‘టీ’కి మహా అండ | maharashtra leaders full supported on bifurcation | Sakshi
Sakshi News home page

‘టీ’కి మహా అండ

Published Sun, Feb 23 2014 12:42 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

‘టీ’కి మహా అండ - Sakshi

‘టీ’కి మహా అండ

 తెలంగాణ బిల్లు ఆమోదంలో  షిండే, పవార్‌ల కీలకపాత్ర
 హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక తెలంగాణవాదులు
 తెలంగాణ పోరులో వలసబిడ్డల మరవలేని కృషి
 
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం కావడానికి మహారాష్ట్ర ఉద్ధండులు చేయూతనిచ్చారు. ఉభయసభల్లో ప్రత్యేక తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్  కీలకపాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలసవచ్చి రాష్ట్రంలో స్థిరపడిన తెలంగాణవాదులు వీరి మద్దతుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఈ నాయకులకు అండగా ఉంటామని ప్రకటించారు.
 
 
 సాక్షి, ముంబై: ప్రత్యేక తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో మహారాష్ట్ర నాయకులు కీలకపాత్ర పోషించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తెలంగాణవారి 60 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేయడంలో తమదైన పాత్ర పోషించారు. తమిళనాడుకు చెందిన పి.చిదంబరం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటుచేస్తున్నామని ప్రకటించినా అంత వేగంగా బిల్లు ముందుకు కదలలేదు. రాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగాన్ని పుంజుకుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన అనుభవమున్న షిండే, తెలంగాణ వెనుకబాటుతనంపై కొంత అవగాహన ఉండటం కూడా ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకరించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై  షిండే తీసుకున్న చొరవపై రాష్ట్రంలో స్థిరపడిన తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో అనేక మంది షిండే మద్దతుదారులుగా కూడా ఉన్నారు.  మరోవైపు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ కూడా తెలంగాణకు మద్దతు పలికారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో తమదైన పాత్ర పోషించారు.
 
 తెలంగాణ పోరులో వలసబిడ్డలు...
 ప్రత్యేక తె లంగాణ పోరాటంలో ముంబైలోని అనేక మంది తెలంగాణ ప్రజలు కూడా క్రియాశీలకపాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్ల క్రితమే ఉద్యమాలు జరిగినా, 13 ఏళ్ల క్రితం టీఆర్‌ఎస్ పుట్టాకే ఇవి మరింత ఊపందుకున్నాయి. తెలంగాణ ప్రాంతాల్లోని ప్రజలు తమదైన శైలిలో నిరసనకు దిగారు. వీళ్ల బాటలోనే ముంబైలోని తెలంగాణ వలసబిడ్డలు నడిచారు.
 
 పలు కార్యక్రమాలు...
 2007 జనవరిలో గోరేగావ్‌లో  జరిగిన తెలంగాణ ధూమ్‌ధామ్ కార్యక్రమం అనంతరం ముంబైలోని తెలంగాణవాదుల్లో చైతన్యం వచ్చింది. ఉద్యమంలో ముందుకు దూసుకెళ్లారు. 2008 సంవత్సరంలో అనేక మంది తెలంగాణవాదులు సంఘాలు ఏర్పాటుచేసుకున్నారు. వేర్వేరు సంఘాల పేర్లతో ప్రత్యేక తెలంగాణ కోసం కృషిచేసిన వీరు ఒక బ్యానర్ కింద ఉద్యమం చేపట్టాలని భావించారు. ముంబైలో  ‘తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక’, ‘ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ’లను స్థాపించుకున్నారు. ఈ రెండు సంస్థలు వాటి వాటి అనుబంధ సంస్థలు, ఇతర సంఘాలు, కార్మిక యూనియన్ల ద్వారా తెలంగాణ సాధన కోసం తమ వంతు కృషి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పరిణామాలన్నింటిపై దృష్టిసారించి ప్రతి అంశాన్ని ఇక్కడి తెలంగాణ ప్రజలకు తెలిపి ఆందోళనలో పాల్గొనేలా చైతన్యవంతం చేశాయి. వలసబిడ్డలైన వీరు పలుమార్లు హైదరాబాద్‌తోపాటు తెలంగాణ ప్రాంతాల్లో జరిగిన కొన్ని ఆందోళనలలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం ఇప్పటివరకు ముంైబె లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో 2007లో గోరేగావ్, బాంద్రాలో జరిగిన ధూంధాం కార్యక్రమాలున్నాయి. ఆజాద్‌మైదాన్‌లో కూడా నిరాహారదీక్షలు చేశారు. 2013లో ప్రత్యేకంగా ఢిల్లీలో కూడా జీవోఎంతో భేటీ అయ్యారు
 
 . 2013 నవంబర్‌లో గోరేగావ్‌లో జరిగిన తెలంగాణ సాధన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఉంటున్న తెలంగాణవాదులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ఉద్యమంలో పాల్గొనేలా చేయడంలో సంస్థ సభ్యులులు సఫలీకృతమయ్యారు. ఢిల్లీలోని నాయకులు, ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రులతోపాటు మహారాష్ట్రలోని మంత్రులు, నాయకులతో భేటీ అయి తెలంగాణకు మద్దతివ్వాలని వినతిపత్రాలను కూడా సమర్పించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తమ వంతు కృషి చేస్తూనే, ప్రత్యేక తెలంగాణలో వలస బిడ్డలకు ప్రాధాన్యం లభించాలని కూడా పోరాడుతున్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో వలసబిడ్డల భవిష్యత్‌పై చర్చలు జరిపారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అందరి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ముంబైలో తెలంగాణ ఉద్యమాల్లో క్రియాశీలకపాత్ర పోషించినవారు అనేక మంది ఉన్నారు. వీరిలో అఖిల భారతీయ తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి మచ్చ ప్రభాకర్, ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మూలనివాస మాల, ముంబై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బద్ది హేమంత్‌కుమార్, తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక కన్వీనర్లు శేఖర్ గ్యారా, అక్కినపెల్లి దుర్గేష్, రమేష్ గొండ్యాల, పొట్ట వెంకటేష్‌లతోపాటు ముంబై టీజేఏసీ పదాధికారులు కాసుల నర్సింహగౌడ్, గంగాధర్ గంగపుత్ర, నాగెల్ల దేవేందర్, ద్రవిడ్ మాదిగ, భోగ సుదర్శన్ పద్మశాలి తదితరులు ఉన్నారు.
 
 చిగురించిన కొత్త ఆశలు...
 తెలంగాణ బిల్లుకు పార్లమెంట్‌తోపాటు రాజ్యసభలో ఆమోదం లభించడంతో ముంబైలోని వలసబిడ్డలలో కొత్త ఆశలు చిగురించాయి. అందరూ సంబరాలు జరుపుకున్నారు. ముంబైలో నివసించే తెలంగాణ ప్రజలలో అనేక మంది పొట్టచేత పట్టుకుని వలస వచ్చిన కూలీలు, అసంఘటిత కార్మికులున్నారు. వీరు తెలంగాణ రాష్ట్ర అవతరణతో మంచిరోజులు వచ్చినట్టేనని భావిస్తున్నారు. ముంబైలోని వలసబిడ్డలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పునర్‌నిర్మాణంలో కూడా క్రియశీలపాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక వలసజీవులకు చేయూతనిచ్చేలా తెలంగాణ నాయకులు చొరవ తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని, ఇప్పటికే ఎన్నో వ్యయాప్రయాసలకు గురవుతున్నామని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement