విఫలమైన నేపథ్యంలో ఈ ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. అంతేకాక అఖిలపక్షం ప్రధానితో జరిపిన సమావేశం విఫలమైన నేపథ్యంలో బుధవారం నిర్వహించిన హుబ్లీ-ధార్వాడ బంద్ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. బంద్ నేపథ్యంలో హుబ్లీ-ధార్వాడ జిల్లా లో పూర్తిగా జనజీవనం స్తంభించింది. బంద్ సందర్భం లో కొన్ని అల్లరిమూకలు చెలరేగాయి. ఇక ఇదే సందర్భంలో ధార్వాడలోని బస్టాండ్‌లో ఆగి ఉన్న గోవాకు చెందిన బస్‌కు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో బస్ పూర్తిగా దగ్దమైంది. ఇదే సందర్భంలో కొంతమంది ఆందోళనకారులు దుకాణాలపై రాళ్లురువ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
స్తంభించిన రవాణా.....
బంద్ నేపథ్యంలో ధార్వాడ జిల్లా వ్యాప్తంగా రవాణా స్తంభించింది. జిల్లాలోని కలఘటగి, కుందగోళ, నవల గుంద, నరగుంద పట్టణాలతో పాటు ఇతర అన్ని ప్రాం తాలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఇక బంద్ నేపథ్యంలో కేఎస్‌ఆర్‌టీసీ బస్‌లతో పాటు టెంపోలు, జీప్‌లు వంటి ప్రైవేటు రవాణా సైతం స్తంభించడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. తెల్లవారుఝామున కొన్ని ప్రాంతాల్లో ఆటో సంచారం కనిపించినా, టికెట్ ధరను మూడింతలు చేసి ప్రయాణికుల నుంచి వసూలు చేయడంతో ప్రజల జేబులకు చిల్లు తప్పలేదు.