వేలూరు, తిరువణ్ణామలైలో డీఎంకే ధర్నా
వేలూరు, తిరువణ్ణామలైలో డీఎంకే ధర్నా
Published Tue, Nov 29 2016 2:21 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
వేలూరు: పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో డీఎంకే ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వంపై నిరసనగా డీఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. అందులో భాగంగా వేలూరు ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట డీఎంకే ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద నోట్లు చెల్లవని రాత్రికి రాత్రి ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ధర్నా అనంతరం చెన్నైలో నిర్వహించిన ధర్నాలో ముకా స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని తెలుసుకున్న కార్యకర్తలు అన్నారోడ్డులో అడ్డంగా కూర్చొని రాస్తారోకో చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న తమను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని నినాదాలు చేశారు. పోలీసులు ఎంత చెప్పినప్పటికీ రాస్తారోకోను విరమించక పోవడంతో పోలీసులు చేసేది లేక రాస్తారోకోలో పాల్గొన్న ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అదే విధంగా తిరుపత్తూరు,రాణిపేట, గుడియాత్తం వంటి ప్రాంతాల్లో రాస్తారోకో చేసిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరువణ్ణామలైలో...
తిరువణ్ణామలై జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద డీఎంకే జిల్లా కార్యదర్శి, మాజీ మంత్రి ఏవా వేలు అద్యక్షతన ధర్నా నిర్వహించారు. పెద్ద నోట్లు చెల్లవని ఈ నెల 8వ తేదిన ప్రధాని మోదీ ప్రకటించినప్పటి నుంచి దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే పిచ్చాండి, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement