తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, మంత్రులు సెంగొట్టయ్యన్, సెల్లూరు రాజా, దిండుగల్లు శ్రీనివాసన్, కామరాజ్‌లను మధురై హైకోర్టు బెంచ్ షాక్ ఇచ్చింది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, మంత్రులు సెంగొట్టయ్యన్, సెల్లూరు రాజా, దిండుగల్లు శ్రీనివాసన్, కామరాజ్‌లను మధురై హైకోర్టు బెంచ్ షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ సూచనలు, సలహాలు, ఆదేశాలను అనుసరించి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లుగా వ్యవహరిస్తున్న సీఎం, మంత్రులు పదవులకు అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌పై మధురై హైకోర్టు శాఖ గురువారం ఆ ఐదుగురికి నోటీసులు జారీచేసింది.
దోషిగా బెంగళూరు జైలులో నాలుగేళ్ల శిక్షను అనుభవిస్తున్న శశికళ నుంచి ఆదేశాలు పొందడం తీవ్ర అభ్యంతరమని పేర్కొంటూ విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన అన్నాడీఎంకే నేత ఆనళగన్ ఈ ఏడాది మార్చిలో మధురై హైకోర్టు శాఖలో పిటిషన్ వేశారు. అన్నాడీఎంకే (అమ్మ) అధికార ప్రతినిధి గౌరీశంకర్ ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశికళ ఆలోచనల ప్రకారం ప్రభుత్వం నడుస్తోందని ప్రకటించినట్లు పిటిషన్ పేర్కొన్నారు. అంతేగాక సదరు నలుగురు మంత్రులు బెంగళూరు కు వెళ్లి శశికళ ను కలిసి వచ్చారని ఆయన చెప్పారు. ఈ చర్యలను సీఎం పళనిస్వామి ఖండించనందున ఆయనను సైతం అనర్హుడిగా ప్రకటించాలని ఆనళగన్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు వివరణ కోరుతూ సీఎం, నలుగురు మంత్రులకు గురువారం నోటీసులు పంపింది.