అక్రమాలకు పాల్పడ్డ ఇంజినీర్లకు ఓ అమాత్యుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తప్పు చేసామని ఒప్పుకుంటే క్షమించి ....
అక్రమాలకు పాల్పడ్డ ఇంజినీర్లకు మంత్రి బంపర్ ఆఫర్
బెంగళూరు: అక్రమాలకు పాల్పడ్డ ఇంజినీర్లకు ఓ అమాత్యుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తప్పు చేసామని ఒప్పుకుంటే క్షమించి వదిలేస్తానని చెప్పారు. రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ఉత్పత్తి పథకానికి సంబంధించి అక్రమాలకు పాల్పడిన ఇంజనీర్లు స్వయంగా తమ తప్పును ఒప్పుకుంటే సస్పెండ్ చేయబోనని ఇంధనశాఖ మంత్రి డీ.కే శివకుమార్ తెలిపారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ఉత్పత్తిలో అవకతవకలకు పాల్పడిన 9 మందిని ఇప్పటికే సస్పెండ్ చేశామన్నారు.
ఈ పథకానికి సంబందించి మరో 50 మంచి ఇంజినీర్లు కూడా అక్రమాలకు పాల్పడ్డారని తెలిసిందన్నారు. ఇందుకు సంబంధించి వారే తన వద్దకు వచ్చి స్వయంగా తప్పును ఒప్పుకుంటే క్షమిస్తానన్నారు. లేదంటే సస్పెండ్ చేస్తానని తెలిపారు. మంత్రి డీ.కే శివకుమార్ తప్పుచేసిన వారిని చట్టం ప్రకారం శిక్షించాల్సింది పోయి క్షమిస్తానని చెప్పడం చర్చనీయాంశమైంది.