గొంతునులిమి...గోళ్లతో రక్కి...
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రేమించిన యువతి లైంగికంగా లొంగలేదనే కారణంతోనే అరుణ ను దినేష్ హతమార్చినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చెన్నై తలమై శయలగం కాలనీకి చెందిన ప్రయివేటు బ్యాంకు ఉద్యోగిదినేష్ చూలైకి చెందిన తన ప్రేయసి అరుణను సోమవారంరాత్రి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. అరుణ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి మంగళవారం సాయంత్రం అప్పగించారు. అనధికారికంగా అందిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రతి శనివారం జల్సాలు చేస్తూ ఇంటికి కూడా రాకుండా స్నేహితులతో గడిపే అలవాటున్న దినేష్ చర్యలను తల్లిదండ్రులు సైతం అనుమానించలేదు, ఏనాడు ప్రశ్నించలేదు. దినేష్ స్నేహితులంతా అరుణ ఇంటి పరిసరాల్లోని ఉండడం, చిన్ననాటి నుంచి కలిసి చదవడం మూలాన వారిద్దరిలో ప్రేమ చిగురించింది. అరుణను ఏకాంతంగా కలుసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్న దినేష్, తన తండ్రి ఆస్పత్రిలో అడ్మిట్ కావడం, తల్లి, సోదరి ఆయనకు తోడుగా ఉండడంతో, ఇల్లు ఖాళీగా ఉండటాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
సోమవారం ఉదయమే అరుణను ఇంటికి పిలిపించుకున్న దినేష్ ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించాడు. దీంతో కోపగించుకున్న అరుణపై ఆగ్రహంతో ఊగిపోయాడు. గొంతు నులిమాడు, పక్కనే పూలతొట్టితో కొట్టాడు. అద్దాలను పగులగొట్టి విచక్షణా రహితంగా పొడిచాడు. దినేష్ నుంచి ప్రాణాలతో బయటపడాలని ప్రయత్నించినట్లుగా ఆమె ముఖంపై అనేక ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. తప్పించుకో జూసిన అరుణను పట్టుకునే ప్రయత్నంలో ఆమె ముఖమంతా దినేష్ గోళ్లతో రక్కినట్లుగా తేలింది.
దినేష్ ఆచూకీ కోసం 4 బృందాలు
అరుణను హతమార్చి పరారైన నిందితుడు దినేష్‌ను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హత్యచేయగానే దినేష్ తల్లిదండ్రులను కలుసుకుని తన సెల్‌ఫోన్‌ను వారికి ఇచ్చివెళ్లాడు. పరారీలో తన తెలివితేటలను వినియోగించి సెల్‌ఫోన్ లేకుండా జాగ్రత్తపడటం వల్ల దినేష్ ఆచూకీ కనుగొనడం కష్టంగా మారింది. దినేష్ ఫోన్‌కు పోలీసులు ఫోన్ చేయడం వల్లనే తమ కుమారుని కోసం వెతుకుతున్నారని కన్నవారు తెలుసుకుని కృంగిపోయారు. దినేష్ స్నేహితులు, బంధువులు ఎవ్వరూ తమకు తెలియదని చెప్పడంతో గాలింపును తీవ్రతరం చేశారు. 24 గంటల్లోగా దినేష్‌ను అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.