హతమార్చండి!
♦ పోలీస్ స్టేషన్లను కూల్చి పోలీసులను చంపేయండి
♦ కోవైలో మావోల కలకలం
♦ పోలీసులకు సవాల్‌గా పోస్టర్ల ప్రచారం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు పోలీసులకు మావోయిస్టులు మరోసారి సవాల్ విసిరారు. మద్యం అమ్మకాలకు మద్దతు పలుకుతున్న పోలీసులను హతమార్చి, పోలీస్‌స్టేషన్లను కూల్చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. తమిళనాడు-కేరళ సరిహద్దుల్లో గత కొంతకాలంగా మావోయిస్టులు సంచరిస్తున్నారు. రెండు రాష్ట్రాలు అనేకసార్లు కూంబింగ్ జరిపినా పట్టుబడలేదు. అడవులకే పరిమితమై ఉన్న మావోయిస్టులు కొన్ని నెలల క్రితం నిత్యావసర సరకుల కోసం జనారణ్యంలోకి అడుగుపెట్టారు.
కోవైలో కొత్తవారు సంచరించినట్లు పోలీసులు తెలుసుకుని అప్రమత్తమైనా అప్పటికే వారు అడవుల్లోకి జారుకున్నారు. జనంలోకి రావడం, అడదాదడపా దాడులు చేయడం ద్వారా పోలీసులకు సవాళ్లు విసురుతూనే ఉన్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు, అటవీశాఖాధికారులు అనేక సార్లు అడవులను ముట్టడించినా ఫలితం లేకపోయింది. సుమారు 40 మంది వరకు మావోయిస్టులు ఉండవచ్చని అంచనా.
కలకలం రేపిన పోస్టర్లు: ఇదిలా ఉండగా, కోవైలో అకస్మాత్తుగా వెలిసిన పోస్టర్లు ప్రజలను, పోలీసులను కలవరపెడుతున్నాయి. పాలక్కాడు జిల్లా అట్టపాడి పుదూర్ గ్రామ పంచాయితీ పరిధిలో ఎలచ్చి అనే ప్రాంతంలో రేషన్, ఫలసరుకుల, టీ దుకాణాల వద్ద శుక్రవారం రాత్రి మావోయిస్టులు పోస్టర్లు అంటించారు. బెంబేలు పడిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో పోస్టర్ల వద్దకు చేరుకున్నారు. ‘తమిళనాడు ప్రభుత్వానికి సొంతమైన మద్యం దుకాణాలను మూసివేయాలని, మద్యం అమ్మకాలను నిరసిస్తూ మహిళలు నిర్వహిస్తున్న ఆందోళనలకు ప్రజలు మద్దతు తెలిపాలని పోస్టర్లలో పేర్కొన్నారు.
అవసరం లేకుండే నిర్వహిస్తున్న ఎన్నికలను బహిష్కరించాలని మావోలు పిలుపునిచ్చారు. అనైకట్టిలో నడుస్తున్న మద్యం దుకాణాలకు పోలీసులే అండగా నిలుస్తున్నందున కోవైలోని అన్ని పోలీస్‌స్టేషన్లను కూల్చేయాల్సిందిగా కోరారు. ఆదివాసులను బెదిరించే అబ్కారీశాఖ అధికారులను హతమార్చండి అని పోస్టర్లలో పేర్కొన్నారు. తమిళం, మలయాళం భాషల్లో ఈ పోస్టర్లను ముద్రించి గోడలకు అంటించారు. గోడలకు ఉన్న పోస్టర్లను పోలీసులు తొలగించి విచారణ ప్రారంభించారు. పోస్టర్ల ద్వారా అందిన బెదిరింపులతో పోలీస్‌స్టేషన్లకు బందోబస్తు పెంచారు.