కర్ణాటక హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ సంస్థల బిల్లు ఉపసంహరణకు ప్రభుత్వం మొగ్గు
బెంగళూరు: విపక్షాలతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన ధార్మిక సంస్థల నుంచి పూర్తీ వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఇటీవల శీతాకాల శాసనసభ సమావేశాల్లో అనుమతి పొందిన కర్ణాటక హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ సంస్థల (సవరణ) బిల్లు అమలు కాకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రి మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రి మండలిలో ‘బిల్లు’ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయంలో అందరు మంత్రులతో పాటు సీఎం సిద్ధరామయ్య కూడా ‘బిల్లు’ను అమల్లోకి తీసుకువస్తే ఎదుర్కొవాల్సిన పరిణామాలను న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్రకు వివరించారు. సుప్రీం కోర్టు సూచనలమేరకే నూతన బిల్లును రూపొందించాల్సి వచ్చిందని టీ.బీ జయచంద్ర ఇచ్చిన వివరణతో ఎవరూ సంతృప్తి చెందలేదు.
అంతేకాకుండా రాష్ట్రంలోని ధార్మిక సంస్థలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రస్తుతం ఉన్న బిల్లు కాకుండా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దీంతో అడ్వొకేట్ జనరల్‌తో చర్చించి ఆ మేరకు ఏర్పాట్లు చూస్తానని టీ.బీ జయచంద్ర పేర్కొన్నారు. కాగా, ఈ విషయమై టీ.బీ జయచంద్ర మీడియాతో మాట్లాడుతూ... బిల్లు తేవడం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. అయితే సుప్రీం కోర్టు సూచనల మేరకే తాము నూతన బిల్లును తీసుకురావాల్సి వస్తోందన్నారు. ఈ విషయాలను పేర్కొంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రంలోని అన్ని ధార్మిక సంస్థల అధిపతులకు లేఖలు రాయనున్నారని తెలిపారు.
ఆ బిల్లు వెనక్కు
Published Wed, Dec 24 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM
Advertisement