అలాంటి ఆరోపణలు చేయోద్దు: హైకోర్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రైవేట్ పాల కంపెనీదారులు కల్తీపాలను సరఫరా చేస్తున్నారంటూ ఆధారాలు లేని ఆరోపణలు చేయరాదని తమిళనాడు పాడిపరిశ్రమశాఖా మంత్రి కేటీ రాజేంద్రబాలాజీపై మద్రాసు హైకోర్టు అక్షింతలు వేసింది. ఇకపై ప్రైవేట్ పాల కంపెనీల గురించి వ్యాఖ్యానాలు చేయడానికి వీల్లేదంటూ నిషేధం విధించింది.
తమిళనాడు ప్రైవేట్ పాల కంపెనీల వారు బ్లీచింగ్, ప్రమాదకర రసాయనాలను కలిపిన కల్తీపాలను సరఫరా చేస్తున్నారని ఇటీవల మంత్రి ఆరోపించారు. ఆయా కంపెనీలకు తాళాలు వేయనున్నట్లు ప్రకటించారు. దీంతో హాట్సన్ ఆగ్రో, దొడ్ల డైరీ, విజయ డైరీ కంపెనీలు కోర్టులో పిటిషన్ వేశాయి. దీనిపై సోమవారం విచారణకు రాగా కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.