వరుడికి హ్యాండిచ్చిన వధువు
బెంగళూరు(బనశంకరి) : పెళ్లి మంటపంలో రిసెప్షన్ ముగిసిన కొన్ని గంటలకే వరుడికి హ్యాండిచ్చి వధువు వెళ్లిపోయింది. కామాక్షిపాళ్య పోలీసుల సమాచారం మేరకు... కుణిగల్‌కు చెందిన రామచంద్రప్పకు బెంగళూరులోని లగ్గెరెకు చెందని ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. సోమవారం వీరి పెళ్లి మాగడి రోడ్డులోని సుంకదకట్టెలో ఉన్న విజయచంద్ర కల్యాణమంటపంలో జరపడానికి పెద్దలు ఏర్పాట్లు చేశారు.
ఆదివారం రాత్రి ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. అనంతరం కల్యాణమంటపంలో తనకు కేటాయించిన గదిలోకి వధువు వెళ్లిపోయి, తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలన్నింటినీ మూటకట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. సోమవారం తెల్లవారుజామున పెళ్లి తంతుకు శాస్త్రాలను నిర్వహించేందుకు గదిలోకి వెళ్లి చూడగా వధువు కనిపించలేదు.
కొంత సేపటి తర్వాత వధువు తన తల్లికి ఫోన్ చేసి తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలపడంతో పెళ్లిమంటపంలోని వారు కంగుతిన్నారు. విషయం తెలుసుకున్న వరుడి తరపు వారు రాద్ధాంతం చేశారు. పెళ్లి పెద్దలు జోక్యం చేసుకుని ఇరువైపులా వారిని సమాధాన పరిచి అదే ముహూర్తానికి మరో యువతితో పెళ్లి జరిపించేందుకు సిద్ధపడ్డారు. తొలుతు వరుడు ఒప్పుకున్నా ఆఖరు నిమిషంలో ఆమెకు తనకంటే రెండేళ్లు ఎక్కువ వయసు ఉందంటూ మొరాయించడంతో పెళ్లి ఆగిపోయింది. కాగా, వధువు పరారీపై కామాక్షిపాళ్య పోలీసులు కేసు నమోదు చేశారు.