Welfare Hall
-
వరుడికి హ్యాండిచ్చిన వధువు
బెంగళూరు(బనశంకరి) : పెళ్లి మంటపంలో రిసెప్షన్ ముగిసిన కొన్ని గంటలకే వరుడికి హ్యాండిచ్చి వధువు వెళ్లిపోయింది. కామాక్షిపాళ్య పోలీసుల సమాచారం మేరకు... కుణిగల్‌కు చెందిన రామచంద్రప్పకు బెంగళూరులోని లగ్గెరెకు చెందని ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. సోమవారం వీరి పెళ్లి మాగడి రోడ్డులోని సుంకదకట్టెలో ఉన్న విజయచంద్ర కల్యాణమంటపంలో జరపడానికి పెద్దలు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. అనంతరం కల్యాణమంటపంలో తనకు కేటాయించిన గదిలోకి వధువు వెళ్లిపోయి, తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలన్నింటినీ మూటకట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. సోమవారం తెల్లవారుజామున పెళ్లి తంతుకు శాస్త్రాలను నిర్వహించేందుకు గదిలోకి వెళ్లి చూడగా వధువు కనిపించలేదు. కొంత సేపటి తర్వాత వధువు తన తల్లికి ఫోన్ చేసి తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలపడంతో పెళ్లిమంటపంలోని వారు కంగుతిన్నారు. విషయం తెలుసుకున్న వరుడి తరపు వారు రాద్ధాంతం చేశారు. పెళ్లి పెద్దలు జోక్యం చేసుకుని ఇరువైపులా వారిని సమాధాన పరిచి అదే ముహూర్తానికి మరో యువతితో పెళ్లి జరిపించేందుకు సిద్ధపడ్డారు. తొలుతు వరుడు ఒప్పుకున్నా ఆఖరు నిమిషంలో ఆమెకు తనకంటే రెండేళ్లు ఎక్కువ వయసు ఉందంటూ మొరాయించడంతో పెళ్లి ఆగిపోయింది. కాగా, వధువు పరారీపై కామాక్షిపాళ్య పోలీసులు కేసు నమోదు చేశారు. -
పెళ్లంటే ఇదేరా!
రెండు మనసులను ముడి వేసే పెళ్లంటే సందడే సందడి. బంధుమిత్ర సపరివారం హడావిడి సరేసరి.. ఈ హంగామాకు ఇప్పుడు సరికొత్త రూపం ఇస్తున్నారు వెడ్డింగ్ ప్లానర్స్. పెళ్లికి రావడం.. వధూవరుల్ని ఆశీర్వదించడం.. అందరినీ పలకరించి, భోజనాలు ముగించి వెళ్లిపోవడం..ఈ రొటీన్ సీన్‌కే డిఫరెంట్ థీమ్‌లను జతచేసి.. ముహూర్తానికిరెండ్రోజుల ముందు నుంచే వెడ్డింగ్ వెదర్‌ను ఆటపాటలతో జాయ్‌ఫుల్‌గా మార్చేస్తున్నారు. ఆకాశ పందిరిలో వినోదాలు వెల్లివిరిసేలా ప్రతి సీన్లో క్రియేటివిటీ జోడించి.. కల్యాణాన్ని మరింత కమనీయం చేస్తున్నారు. కల్యాణ మంటపం ఎంట్రన్స్ నుంచి.. పెళ్లి పందిరి వరకూ డెకరేషన్తో అదరగొట్టడం మామూలే. పెళ్లి వేడుకలో.. ఆర్కెస్ట్రాతో పాటలు పాడించడమూ పాత ట్రెండే. దీనికి కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు వెడ్డింగ్ ప్లానర్స్. పెళ్లికొచ్చిన అతిథులందరినీ ఇన్వాల్వ్ చేస్తూ.. నూతన వధూవరులకు అపురూపమైన ఆనందాన్ని అందిస్తున్నారు. పెళ్లి మంటపంలో బంధుమిత్రుల అనుబంధాలను ప్రతి ‘ఫ్రేమ్’లో ఇమిడ్చి కలర్‌ఫుల్ చేస్తున్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు నుంచే సరదా వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు ఈ ప్లానర్లు. కొన్ని వర్గాల వారికే పరిమితమైన మెహందీ ఘట్టాన్ని ప్రతి ఇంట జరిపిస్తున్నారు. ఈ ఈవెంట్‌ను కలర్ఫుల్గా సాగేలా చూస్తున్నారు. అతిథులే ఎంటర్టైనర్స్ పెళ్లి పందిరికి సమాంతరంగా మరో వేదిక వేసి దానిపై ఆటపాటలతో అదరగొడుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఎవరినో పిలిపించడం లేదు కూడా. వచ్చిన అతిథుల్లోని ఔత్సాహికులను ఎంకరేజ్ చేసి మరీ ఇందులో పాల్గొనేలా చేస్తున్నారు. అంత్యాక్షరీలు, సంగీత కచేరీలు, స్టాండప్ కామెడీ, స్కిట్స్ ఇలా డిఫరెంట్ ఈవెంట్స్‌తో పెళ్లిసందడిని రెట్టింపు చేస్తున్నారు. పెళ్లి కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడని జనాలు.. ఈ తరహా పెళ్లి వేడుకకు రెడ్ కార్పెట్ పరచి స్వాగతం పలుకుతున్నారు. నేచురల్ మేకోవర్.. ఒకప్పుడు వధూవరులు కాస్త మేకప్ అయ్యేవారు. ఈ ప్లాన్డ్ మ్యారేజెస్లో స్పెషల్ మేకప్ ఆర్టిస్టులను పిలిపిస్తున్నారు. కాలి కొనగోటి నుంచి.. హెయిర్ వరకూ అన్ని అందంగా కనిపించేలా జాగ్రత్త పడుతున్నారు. ‘వధూవరుల కలర్, పర్సనాలిటీని బట్టి మేకప్ వేస్తుంటాం. మేకప్ అంటే రంగులు రుద్దేయడం కాదు. అలా చేయడం వల్ల అసహజంగా కనిపిస్తారు. సహజమైన అందాన్ని ఇనుమడింపజేసేలా మేకప్ చేయాలి. అప్పుడే నేచురల్‌గా కనిపిస్తారు. మ్యారేజ్ కాస్ట్యూమ్స్, జ్యువెలరీ.. ఇలా అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముస్తాబు చేస్తున్నాం’ అని చెబుతారు మేకప్ ఆర్టిస్ట్ తాన్య వసల్రాజ్. బ్యాండ్ బారాత్.. పెళ్లిలో డ్యాన్స్‌ల కోసం ప్రత్యేకంగా కొరియోగ్రాఫర్‌ను కూడా అరేంజ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత జరిగే బారాత్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకునే వాళ్లూ ఉన్నారు. ‘పెళ్లిలో డ్యాన్స్ చేయాలని ఉత్సాహం ఉన్న వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాం. అందుకోసం స్పెషల్ స్టేజ్ ఏర్పాటు చేస్తాం కూడా. చాలా మంది మొదట్లో డ్యాన్స్ చేయడానికి తటపటాయిస్తారు. ట్రైనింగ్ తర్వాత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తుంటారు’ అని చెబుతారు కొరియోగ్రాఫర్ అమిత్ గుప్తా. -
నేటి నుంచి కామెడ్ కే పీజీ కౌన్సెలింగ్
అందుబాటులో 387 వైద్య, 234 దంత వైద్య సీట్లు బెంగళూరులోని ఎన్ఎంకేఆర్వీ కల్యాణ మంటపంలో ఏర్పాట్లు సాక్షి, బెంగళూరు : కన్సార్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్, అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కామెడ్-కే) ఆధ్వర్యంలో వైద్య, దంత వైద్య పీజీ కోర్సుల మొదటి దశ ప్రవేశ ప్రక్రియ నేటి నుంచి (సోమవారం) ప్రారంభం కానుంది. బెంగళూరులోని ఎన్ఎంకేఆర్వీ కల్యాణ మంటపంలో ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకూ మూడు రోజుల పాటు జరుగనుంది. మొత్తం 621 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 387 వైద్య విద్యకు సంబంధించినవి కాగా, మిగిలిన 234 సీట్లు దంత వైద్యానికి సంబంధించినవి. ప్రవేశ ప్రక్రియ తొలిరోజు (సోమవారం) దంత వైద్య కోర్సుకు, మంగళ, బుధవారాలు వైద్య విద్యకు సంబంధించి ప్రవేశ ప్రక్రియ జరగనుంది. కాగా, రెండో దశ కౌన్సెలింగ్ మేలో జరగనుంది. ఆ సమయానికి మరికొన్ని పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చే అవ కాశం ఉంది. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మెడికల్, డెంటల్ పీజీ కోర్సు కౌన్సెలింగ్ మొదటిదశ ప్రక్రియను ఈనెల 25న పూర్తి చేయాల్సి ఉందని కామెడ్ కే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఏ.ఎస్ శ్రీకంఠయ్య తెలిపారు. అందువల్లే ప్రభుత్వ కోటా సీట్ల భర్తీ కంటే ముందుగా ప్రైవేటు కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్లకు ప్రవేశ ప్రక్రియ పూర్తి చేయాల్సి వస్తోందని ఆయన వివరించారు. కాగా, స్థానికతకు సంబంధించి ప్రభుత్వానికి, విద్యార్థులకు మధ్య నడుస్తున్న కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అందువల్లే ప్రభుత్వం వైద్య, దంత వైద్య పీజీ కోర్సులకు సంబంధించిన ప్రక్రియ నిర్వహించలేకపోతోందని వైద్య విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరిలో జరిగిన కామెడ్-కే పీజీ ఎంటెన్స్ పరీక్షకు 16,856 మంది అభ్యర్థులు హాజరుకాగా, అందులో 7,587 మంది (55 శాతం) పీజీ కోర్సులో ప్రవేశానికి అర్హత సాధించారు. మరిన్ని వివరాల కోసం www.comedk.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు