మదురై ముస్తాబు
సాక్షి, చెన్నై: ముల్లై పెరియార్ డ్యాం విజయోత్సవానికి మదురై ముస్తాబైంది. సీఎం అభినందన సభకు సర్వం సిద్ధం చేశారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు నగర వీధుల్లో హోరెత్తడంతో వ్యవహారం మద్రాసు హైకోర్టు ధర్మాసనం ముందుకు చేరింది. అనుమతి లేనిఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాల్సిందేనని ఆదేశాల్ని కోర్టు ఇచ్చింది. జయలలిత రాకతో మదురైలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆమె పర్యటన అంతా, ఆకాశ మార్గంలో సాగనుంది. కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లై పెరియార్ డ్యాంపై సర్వహక్కులను తమిళనాడు కలిగి ఉంది. అయితే, ఆ హక్కుల్ని కాలరాసే రీతిలో కేరళ సర్కారు చేస్తూ వచ్చిన ప్రయత్నాలకు ఇటీవల బ్రేక్ పడింది.
అన్నాడీఎంకే సర్కారు సుప్రీం కోర్టులో చేసిన పోరాటాలకు ఫలితం దక్కింది. ఆ డ్యాం స్థిరంగా ఉందని స్పష్టం చేయడంతో పాటుగా 136 అడుగుల నుంచి 142 అడుగులకు నీటిని నిల్వ ఉంచుకోవచ్చన్న తీర్పు వెలువడింది. దీంతో డ్యాం నీటిమట్టం 142 అడుగులకు పెంచే పనిలో అధికారులు నిమగ్నమయ్యూరు. తమ జిల్లాలకు వరప్రదాయినీగా ఉన్న ముల్లై పెరియార్ డ్యాం హక్కుల పరిరక్షణకు శ్రమించిన సీఎం జయలలితను సత్కరించేందుకు మదురై, తేని, దిండుగల్, విరుదుగనర్, రామనాధపురం, శివగంగై అన్నదాతలు నిర్ణయించారు. రైతు సంఘాలన్నీ ఏకమై ముల్లై పెరియర్ డ్యాం విజయోత్సవం, సీఎం జయలలితకు అభినందన సభకు చర్యలు తీసుకున్నారు.
భారీగా ఫ్లెక్సీల ఏర్పాటు : మదురై పాండి కోవిల్ రింగ్ రోడ్డులోని మైదానంలో అభినందన సభకు ఏర్పాట్లు చేశారు. తమ అధినేత్రి రానున్నడంతో ఆ జిల్లాల్లోని అన్నాడీఎంకే వర్గాలు ఫ్లెక్సీలు, బ్యానర్లతో నగరాన్ని ముంచెత్తేస్తున్నారుు. జయలలిత దృష్టిలో పడే రీతిలో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. అభినందన సభ మైదానం మహానాడును తలపించే విధంగా ఏర్పాట్లు చేశారు. మదురై నగరం అంతా సర్వ హంగులతో ముస్తాబైంది. మామిడి తోరణాలు, పలు రకాల పుష్పాలు, అరటి గెలలతో దారి పొడవన ప్రత్యేక అలంకరణల్ని ఓ వైపు అధికారులు, మరో వైపు అన్నాడిఎంకే వర్గాలు, ఇంకో వైపు రైతు సంఘాలు పోటీలు పడి మరీ చేశారు.
అయితే, భద్రతా కారణాల దృష్ట్యా, సీఎం జయలలిత పర్యటన అంతా ఆకాశమార్గంలో సాగనుంది. ఈ సభలో పాల్గొనేందుకు శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి మదురైకు వెళ్లనున్నారు. మదురై విమానాశ్రయంలో స్వాగత కార్యక్రమానంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్లో సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు. మూడు గంటలకు అభినందన, విజయోత్సవ సభ ఆరంభం అవుతుంది. అక్కడి నుంచి హెలికాప్టర్లో మదురై విమానాశ్రయం చేరుకుని, ప్రత్యేక విమానంలో చెన్నైకు తిరుగు పయనం కానున్నారు.
భారీ భద్రత: మదురై నగరం తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉండడం, సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకుని భారీ భద్రతా ఏర్పాట్లను పోలీసు యంత్రాంగం చేసింది. భద్రతా ఏర్పాట్ల గురించి డీఐజీ కన్నప్పన్, ఐజీ అభయ్ కుమార్ నేతృత్వంలో ఉదయం సమావేశం జరిగింది. ఇందులో మదురై, తేని, రామనాథపురం, విరుదునగర్, శివగంగైల ఎస్పీలు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధానంగా మదురై విమానాశ్రయం, సభా స్థలి, హెలిపాడ్ పరిసరాల్లో, జనసందోహం తరలి వచ్చే మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా నేత్రాలు, మఫ్టీ సిబ్బంది ద్వారా ఈ మార్గాల్లో భద్రతను పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. సభా స్థలి పరిసరాల్లోకి ఎలాంటి వాహనాలు అనుమతించరు. అన్ని వాహనాలు నాలుగు కిలో మీటర్లకు ముందుగానే నిలిపి వేయనున్నారు. అక్కడి నుంచి జన సందోహం నడక యాత్ర సాగించాల్సిందే.
దొరికిన బాంబు: జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా అవనియాపురం ఇన్‌స్పెక్టర్ మాదవన్ నేతృత్వంలోని బృందం గస్తీలో ఉండగా అటు వైపుగా వచ్చిన ఆటోను అడ్డగించే యత్నం చేశారు. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పరారు కాగా, ఓ యువకుడు పట్టుబడ్డాడు. ఆటోలో శక్తివంతమైన నాటు బాంబు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న చింతామణికి చెందిన ముత్తురామన్‌కుమారుడు వేల్ కుమార్ వద్ద విచారణ జరుపుతున్నారు. విచార ణలో మాజీ మండలాధ్యక్షుడు హత్యకు కుట్ర పన్నినట్టు తేలింది. దీంతో పరారీలో ఉన్న కుమార్, ముత్తు పాండిల కోసం గాలింపు వేగవంతం చేశారు.
తొలగించాల్సిందే: తమ అధినేత్రి రాకతో హోర్డింగ్‌లు, బ్యానర్లతో అన్నాడీఎంకే వర్గాలు హోరెత్తించడం మదురై ధర్మాసనానికి చేరింది. డీఎంకే న్యాయవాద విభాగం నాయకుడు పళని స్వామి అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేశారు. అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా నగరంలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారని, వీటి కారణంగా అనేక కూడళ్లలో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదని వివరించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా పరిగణించిన న్యాయమూర్తులు జయ చంద్రన్, మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. విచారణలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ చల్ల పాండియన్ తన వాదన విన్పించారు. మదురై కార్పొరేషన్ అనుమతితో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనుమతి లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎక్కడైనా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి ఉంటే, వాటిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వాదనతో ఏకీభవించిన ధర్మాసనం తక్షణం అనుమతి లేని వాటిని గుర్తించి తొలగించాలని ఆదేశించింది.