
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) నుంచి చందాదారులు తమ నిధులను ఉపసంహరించుకునే సమయంలో ‘పెన్నీ డ్రాప్’ ధ్రువీకరణను పింఛను నిధి అభివృద్ధి, నియంత్రణ మండలి (పీఎఫ్‌ఆర్‌డీఏ) ప్రవేశపెట్టింది. పెన్నీడ్రాప్ విధానంలో చందాదారు బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరు, ఎన్‌పీఎస్‌లోని పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్‌లోని పేరు ఏక రూపంలో ఉందా అన్నది సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్‌ఏ) తనిఖీ చేస్తుంది. ఎన్‌పీఎస్‌తోపాటు ఎన్‌పీఎస్ లైట్, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)కు సంబంధించి అన్ని రకాల ఉపసంహరణలు, వైదొలగడాలు, చందాదారు బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులకు నూతన విధానం అమలు కానుంది.
దీన్ని ఎలా చేస్తారంటే.. చందాదారు బ్యాంక్ ఖాతాలోకి చాలా స్వల్ప మొత్తాన్ని (రూపాయి) బదిలీ చేస్తారు. తద్వారా బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరును ధ్రువీకరించుకుంటారు. నిధుల ఉపసంహరణకే కాకుండా, చందాదారులు తమ బ్యాంక్ ఖాతా వివరాల అప్‌డేట్‌కు దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు. ఈ పెన్నీడ్రాప్ విధానంలో ధ్రువీకరణ విజయవంతం కాకపోతే, నోడల్ ఆఫీస్ సహకారాన్ని సీఆర్‌ఏ తీసుకుంటుంది. పెన్నీడ్రాప్ విఫలమైందని, సమీప నోడల్ ఆఫీస్ లేదా పీవోపీని సంప్రందించాలంటూ చందాదారులకు ఈ మెయిల్, మొబైల్ ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. చందాదారు నుంచి సరైన వివరాలు అందేంత వరకు నిధుల బదిలీని నిలిపివేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment