చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే శ్రేణులు తనపై హత్యాయత్నానికి పూనుకున్నాయని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఆరోపించారు. మంత్రి సెల్లూరురాజా అండదండలతో యాసిడ్ దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు.కామరాజనాడార్ ట్రస్ట్ మాజీ ఉద్యోగిని వలర్మతి పెట్టిన కేసులో ఈ నెల 24వ తేదీన మద్రాసు హైకోర్టు నుంచి ఇళంగోవన్ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ పొందారు. మదురై తల్లాకుళం పోలీస్‌స్టేషన్‌లో 15 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు సంతకం చేయాలని బెయిల్ ఉత్తర్వులలో కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు తొలిరోజైన గురువారం నాడు ఇళంగోవన్ పోలీస్ స్టేషన్‌కు వెళుతుండగా అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళన నిర్వహించారు. ఇళంగోవన్ కారుపైనా, దాని వెనుక వస్తున్న కార్లపై కోడిగుడ్లు, పేడ, బురదతో దాడిచేశారు. మహిళా కార్యకర్తలు చీపురు చేతబట్టి నిరసన ప్రకటించారు. రెండోరోజైన శుక్రవారం నాడు పోలీస్ స్టేషన్‌లో సంతకం పెట్టిన ఇళంగోవన్ మీడియాతో మాట్లాడారు.
కోడిగుడ్లలో యాసిడ్: ఈనెల 27వ తేదీన మదురైలోని పోలీస్‌స్టేషన్‌కు వెళుతున్న సమయంలో అన్నాడీఎంకే కార్యకర్తలు తనపై దాడికి దిగారని అన్నారు. కోడిగుడ్లలో యాసిడ్‌ను ఉంచి తన పై హత్యాయత్నానికి పూనుకున్నారని, ఈ దాడి వెనుక మంత్రి సెల్లూరురాజా హస్తం ఉందని ఆరోపించారు. యాసిడ్ గుడ్లతోపాటు పేడ, బురద కూడా తమ కార్లపై చల్లారని ఆయన తెలిపారు. పార్టీ ఊరేగింపులా తాను పోలీస్‌స్టేషన్‌కు రావడాన్ని కొందరు ఆక్షేపిస్తున్నారని, పోలీసు బందోబస్తు లేని కారణంగా కార్యకర్తల అండతో పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరణ ఇచ్చారు. అన్నాడీఎంకేకు చెందిన 200 మంది ఆందోళనకారులు ర్యాలీలా తనవైపు దూసుకువస్తున్నా పోలీసులు ఎంతమాత్రం వారిని నివారించలేదని ఆయన ఆక్షేపించారు.
ఈ దాడిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఆర్‌ఐ రసీదు తనకు ఇవ్వలేదని ఆయన అన్నారు. అయితే రెండోరోజైన శుక్రవారం తనకు ఏర్పాటు చేసిన బందోబస్తు ఫరవాలేదని అన్నారు. ఇదిలా ఉండగా, మధురైలో తనపై దాడి జరిగిన నేపధ్యంలో ముందస్తు బెయిల్ షరతులను సడలించాలని ఇళంగోవన్ తరపు న్యాయవాది మద్రాసు హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. ఇళంగోవన్ కోరినట్లుగా జామీను నిబంధనలను సడలించలేమని, బందోబస్తును పెంచాల్సిందిగా పోలీసుశాఖను ఆదేశిస్తామని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసేందుకు గుంపుగా వెళ్లరాదని కోర్టు ఆదేశించింది.
నాపై హత్యాయత్నం
Published Sat, Aug 29 2015 3:00 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement
Advertisement