సాక్షి, చెన్నై:అక్రమ బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ల వ్యవహారంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి మనవడు, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌కు మంగళవారం మద్రాసు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ విచారణకు సహకరించని పక్షంలో బెయిల్ రద్దుకు వెనుకాడబోమంటూ హెచ్చరించింది. కేంద్ర టెలికాం మంత్రిగా ఉన్న కాలంలో దయానిధి మారన్ తన అధికారాన్ని ప్రయోగించి నాలుగు వందల మేర అక్రమ బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ల పొందిన వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కనెక్షన్లను తన సోదరుడు కళానిధి మారన్‌కు చెందిన సన్ గ్రూప్ సంస్థకు ఉపయోగించినట్టు ఆరోపణలు బయలు దేరడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ అక్రమ కనెక్షన్లతో ప్రభుత్వ ఆదాయానికి కోట్లాది రూపాయల మేరకు గండి పడ్డట్టు విచారణలో వెలుగు చూసింది. ఈవ్యవహారంలో ఇటీవల దయానిధి మారన్ సన్నిహితుడు గౌతమన్, సన్ గ్రూప్ అధికారి టీవీ కణ్ణన్, ఎలక్ట్రీషియన్ రవిలను సీబీఐ అరెస్టు చేసింది. వీరిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ అరెస్టులతో మారన్ బ్రదర్స్ ఇరకాటంలో పడ్డారు. ఈ కేసులో మారన్ బ్రదర్స్ అరెస్టు అవుతారన్న ప్రచారం బయలు దేరింది.
ముందస్తు బెయిల్ : తనను అరెస్టు చేస్తారన్న ప్రచారం షికారు చేయడంతో దయానిధి మారన్ మేల్కొన్నారు. ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. సీబీఐ పిలిస్తే , ఏ క్షణంలోనైనా సరే ఎలాంటి విచారణలకైనా తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇస్తూ , ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ విచారణ మంగళవారం న్యాయమూర్తి ఆర్ సుబ్బయ్య నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. పిటిషనర్ మారన్ తరపున న్యాయవాది సుందరేషన్, సీబీఐ తరపున న్యాయవాది రాజగోపాలన్ హాజరై తమ వాదనల్ని విన్పించారు. వాదనల అనంతరం మారన్‌కు ఆరు వారాల ముందస్తు బెయిల్ మంజూరు అయింది. విచారణకు ఆయన సహకరించని పక్షంలో బెయిల్ రద్దుకు వెనుకాడబోయేది లేదని పరోక్షంగా బెంచ్ హెచ్చరించింది. ఇందుకు తగ్గ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేసి, బెయిల్ రద్దుకు విజ్ఞప్తి చేయవచ్చంటూ సీబీఐకు బెంచ్ సూచించింది.
దయానిధిమారన్‌కు ముందస్తు బెయిల్
Published Wed, Jul 1 2015 3:14 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement