అల’జడి
Published Sat, Dec 7 2013 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
సాక్షి, చెన్నై : పైలీన్, హెలెన్, లెహర్ తుపాన్ల రూపంలో రాష్ట్రానికి మోస్తారుగా వర్షాలు కురిశారుు. ప్రస్తుతం మరో తుపాను రూపంలో కొంత మేరకు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో నైరుతీ దిశలో ఇటీవల అల్పపీడన ద్రోణి బయలు దేరింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో విడతలు వారీగా వర్షాలు పడుతున్నాయి. నాగపట్నం, తిరువారూర్ జిల్లాల్ని మాత్రం వర్షం ముంచెత్తింది. చెన్నైకు ఆగ్నేయంలో 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన ఈ ద్రోణి బలపడింది. శుక్రవారం అర్ధరాత్రి మరింత బలపడిన ఈ ద్రోణి తుపానుగా మారింది. దీనికి మ్యాడీ అని నామకరణం చేశారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.
రాష్ట్రాని ముప్పు లేదు: ఈ తుపాను కారణంగా రాష్ట్రానికి ముప్పు లేదని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మాల్దీవుల వైపుగా ఈ తుపాన్ తీరం దాటనున్నది. ఈ నెల పదో తేదీ లేదా 11న తీరం దాటొచ్చన్న సంకేతాలు ఉన్నాయి. దీంతో కాశి మేడు, ఎన్నూరు, మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌లలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. యువత ఆ కెరటాల మధ్యలో కేరింతలు కొడుతోంది. కెరటాల తాకిడి క్రమంగా పెరగడంతో జాలర్లు చేపల వేటకు దూరమయ్యారు. నడి సముద్రంలోకి వెళ్లొద్దన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో మర పడవలు, మోటార్ బోట్ల పడవలు కలగిన జాలర్లు కడలిలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. చెన్నైలో మూడు వేల మంది జాలర్లు శనివారం చేపల వేటకు వెళ్లలేదు. వాతావరణ కేంద్రం హెచ్చరికలు, ఇచ్చే సమాచారం మేరకు కడలిలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. గాలుల ప్రభావం తీవ్రంగా ఉండటంతో సముద్ర తీరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.
Advertisement
Advertisement