ఆ ఎమ్మెల్యే ఎక్కడ?
ఇక్కడి యూబీ సిటీలోని స్కై బార్‌లో పోలీసులపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ ఈ కేసు దర్యాప్తును సీసీబీకి అప్పగించారు. అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరుడు, ఈ కేసులో తొలి నిందితుడు సోమశేఖర్ గౌడ ఇక్కడి సెషన్స్ కోర్టులో ముంద స్తు బెయిల్ కోసం అర్జీలు సమర్పించారు.
మరో వైపు నిర్ణీత సమయం గడిచి పోయినా బార్‌ను ఎందుకు తెరిచి ఉంచారంటూ అబ్కారీ శాఖ స్కై బార్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. గత మంగళవారం రాత్రి ఒకటిన్నర వరకు బార్‌ను తెరచి ఉంచడం, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. నోటీసుకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి వారం గడువు ఇచ్చారు. ఆలోగా సమాధానం రాకపోతే లెసైన్స్‌ను రద్దు చేస్తామని అబ్కారీ శాఖ నోటీసులో పేర్కొంది.