నీళ్లు – నిప్పులు | editorial on mahadayi dispute between karnataka and goa | Sakshi
Sakshi News home page

నీళ్లు – నిప్పులు

Published Sat, Jan 27 2018 1:33 AM | Last Updated on Sat, Jan 27 2018 1:33 AM

editorial on mahadayi dispute between karnataka and goa - Sakshi

అంతా సవ్యంగా ఉందనుకుంటుండగా మళ్లీ నదీ జలాల్లో నిప్పు రాజుకుంది. కర్ణాటకలో మహాదాయిగా, గోవాలో మాండోవిగా పారుతున్న నది తాజా వివాదానికి కేంద్ర బిందువు. ఆ నది నీళ్లు విడుదల చేయాలంటూ కర్ణాటక రైతాంగం, వివిధ కన్నడ సంస్థలు దాదాపు నెలరోజులుగా ఆందోళన చేస్తున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్త బంద్‌ జరిగింది. బెంగళూరుకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 4న వస్తున్నందున ఆ రోజు నగర బంద్‌కు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి పోటీగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చే రోజైన ఫిబ్రవరి 10న బీజేపీ బంద్‌ పాటించబోతోంది. పడమటి కనుమల్లో పుట్టి గోవాలో అరేబియా సముద్రంలో కలిసే మహాదాయి కర్ణాటక కన్నా గోవాలోనే ఎక్కువ మేర పారుతుంది. దాని నిడివి 77 కిలోమీటర్లు కాగా అందులో కర్ణాటకలో ప్రవహించేది 29 కిలోమీటర్ల మేర మాత్రమే. 

జలాలను కృష్ణా ఉపనది మలప్రభ బేసిన్‌కు మళ్లించి నాలుగు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించాలన్నది కర్ణాటక ప్రతిపాదన. ఇందు కోసం మహాదాయిపై ఆనకట్టలు, కాలువలు నిర్మించాలని 80వ దశకంలో నిర్ణయిం చింది. ఇందువల్ల తమకున్న ఏకైక మంచినీటి నది ఎండిపోతుందని, భారీమొ త్తంలో అడవి నాశనమవుతుందని, పర్యావరణం దెబ్బతింటుందని 2002లో గోవా సుప్రీంకోర్టుకెళ్లింది. పర్యవసానంగా ఆ నిర్మాణాలను న్యాయస్థానం ఆపేసింది. అప్పటినుంచీ ప్రతి సీజన్‌లోనూ మలప్రభ ప్రాంతానికి నీరివ్వాలని ఆందోళనలు రేగడం, ఏదో మేరకు అంగీకారం కుదిరి వాటిని చల్లార్చడం రివాజు. ఈ వివాదంపై 2010లో ట్రిబ్యునల్‌ నియమించినా అది ఇంతవరకూ అవార్డు ప్రకటించలేదు. రెండు రాష్ట్రాల్లోనూ  రాజకీయ పక్షాల జోక్యంతో ఉద్రిక్తతలు పెరగడం, అశాంతి రగలడం తప్పడం లేదు.

నదీజలాల వివాదంపై మన రాజ్యాంగంలోని 262వ అధికరణ మాట్లాడు తోంది. ఈ అధికరణ ప్రకారం నదీజలాల వినియోగం, పంపిణీ, నియంత్రణ వంటి అంశాల్లో రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తినా, ఫిర్యాదులు వచ్చినా పరి ష్కారం కోసం తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 1956లో నదీ జలాల బోర్డు చట్టం, అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం తీసుకొచ్చింది. బోర్డు ఇంతవరకూ సాకారం కాలేదుగానీ, అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం కింద దేశంలో ఏడు ట్రిబ్యునళ్లు ఏర్పడ్డాయి. ఇందులో కృష్ణా నదికి సంబంధించి రెండు ట్రిబ్యునళ్లుం డగా... రావి–బియాస్, గోదావరి, నర్మద, కావేరి, మహాదాయి, వంశధార వివా దాలపై ఇతర ట్రిబ్యునళ్లు ఏర్పడ్డాయి. అసలు ట్రిబ్యునళ్ల ఏర్పాటులోనే అంతులేని జాప్యం చోటుచేసుకోగా, వాటిల్లో కొన్ని సుదీర్ఘ సమయం వెచ్చించి ప్రకటించిన నిర్ణయాలకు సైతం దిక్కూ మొక్కూ లేకుండా పోతోంది. 

దేశంలో ఇంతవరకూ కృష్ణా ట్రిబ్యునల్‌–1, గోదావరి ట్రిబ్యునల్, నర్మద ట్రిబ్యునల్‌ మాత్రమే అవార్డులు ప్రకటించాయి. మిగిలినవి ప్రకటించినా వివిధ దశల్లో ఆగిపోయాయి. కొన్ని అవా ర్డులపై వివాదాలు సుప్రీంకోర్టుకెళ్లాయి. ఇవిగాక మహారాష్ట్రలోని బాభలీ ప్రాజెక్టుపై 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు, ముళ్ల పెరియార్‌ డ్యామ్‌ వివా దం విషయంలో అదే కోర్టు 2014లో ఇచ్చిన ఆదేశాల అమలుకు కేంద్రం ముగ్గురు సభ్యులతో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రపంచ పునరుత్పాదక జల వనరుల్లో మన దేశంలో ఉన్నవి కేవలం 4 శాతం మాత్రమే. ప్రకృతి సహకరిస్తే సమృద్ధిగా వానలు పడతాయి. నదులు, సరస్సులు, చెరువులు, కుంటలు నిండుతాయి. అది పగబడితే చుక్క నీటికి దిక్కుండదు. భూగర్భ జలాలు కూడా అడుగంటుతాయి. వాతావరణంలో పెనుమార్పుల పర్యవ సానంగా రుతువులు గతి తప్పుతున్నాయి. అయితే అతివృష్టి...లేకపోతే అనావృష్టి తప్ప సవ్యంగా వర్షాలు పడటం అరుదుగా మారింది. కనుక ఉన్నకొద్దీ జలవివా దాలు పెరుగుతాయే తప్ప తగ్గవు. అయితే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ సమస్యపై నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి, శాశ్వత పరిష్కారం కనుగొన డానికి ముందుకు రావడం లేదు. 

సమస్య తలెత్తినప్పుడు తాత్కాలికంగా సర్దుబాటు చేసి, గండం గట్టెక్కితే చాలనుకుంటున్నారు. ట్రిబ్యునళ్లు అవార్డులివ్వ డంలో జాప్యం చేసినా, ఇచ్చిన అవార్డుల అమలు అసాధ్యమవుతున్నా పట్టిం చుకునే దిక్కులేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, డిక్రీలు సైతం బేఖాతరైన సందర్భాలు న్నాయి. ప్రతి అవార్డుపైనా, ఆదేశాలపైనా తిరిగి న్యాయస్థానాలను ఆశ్రయించడం పరిపాటి. ఇతరత్రా సమయాల్లో జాతి గురించి, జాతి ప్రయోజనాల గురించి గుండెలు బాదుకునేవారు నదీజలాల వివాదం వచ్చేసరికి ‘ప్రాంతీయ పూనకం’లో అన్నీ మరిచిపోతారు. చర్చలకంటే, పరిష్కారాలకంటే స్థానికుల్ని రెచ్చగొట్టడమే పార్టీలకు ప్రధానమైపోతుంది. వివాద పరిష్కారంలో జాప్యం జరిగితే అది మరింత ఉగ్రరూపం దాలుస్తుంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌ల మధ్య ఉన్న రావి– బియాస్‌ వివాదం మొదలై 31 ఏళ్లవుతోంది. 

ఇప్పుడున్న ట్రిబ్యునళ్లను రద్దు చేసి వాటిస్థానంలో బహుళ బెంచ్‌లు ఉండే ఒక శాశ్వత ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని రెండేళ్లక్రితం కేంద్రం నిర్ణయించింది. అందు కోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల(సవరణ)బిల్లు రూపొందించింది. నిరుడు మార్చిలో లోక్‌సభలో ఆ బిల్లు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఏ వివాదాన్నయినా ముందు నిపుణుల కమిటీ పరిశీలించి ఏడాదిలోగా ఒక పరిష్కారాన్ని సూచిస్తుంది. అప్పటికీ వివాదం సమసిపోనట్టయితే అది ట్రిబ్యునల్‌ ముందుకొస్తుంది. అలాగే నిరంతరం వివిధ నదుల్లోని జల పరిమాణానికి సంబంధించిన డేటా సేకరణకు ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పుతారు. ఈ బిల్లులో ఇతర అంశాలేమిటి, వాటిలోని లోటు పాట్లేమిటన్న సంగతలా ఉంచి దానిపై ఇంకా చర్చే మొదలుకాలేదు. కనీసం వచ్చే సమావేశాల్లోనైనా దానిపై లోతుగా చర్చించి వీలైనంత త్వరలో చట్టం చేసి పనులు మొదలు పెడితే మహాదాయిలాంటి అనేక వివాదాల పరిష్కారంవైపు తొలి అడుగు పడుతుంది. అందుకోసం అందరూ చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement