సాక్షి, చెన్నై: రాష్ర్టం లోని జైళ్లలో ఏళ్ల తరబడి విచారణ ఖైదీలు గా మగ్గుతున్న వారికి విముక్తి కలగనుంది. జైళ్లలో అదాలత్‌కు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్రం లోని న్యాయ వర్గాలు ఆదివారం కారాగారాల బాట పట్టాయి. చిన్నచిన్న కేసుల్ని విచారించాయి. కొన్ని కేసుల కు సత్వర పరిష్కారం చూపించాయి. మరి కొన్నింటికి అపరాధం విధించి, విడుదలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో తొమ్మిది కేంద్ర కారాగారాలు, మరో తొమ్మిది జిల్లా, 95 సబ్ జైళ్లు, ఐదు స్పెషల్ జైళ్లు ఉన్నాయి. ఇందులో 4 వేల మంది వరకు శిక్ష ఎదుర్కొంటున్న వాళ్లు, 1500 మంది వరకు విచారణను ఎదుర్కొంటున్న వాళ్లు, మరో 5 వేల మంది వరకు రిమాండ్ ఖైదీలు ఉన్నారు. వీళ్లల్లో ఎక్కువ శాతం మంది ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న వారే. వీరికి విముక్తి కల్పించే విధంగా ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ై
జెళ్లలో అదాలత్ నిర్వహించి, చిన్న చిన్న కేసుల విచారణలను త్వరితగతిన ముగించేందుకు సూచనలు వెలువడ్డాయి. దీంతో రాష్ట్రంలోని న్యాయ వర్గాలు ఆదివారం ఉదయాన్నే కారాగారాల బాట పట్టాయి.చిన్న కేసులే: రాష్ట్రంలోని అన్ని జైళ్లలోనూ ఈ అదాలత్‌లు నిర్వహించారు. ఆయా జిల్లా మేజిస్ట్రేట్ల సమక్షంలో న్యాయమూర్తులు విచారణ చేపట్టారు. హత్య, హత్యాయత్నం, సంఘ విద్రోహ కార్యకలాపాలు తదితర ప్రధాన కేసులను పక్కన పెట్టి, చిన్న చిన్న కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వద్ద విచారణ చేపట్టారు. మూడేళ్లకు పైగా జైల్లో ఉన్న వారి వద్ద కూడా విచారణలు సాగాయి. చెన్నై పుళల్ కేంద్ర కారాగారంలో చెన్నై జిల్లా మేజిస్ట్రేట్ అందినాథన్, కాంచీపురం జిల్లా మేజిస్ట్రేట్ రాజమాణిక్యం, తిరువళ్లూరు జిల్లా మేజిస్ట్రేట్ మహ్మద్ నేతృత్వంలో 50 మంది న్యాయమూర్తులు, ప్రభుత్వ న్యాయవాదులు అదాలత్‌కు హాజరయ్యారు. వెయ్యి మంది ఖైదీలను వీరు విచారించి, అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించారు.
కొందరు ఖైదీలు ఇచ్చిన విజ్ఞాపన పత్రాలను స్వీకరించారు. మరికొందరు ఖైదీలకు అపరాధం విధించి, విడుదలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. వీరంతా సోమవారం సాయంత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి. తిరుచ్చి కేంద్ర కారాగారంలో జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర పది, కోయంబత్తూరు కేంద్ర కారాగారంలో మేజిస్ట్రేట్ మురళీ ధరన్, తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టై కేంద్ర కారాగారంలో మేజిస్ట్రేట్ తంగమణివన్నన్ నేతృత్వంలో విచారణలు సాగాయి. సేలం, మదురై, కడలూరు, పుదుకోట్టై జైళ్లలోను విచారణలు సాగాయి. ఆయా జైళ్లలో 50కు పైగా ఖైదీల విడుదలకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. వేలూరు కేంద్ర కారాగారంలో న్యాయమూర్తులు శివకటాక్షం, నజీర్ అహ్మద్, రేవతి, ప్రభాకరన్ నేతృత్వంలో విచారణలు సాగాయి. అపరాధం చెల్లించలేని స్థితిలో ఉన్న ఖైదీలు తమ, బంధువులకు సమాచారం పంపించి, ఆ మొత్తాన్ని చెల్లించిన అనంతరం విడుదలయ్యే విధంగా ఉత్తర్వులను న్యాయమూర్తులు ఇచ్చారు. తమ వాళ్లకు అదాలత్ ద్వారా విముక్తి కలుగుతుండడంతో అనేక మంది ఖైదీల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
జైలులో ‘అదాలత్’
Published Mon, Sep 8 2014 12:52 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement