కెంపేగౌడ ప్రాధికార అభివృద్ధిపై సర్కార్ ద్వంద్వ నీతి
కోలారు : సంగొళ్లి రాయణ్ణ ప్రాధికార అభివృద్ధికి రూ.50 కోట్లు రిజర్వు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... కెంపేగౌడ ప్రాధికారకు రూ.5 కోట్లు కేటాయించి ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తోందని పట్టనాయనకనహళ్లి స్పటికపుర పీఠాధ్యక్షుడు నంజావధూత స్వామిజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం ముందు జిల్లా ఒక్కలిగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నాడప్రభు కెంపేగౌడ 506వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
స్వాంతంత్య్రం కోసం పోరాటాలు సాగించిన సంగొళ్లి రాయణ్ణపై తమకు గౌరవం ఉందని, అయితే కెంపేగౌడ ప్రాధికార అభివృద్ధికి రూ. 5 కోట్లు మాత్రమే రిజర్వు చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం అర్థం కావడం లేదన్నారు.ప్రభుత్వం దార్శనికుల జయంతులను ప్రభుత్వ సెలవులుగా ప్రకటించి కెంపేగౌడ జయంతి విషయంలో మాత్రం ప్రభుత్వం ద్వంద్వ నీతిని అనుసరిస్తోందన్నారు. తమకు నామమాత్రపు ప్రాధికారం అవసరం లేదని, కెంపేగౌడ నిర్మించిన వందల చెరువులను ప్రభుత్వం పునరుద్ధరిస్తే చాలన్నారు. కెంపేగౌడ జన్మస్థలం, కుణిగల్‌లో కట్టిన కోటలను అభివృద్ధి చేయాలని, కెంపేగౌడ ప్రాధికారకు 100 కోట్లు ఇవ్వాలని డిమాండు చేశారు.
దివంగత ఐఏఎస్ డీకే రవి ఎలా మృతి చెందాడో ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలన్నారు. కోలారు జిల్లాకు శాశ్విత నీటిపారుదల సౌలభ్యాలను అందించడానికి ప్రభుత్వం ఆసక్తిని కనపర్చాలన్నారు. విశ్వ ఒక్కలిగుల మఠం చంద్రశేఖరస్వామిజీ మాట్లాడుతూ నీటి పారుదల సౌలభ్యాలను అందించే విషయంలో ప్రభుత్వం సవతి తల్లి ధోరణిని ప్రదన్శిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో ఒక్కలిగుల సంఘం డెరైక్టర్ డాక్టర్ రమేష్, రాష్ట్ర ఒక్కలిగుల సంఘం అధ్యక్షుడు అప్పాజిగౌడ, జిల్లాధ్యక్షుడు కేవీ శంకరప్ప, గౌరవ అధ్యక్షుడు బిసప్పగౌడ, డీసీసీ బ్యాంకు అధ్యక్షుడు బ్యాలహళ్లి గోవిందగౌడ, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.