తన బలాన్ని నిరూపించుకునే రీతిలో హంగు ఆర్బాటలతో జన్మదిన వేడుకను గురువారం అళగిరి జరుపుకున్నారు. మద్దతుదారులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఏ నిర్ణయం తీసుకున్నా ‘అన్న’ వెంటేనని స్పష్టం చేశారు. ముగ్గురు ఎంపీలు అళగిరితో భేటీ కావడం డీఎంకేలో చర్చనీయాంశంగా మారింది.
సాక్షి, చెన్నై: డీఎంకేలో అళగిరి వివాదం రక్తికట్టిస్తూ వస్తు న్న విషయం తెలిసిందే. సస్పెన్షన్, పోస్టర్ల యుద్ధం, రోజు కో వ్యాఖ్యలతో సమరం వెరసి పార్టీలో గందరగోళం నెల కొంది. అళగిరి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారోనన్న ఉత్కంఠ పెరిగింది. ఈ పరిస్థితుల్లో గురువారం తన 63వ జన్మదినాన్ని బల నిరూపణకు వేదికగా అళగిరి చేసుకున్నా రు. తన సత్తా ఏమిటో అధిష్టానానికి చాటే విధంగా, దక్షిణాదిలో కొనసాగుతున్న తన హవాను నిరూపించుకునే రీతిలో పుట్టిన రోజు వేడుకను అళగిరి జరుపుకున్నారు. బర్తడే: అళగిరి బర్త్‌డే వేడుకకు ఆయన మద్దతుదారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆయన మద్దతు నేతలు మన్నన్, గౌష్‌బాషా, ఉదయకుమార్, శివకుమార్,
ఎంఎల్ రాజా, అరుణ్‌కుమార్, ముబారక్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎటు చూసినా అళగిరి ఫ్లక్సీలు, బ్యానర్లతో మదురై నిండింది. ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోష్, అన్నా దురై, అబ్దుల్ కలాం, కరుణానిధి చిత్ర పటాల్ని ముద్రించారు. మహా నేతల మార్గదర్శకంలో అళగిరి ముందడుగు వేస్తున్నారన్న నినాదాల్ని అందులో పొందు పరచడం గమనార్హం. ఉదయం 9 గంటలకు కుటుంబంతో కలసి జన్మదిన వేడుకను అళగిరి జరుపుకున్నారు. సత్యానగర్‌లోని నివాసంలో సతీమణి గాంధీ, తనయుడు దురై దయానిధి, కోడలు అనుషా, కుమార్తె కయల్ వెళి, అల్లుడు వెంకటేష్‌తో కలసి కేక్ కట్ చేశారు. అత్యంత సన్నిహితులుగా ఉన్న మద్దతుదారులతో సమాలోచన జరిపారు.
అనంతరం ఇంటి నుంచి భారీ హంగామాతో రాజాముత్తయ్య మండ్రంకు చేరుకున్నారు. మేళతాళాలు, కోలాటాలు, మైలాటం, గరగాట్టం సంగీత సాంస్కృతిక కార్యక్రమాల నడుమ, మద్దతుదారుల ఆహ్వానాన్ని అళగిరి అందుకున్నారు. 630 కిలోలతో రూపొందించిన కేక్‌ను ఆయన కట్ చేశారు. పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల్ని, వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లు, స్కూటర్లు, మహిళలకు కుట్టు మిషన్లు వంటివి పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున జనం, డీఎంకే శ్రేణులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. కొందరు డీఎంకే కండువా, జెండాల్ని సైతం చేతబట్టి తరలి వచ్చారు.ఎంతో ఆనందం: ఈ ఏడాది తన జన్మదినోత్సవం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అళగిరి చిరునవ్వులు చిందిస్తూ మీడియా దృష్టికి తెచ్చారు. ఇది వరకు తాను ఎన్నో జన్మదిన వేడుకల్ని జరుపుకున్నానని, అయితే, ఈ వేడుక ఇచ్చినంత ఆనందం అప్పట్లో కలగలేదని పేర్కొన్నారు. తన మద్దతుదారులు, తన కోసం తరలి వచ్చిన జన సందోహానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఆయన మీడియూతో మాట్లాడారు.
డీఎంకే నుంచి శుభాకాంక్షలు వచ్చాయా? అంటే, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుభాకాంక్షలు తెలియజేశారని చెప్పారు. డీఎంకేతో సంధి యత్నాలు జరిగాయా? అంటే డీఎంకే నుంచి తనను ఏ ఒక్కరూ కలవలేదని, మద్దతుదారులు మాత్రం వచ్చారని పేర్కొన్నారు. తమరి నిర్ణయం ఏంటో చెప్పండి? అని ప్రశ్నించగా ఒక్క రాత్రి వేచి చూడండంటూ ముగించారు. అనంతరం తన మద్దతు దారులతో మంతనాల్లో మునిగారు. ముగ్గురు ఎంపీల భేటీ: అళగిరి బర్త్‌డేలో ముగ్గురు ఎంపీలు ప్రత్యక్షం కావడం డీఎంకేలో చర్చనీయాంశంగా మారిం ది. డీఎంకే ఎంపీలు నెపోలియన్, రితీష్, కేపీ రామలింగం తో ఉదయం సత్యానగర్ ఇంట్లో అళగిరితో భేటీ అయ్యా రు. ఆయనతో పాటుగా రాజాముత్తయ్య మండ్రంకు వచ్చారు. వీరిని మీడియా కదిలించింది. రితీష్ మాట్లాడుతూ రాజకీయంగా తనకు అన్నీ అన్న మాత్రమేనని, ఆయన వెంటే ఉంటానన్నారు.
ఆయన తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. తాను ఇన్నాళ్లు అమెరికాలో ఉన్నానని, ఇక్కడికి వచ్చేలోపు ఎన్నో చేదు సంఘటనలు వినాల్సి వచ్చిందని నెపోలియన్ అన్నారు. వివాదాలన్నీ సమసి పోవాలని కాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అళగిరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, అందుకు కట్టుబడేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. కేపీ రామలింగం మీడియా ప్రశ్నలకు చిరునవ్వులు చిందిస్తూ ముందుకు సాగడం గమనార్హం. ఈ ముగ్గురు ఎంపీలతో పాటుగా, పలువురు దక్షిణాది జిల్లాల నాయకులు అళగిరిని కలుసుకోవడం డీఎంకేలో చర్చనీయాంశంగా మారింది.
స్టాలిన్‌కు జెడ్ ప్లస్: అళగిరి వ్యాఖ్యల నేపథ్యంలో డీఎంకే కోశాధికారి స్టాలిన్‌కు భద్రతను పెంచేందుకు కేంద్ర హోం శాఖ ప్రయత్నాలు చేపట్టింది. స్టాలిన్‌కు భద్రత పెంచాలంటూ డీఎంకే అధినేత కరుణానిధి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. ఈ లేఖ కేంద్ర హోం శాఖ చెంతకు చేరింది. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, డీఎంకే పార్లమెంటరీ నేత టీ ఆర్ బాలు స్టాలిన్ భద్రత పెంపులో కీలక భూమిక పోషిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. మన్మోహన్ సింగ్ ఆమోదముద్ర వేయడంతో చకచకా భద్రతా పనులు సాగుతోన్నాయి. తద్వారా ఆయన వెంట భద్రతకు 36 మందితో కూడిన కేంద్ర బలగం, బ్లాక్ క్యాట్ కమాండోలు విధులు నిర్వర్తించబోతున్నారు. రాష్ట్రంలో ఈ భద్రత సీఎం జయలలితకు, డీఎంకే అధినేత ఎం కరుణానిధికి మాత్రమే ఉంది.