సాక్షి, చెన్నై: నామినేషన్ల హోరుతో స్థానిక సమరంలో గురువారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకేల జాబితాల విడుదల హోరెత్తుతున్నాయి. అదే సమయంలో కొన్ని చోట్ల అభ్యర్థులకు వ్యతిరేకంగా నిరసనల్లో అన్నాడీఎంకే శ్రేణులు ఏ మాత్రం తగ్గడం లేదు. కాగా, డీఎంకే జాబితాల విడుదల కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేస్తున్నది. అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సీపీఐ కార్యాలయం మెట్ల ఎక్కడం చర్చకు దారి తీసిం ది. ఇక, తమిళ మానిల కాంగ్రెస్, బీజేపీ, డీఎండీకేలు ఒంట రి నినాదంతో తమకు పట్టున్న చోట్ల అభ్యర్థుల్ని బరిలో దించుతూ తొలి జాబితాలను విడుదల చేశాయి.
చివరకు తాము ఎన్నికలకు దూరం అంటూ తమిళర్‌వాల్వురిమై కట్చి ప్రకటించింది. స్థానిక ఎన్నికల నామినేషన్ల పర్వం అక్టోబర్ మూడో తేదీతో ముగియనుంది. దీంతో ఆయా రాజకీయ పక్షాలు జాబితాల్ని విడుదల చేసే పనిలో బిజిబిజీగా ఉన్నాయి. ప్రధానంగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పట్టణ, యూనియన్, జిల్లా పంచాయతీల్లో సమరం అన్నది స్థానిక నేతల బల బలాలతో పాటుగా ఆయా పార్టీల ఓటు బ్యాంక్ మేరకు గెలుపును నిర్ణయించనుంది. దీంతో ఆయా పదవులకు అర్హులైన నేతల్ని ఎంపిక చేసి జాబితాల్ని అందరి కన్నా ముందుగా, అన్నాడీఎంకే విడుదల చేస్తూ వస్తున్నది.
తాజాగా పట్టణ, యూనియన్ పంచాయతీల రేసులో నిలబడే వార్డు సభ్యుల జాబితాను ప్రకటించింది. ఇక, డీఎంకే అయితే, ఆయా జిల్లాల కార్యదర్శులకు అధికారం ఇవ్వడంతో, అధిష్టానం దృష్టికి అభ్యర్థుల వివరాల్ని తీసుకురావడం, జాబితాల్ని ప్రకటించడం జోరందుకుంది. అదే సమయంలో అన్నాడీఎంకేలో అయితే, నిరసనలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకు ప్రకటించిన వారిలో మెజారిటీ శాతం మందిని తొలగించాలని పట్టుబడుతూ ఆ పార్టీ వర్గాలు ఉదయం పోయెస్ గార్డెన్ వైపుగా క దలడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాయపేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ముట్టడికి యత్నించడంతో నిరసన కారుల్ని బుజ్జగించేందుకు అక్కడి నేతలు శ్రమించాల్సిన పరిస్థితి.
కాంగ్రెస్‌కు చిక్కులు: డీఎంకే జిల్లాల కార్యదర్శులు జాబితాల విడుదల బిజీగా ఉండడంతో ఆ కూటమిలో ఉన్న కాంగ్రెస్ వర్గాలకు చిక్కులు తప్పడం లేదు. సీట్ల సర్దుబాటు ఓ వైపు సాగుతుంటే, మరో వైపు అభ్యర్థుల చిట్టాల్ని డీఎంకే ప్రకటిస్తూ వెళ్తుండడంతో ఆ పార్టీ వర్గాల్ని అయోమయంలో పడేశాయి. అదే సమయంలో మొక్కుబడిగా సీట్ల కేటాయింపులు సాగుతుండడంతో కాంగ్రెస్ వర్గాలు తర్జన భర్జన పడడంతో పాటు, డీఎంకే అధినేత కరుణానిధి వద్దకు పరుగులు పెట్టే పనిలో పడ్డారు. ఈ ప్రయత్నాలు ఓ వైపుంటే, రాష్ట్ర కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు తిరునావుక్కరసర్, పార్టీ ప్రధాన కార్యదర్శి చిరంజీవి సీపీఐ కార్యాలయం మెట్లు ఎక్కడం చర్చకు దారి తీసింది.
అయితే, సీపీఐ నేత ముత్తరసన్‌తో భేటీ మర్యాదే అంటూ తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించినా, మీడియా వదలి పెట్టదుగా. బూతద్దం పెట్టి మరీ ఆంతర్యాన్ని కని పెట్టే పనిలో పడ్డాయి. ఇక, తమకు సీట్లు ఇంకా కేటాయించని దృష్ట్యా, డీఎంకే కూటమిలో ఉన్న ఎంఎంకే నేత జవహరుల్లా ఆ పార్టీ దళపతి వద్దకు పరుగులు తీశారు. ఆశాజనకంగా ఆయా స్థానిక సంస్థలో అరకొరా సీట్ల పొత్తు బేరాలు సాగడంతో అభ్యర్థుల ఎంపిక మీద జవహరుల్లా దృష్టి పెట్టే పనిలో పడ్డారు. కాగా, డీఎంకే వైపు చూపు మరల్చే విధంగా మక్కల్ ఇయక్కంలో ఉన్న వీసీకే నేత తిరుమావళవన్ స్పందించడం గమనార్హం.
ఒంటరిగా బరిలో: అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లను గల్లంతు చేసుకున్న వాళ్లు స్థానిక రేసులో ఉంటారా..? అన్న ఎదురు చూపులు సాగిన నేపథ్యంలో తామూ ఒంటరే..అని తమిళ మానిల కాంగ్రెస్, బీజేపీ, డీఎండీకేలు తొలి జాబితాల్ని ప్రకటించాయి. డీఎంకే అక్కున చేర్చుకుంటుందని ఎదురు చూసి చివరకు ఒంటరిగా తొలి జాబితాను తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ ప్రకటించారు. చెన్నై కార్పొరేషన్‌లో 64, కోయంబత్తూరులో ఎనిమిది, ఈరోడ్‌లో 20, తిరుచ్చిలో 40, మదురైలో పది, తిరునల్వేలిలో ఆరు, సేలంలో నాలుగు, తిరుప్పూర్‌లో ఐదు, తంజావూరులో ఏడు, దిండుగల్‌లో ఐదు వార్డుల్లో అభ్యర్థులకు నిలబెట్టారు.
కేవలం తమకు పట్టున్న చోట్ల మాత్రమే అభ్యర్థులు రేసులో ఉంటారని, రోజుకో జాబితాను మూడు రోజుల పాటు ప్రకటించనున్నట్టు వాసన్ పేర్కొన్నారు. ఇక, బీజేపీ తమకు పట్టున్న కన్యాకుమారి జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులను బరిలోకి దించి ఉన్నది. ఇక, ఈరోడ్‌లో 24 వార్డు, తిరుప్పూర్‌లో 54 వార్డులకుగాను అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల ద్వారా కింగ్ కావాలని కలలు కని చివరకు చతికిలపడిన డీఎండీకే అధినేత విజయకాంత్ ఎట్టకేలకు బయటకు వచ్చి జాబితాను ప్రకటించారు.
చెన్నైలో రెండు వందల వార్డులకు గాను అభ్యర్థుల చిట్టాను ప్రకటించి, తమకు అభ్యర్థులు దొరికిన చోట పోటీ అన్నట్టుగా వ్యవహరించే పనిలో పడ్డారు. వీళ్లంతా ధైర్యం చేసి ఏదో పట్టున్న చోట్ల బలాన్ని చాటుకుందామని రేసులో ఉంటే, కావేరి నీళ్లు అన్నదాతలకు అందించడంలో పాలకుల వైఫల్యం అని నినదిస్తూ ఎన్నికల బహిష్కరణకు తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్‌మురుగన్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
అళగిరి వర్గంతో చిక్కు: డీఎంకే అభ్యర్థులకు దక్షిణ తమిళనాడులో అనేక చోట్ల ఆ పార్టీ బహిష్కృత నేత అళగిరి వర్గీయుల రూపంలో చిక్కులు బయలు దేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.
మదురై కార్పొరేషన్ పరిధిలోని వార్డులతో పాటు, తిరునల్వేలి, తూత్తుకుడి కార్పొరేషన్లలో, మున్సిపాలిటీ, యూనియన్, జిల్లా కమిటీల్లో డీఎంకే ముఖ్య నాయకులు బరిలో ఉండే వార్డుల్లో రేసులో దిగేందుకు అళగిరి వర్గీయులు సిద్ధమవుతున్నారు. వీళ్లంతా స్వతంత్ర అభ్యర్థులుగా సమరంలో డీఎంకే అభ్యర్థులకు చిక్కులు సృష్టించడం లక్ష్యంగా ముందుకు సాగనున్నట్టు సమాచారం.