సాక్షి, చెన్నై : లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో పెద్ద చర్చకే దారి తీసింది. కొన్నేళ్ల క్రితం సాధించిన రికార్డును తిరగ రాసే రీతిలో ఏక పక్షంగా వచ్చిన ఫలితాలు అనేక పార్టీలను డైలమాలో పడేశాయి. ఆయా పార్టీల అధ్యక్షులను కంగుతినిపించాయి. మోడీ హవా, అన్నాడీఎంకే మీదున్న వ్యతిరేకత తమకు అనుకూలం అవుతుందన్న ఆశతో ఎన్నికల బరిలో నిలబడిన అనేక పార్టీల అధ్యక్షులకు చివరకు మిగిలింది భంగపాటే.
ప్రభంజనం: డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాంగా బీజేపీ నేతృత్వంలో కూటమి ఏర్పాటుతో, మోడీ ప్రభంజనం తమను గెలిపిస్తాయన్న ధీమా అనేక పార్టీల్లో నెలకొంది. అయితే, రాష్ట్రంలో మోడీ పాచికలు పారలేదు. మోడీ పవనాల ఆశ, డీఎంకే బహిష్కృత నేత అళగిరి అండ, తన వ్యక్తిగత బలం కలసి వస్తాయన్న ఆశతో విరుదునగర్ రేసులో నిలబడ్డ ఎండీఎంకే అధినేత వైగోకు మిగిలింది ఓటమే. లక్షన్నర ఓట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి వైగోకు ఏర్పడింది. ఇక, పీఎంకే అధ్యక్షుడు జీకే మణి ఈ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని లోక్ సభ రేసులో నిలబడ్డారు.
కృష్ణగిరి జిల్లాలో ఉన్న వన్నియర్ ఓట్లు, మోడీ గాలి, మిత్రుల ఓటు బ్యాంక్ కలిసి వస్తే తాను ఎంపీగా పార్లమెంట్ మెట్లు ఎక్కడ ఖాయం అన్న ధీమాతో ప్రచారం చేశారు. అయితే ఆయనకు దక్కింది రెండున్నర లక్షల ఓట్లే. అన్నాడీఎంకే హవా ముందు చతికిల బడాల్సి వచ్చింది. వీసీకే నేత తిరుమావళవన్ చిదంబరం నుంచి మళ్లీ బరిలో దిగారు. వెనుకబడిన వర్గాల ఓట్లు, డీఎంకే బలం, తాను చేసిన అభివృద్ధి మళ్లీ విజయం వైపు నడిపిస్తుందన్న తిరుమావళవన్ ఆశలు అడియాశలయ్యాయి. పారని ధన బలం : ఎస్‌ఆర్‌ఎం విద్యా సంస్థల అధినేత పచ్చ ముత్తు పారివేందన్ ఇండియ జననాయగ కట్చికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని ధనిక అభ్యర్థుల జాబితాలో ఉన్న పచ్చ ముత్తు బీజేపీతో కలసి ఎన్నికలను ఎదుర్కొన్నారు. ధన బలం, మోడీ బలం గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్న ఆయన్ను పెరంబలూరు ఓటర్లు తిరస్కరించారు.
ఆర్థిక బలం కలిగిన, మరో విద్యా సంస్థల అధినేత ఏసీ షణ్ముగం పుదియ నిధి కట్చికి అధ్యక్షుడు. ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ అధిష్టానం అండతో వేలూరు సీటును దక్కించుకున్నారు. ఆర్థిక బలం, వ్యక్తిగత సత్తా, మోడీ అండ తనకు వరంగా భావించిన ఈ కోటీశ్వరుడికీ ఓటమి తప్పలేదు. ఇదే స్థానం నుంచి మరో సారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధ పడ్డ డీఎంకే కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహ్మాన్‌కు కూడా మిగిలింది నిరాశే. తన అక్క ప్రేమలత, బావ విజయకాంత్ ఆశీస్సులు, మోడీ ప్రచారం తనకు ఓట్ల వర్షం కురిపిస్తుందని భావించిన డీఎండీకే యువజన విభాగం అధినేత ఎల్‌కే సుదీష్‌కు పరాభవం తప్పలేదు. తెన్‌కాశిలో ఒంటరిగా బరిలో దిగినప్పుడే తన సత్తాను చాటుకున్న పుదియ తమిళగం కట్చి అధినేత కృష్ణ స్వామికి ఈ సారి మిగిలింది కన్నీళ్లే. కొంగు సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌తో నిండిన లోక్ సభ స్థానం పొల్లాచ్చిని బీజేపీ కూటమిలో పెద్ద సమరమే చేసి కొంగు మక్కల్ దేశీయ కట్చి దక్కించుకుంది. ఆ పార్టీ అధినేత ఈశ్వరన్‌కు ఈసారి ఆ సామాజిక వర్గం చుక్కలు చూపారు. పార్టీల అధినేతలే ఓడినప్పుడు, ఇక తామెంత అన్నట్టుగా మిగిలిన స్థానాల బరిలో నిలబడ్డ పీఎంకే, ఎండీఎంకే, డీఎండీకేల అభ్యర్థులు పేర్కొనడం గమనార్హం. ఓటర్లు రాజకీయ పక్షాలకు మాత్రం భలే రుచి చూపించారన్న చర్చ హోరెత్తిస్తుండటం కొసమెరుపు.
ఓడిన అధినేతలు
Published Sun, May 18 2014 12:04 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement