సాక్షి, ముంబై: బెంగళూర్‌లో బాంబు పేలుడు ఘటనతో మహారాష్ట్ర ఉలిక్కిపడింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు రాష్ట్రంలోని ప్రముఖ నగరాలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబైతోపాటు పుణే ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ముందున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తులు చేపట్టి నిఘాతోపాటు భద్రతను పెంచారు. ఓ వైపు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్నిజాగత్రలు తీసుకుంటున్నారు.
గతంలోకి తొంగి చూస్తే.. 2014 జూలై నెలలో విశ్రామ్‌బాగ్ పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న దగుడుశేట్ హల్వాయి గణపతి మందిరం సమీపంలో రోడ్డుపై పార్కింగ్ చేసిన ఓ బైక్ డిక్కీలో బాంబు పేలుడు జరిగింది. దీనికి ముందు 2012 ఆగస్టులో, 2010 ఫిబ్రవరిలో బాంబు పేలుళ్లతో నగరం దద్దరిల్లింది. మరోవైపు ముంబైలో 1990 నుంచి 2011 వరకు సుమారు 18 సార్లు బాంబు పేలుళ్లు జరిగాయి. ముఖ్యంగా వీటిలో సుమారు 12 సంఘటనల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం వాటిల్లింది. ప్రముఖంగా 1993 వరుస బాంబు పేలుళ్లు, 2006 జులై 11, 2008 నవంబరు 26 ఉగ్రవాదుల దాడులు, 2011 జూలై వరుస పేలుళ్లతో పాటు పలు సంఘటనలు ఇందులో ఉన్నాయి.
బెంగళూర్‌లో జరిగిందే ట్రయల్ ఘటనే..?
బెంగళూర్‌లో జరిగిన బాంబు పేలుడు ట్ర యిలేనని ముంబై పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. ముంబై, పుణేలను టార్గెట్ చేసేందుకే అక్కడ ట్రయిల్ నిర్వహించినట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై, పుణేల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అయితే ఈ విషయంపై అధికారికంగా మాత్రం ఎవరూ మాట్లాడడంలేదు.
రాష్ట్రంలోని 25 ప్రాంతాలు హిట్‌లిస్ట్‌లో....
రాష్ట్రంలోని 25 ప్రాంతాలు ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు తెలిసింది. గతంలో కూడా వీటిని పోలీసులు గుర్తించారు. ముంబైతోపాటు ఠాణే, నవీ ముంబై, పుణే, ఔరంగాబాద్, నాసిక్, నాగపూర్ తదితర నగరాల్లోని ప్రాంతాలే హిట్‌లిస్ట్‌లో అధికంగా ఉన్నాయి. వీటిలో ప్రముఖంగా చెప్పాలంటే ముంబైలో మంత్రాలయ, మల్బార్ హిల్ పుణేలోని శనివార్‌వాడా, నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం, ఠాణే జిల్లాలో ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన భవనం, తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం, వసాయి కోట, పన్వేల్ రైల్వేస్టేషన్, నాసిక్ జిల్లాలో నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన భవనం తదితర ప్రాంతాలున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యం...?
దేశంలోని ప్రముఖ నగరాలను టార్గెట్ చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థపై దెబ్బతీసేందుకు ఉగ్రవాదుల ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కొంత కాలంగా దేశంలోని ప్రముఖ నగరాలతోపాటు అభివృద్ధి చెందుతున్న నగరాలపై ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నారని చెప్పవచ్చు.
బోట్లలో వేడుకలకు ‘నో’..
ఉగ్రవాదుల దాడులను దృష్టిలో ఉంచుకుని గత సంవత్సరం మాదిరిగా ఈ సారి కూడా లాంచీ (బోట్ల) లో థర్టీ ఫస్ట్ వేడుకలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసు శాఖ వెల్లడించింది. పోలీసుల కళ్లుగప్పి ఎవరైనా లాంచీల్లో వేడుకలు నిర్వహిస్తే బోటు యజమానితోపాటు వేడుకల్లో పాల్గొనే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసు కమిషనర్ (దర్యాప్తు శాఖ) ధనంజయ్ కులకర్ణి హెచ్చరించారు.
ఉగ్రవాద సంస్థల హెచ్చరికల నేపథ్యంలో కోస్టు గార్డు, నేవీ, ముంబై పోలీసు శాఖ అప్రమత్తమయ్యాయి. శాంతి, భద్రతలకు ఎలాంటి భంగం వాటిళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 26/11 ఘటనలో ఉగ్రవాదులు కుబేర్ పడవ ద్వారా నగరంలోకి చొరబడిన విషయం తెలిసిందే. దీంతో తేరుకున్న పోలీసు శాఖ అప్పటి నుంచి లాంచీల్లో వేడుకల నిర్వహణకు పోలీసు శాఖ అనుమతివ్వడం లేదు.
‘మహా’ హుషార్..!
Published Mon, Dec 29 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM
Advertisement
Advertisement