వార్నింగ్!
సాక్షి, చెన్నై: పెద్ద కుమారుడు అళగిరి తీరు డీఎంకే అధినేత ఎం కరుణానిధికి ఆగ్రహం తెప్పించింది. అళగిరి వర్గానికి షాక్ ఇచ్చే నిర్ణయాన్ని మంగళవారం ఆయన తీసుకున్నారు. తీవ్రంగా స్పందిస్తూ వార్నింగ్‌లు ఇచ్చారు. పార్టీకి, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎంతటివారైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడానికీ వెనుకాడబోమని తేల్చేశారు. డీఎంకేలో సాగుతున్న వారసత్వ సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు రోజుల క్రితం కరుణానిధి పెద్దకుమారుడు ఎంకే అళగిరి టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ చర్చకు దారి తీసింది. సోదరుడు, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకంగా, డీఎండీకే అధినేత విజయకాంత్ శైలిని తప్పుబడుతూ అళగిరి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. ఆ ఇంటర్వ్యూ ద్వారా తన మదిలో ఉన్న వేదనను అళగిరి ఏకరువు పెట్టడంతో పెద్దకుమారుడిపై కరుణానిధి సానుభూతి చూపించారు. అతడ్ని బుజ్జగించడంతో పాటుగా, అన్నదమ్ముళ్ల మధ్య సంధికి చర్యలు చేపట్టారు. అయితే, అళగిరి ఏ మాత్రం తగ్గనట్టు సమాచారం. దూతల వద్ద మరింత ఘాటుగా స్పందించినట్టు తెలిసింది.
అదే సమయంలో తన మద్దతుదారులను ఏకం చేసి భవిష్యత్తు కార్యాచరణ దిశగా అళగిరి చకచకా పావులు కదుపుతుండడంతో అధిష్టానం మేల్కొంది. అళగిరి స్పీడుకు బ్రేక్ వేస్తూ, ఆయన మద్దతుదారులకు షాక్ కల్గించే రీతిలో మంగళవారం వార్నింగ్ ఇవ్వడం చర్చకు దారి తీసింది. స్టాలిన్‌పై చేసిన వ్యాఖ్యలతో పాటుగా ప్రధానంగా డీఎండీకే అధినేత విజయకాంత్‌ను ఉద్దేశించి అళగిరి చేసిన తీవ్ర వ్యాఖ్యల్ని అధిష్టానం పరిగణనలోకి తీసుకుంది. ఆ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ, స్వయంగా అధినేత కరుణానిధి హెచ్చరికలు జారీ చేయడం అళగిరి వర్గాన్ని కలవరంలో పడేసింది. హెచ్చరిక : కరుణానిధి అన్నా అరివాళయూనికి ప్రతి రోజూ తప్పని సరిగా వస్తారు. అయితే, సోమవారం అరివాళయం వైపు ఆయన కన్నెత్తి చూడ లేదు. దీంతో అళగిరి వ్యాఖ్యలపై కరుణానిధి షాక్‌కు గురయ్యారా..? అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ ప్రశ్నకు బ్రేక్ వేస్తూ మంగళవారం ఉదయం అరివాళయూనికి రాగానే, పార్టీ వర్గాలతో అళగిరి తీరుపై చర్చించినట్టు సమాచారం.
కాసేపటికి హెచ్చరికలతో కూడిన ప్రకటన వెలువడింది. డీఎండీకే తమతో దోస్తీ కడితే ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇది తమకు ఎంతో ఆనందం అంటూ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గతంలో తాను స్పష్టం చేశానని, అయితే, తన వ్యాఖ్యల్నే ధిక్కరించే విధంగా అళగిరి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నట్టు పేర్కొన్నారు. డీఎండీకేతో దోస్తీ వద్దంటూ అళగిరి చేసిన వ్యాఖ్యతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నట్టు గుర్తు చేశారు. పార్టీ నాయకులకు, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలకు నిందలను ఇతరుల మీద వేయడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఎంతటి వారైనా సరే క్రమ శిక్షణ చర్యలకు గురి కావాల్సి ఉంటుందని, పార్టీ సభ్యత్వం నుంచి కూడా ఉద్వాసన పలకాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం.
పొత్తు కోసమేనా: డీఎండీకే ఓట్లు తమకు తప్పనిసరి కావడంతోనే అళగిరి వ్యాఖ్యలపై కరుణానిధి తీవ్రంగా స్పందించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తమతో కలసి అడుగులు వేయడానికి డీఎండీకేలో చర్చ సాగుతున్న తరుణంలో అళగిరి వ్యాఖ్యలు ఆ ప్రయత్నాలకు మొకాలొడ్డేలా ఉండటంతో కరుణానిధి మేల్కొనట్టు చెబుతున్నారు. అందుకే విజయకాంత్‌ను మెప్పించడం లక్ష్యంగా అళగిరికి షాక్ ఇచ్చినట్టు పేర్కొంటున్నారు. అయితే, అళగిరి వెంట నడిచే వాళ్లు డీఎంకేలో లేరన్న విషయాన్ని గ్రహించే కరుణానిధి తీవ్రంగా స్పందించినట్టు మరి కొందరు పేర్కొంటుండటం గమనార్హం. గతంలో అళగిరి వెంట ఉన్న నాయకులు, దక్షిణాది జిల్లాల పార్టీ కార్యదర్శుల్లో ఒకరు మినహా తక్కిన వారందరూ స్టాలిన్ పక్షాన చేరిపోయూరు.