కలిసొస్తుందని ఇంటికి తెచ్చుకుంటే ...
మనిషి బలహీనతలు ఒక్కొసారి తీవ్ర అనర్థాల కు దారి తీస్తాయి. అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని నక్షత్ర తాబేలును పెంచుకుంటున్న ఓ నగల వ్యాపారి చివరకు కటకటాలపాలైన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. నగల వ్యాపారి గోపిరాజును పోలీసులు అరెస్ట్ చేసి పరప్పన అగ్రహార జైలుకు పంపించారు. పోలీసులు వివరాల మేరకు... రాఘవేంద్ర నగర్‌లో గోపిరాజు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం ఓ ఇసుకలారీ స్టాండ్ వద్ద గోపిరాజుకు ఓ నక్షత్ర తాబేలు లభించింది. దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాడు. సహచరులు కూడా నక్షత్ర తాబేలు ఇంటిలో ఉంటే అదృష్టం అని చెప్పడంతో దాన్ని మరింత ప్రేమగా చూడటం మొదలు పెట్టాడు. తాబేలు అడుగు పెట్టిన వేళా విశేషం ఏమో కాని గోపిరాజుకు వ్యాపారం కూడా కలిసి వచ్చింది.
జింక చర్మం కూడా ఇంటిలో పెట్టుకుంటే మంచిదని చెప్పడంతో కేరళకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ. 2 వేలతో కొనుగోలు చేశాడు. దీంతో వ్యాపారంలో బాగా లాభాలు రావడంతో సన్నిహితుల వద్ద కూడా తన సెంటిమెంట్ రహస్యం గొప్పగా చెప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో గోపిరాజు ఇంటిలో నక్షత్ర తాబేలు, జింక చర్మం ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తి సీసీబీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆదివారం రాత్రి సీఐ మహదేవయ్య నేతృత్వంలోని సిబ్బంది గోపిరాజు ఇంటిపై దాడి చేశారు. సోఫాలో ఉన్న తాబేలుతో పాటు జింక చర్మం స్వాధీనం చేసుకుని గోపిరాజును అదుపులోకి తీసుకున్నారు.
నక్షత్ర తాబేలు వచ్చిన తరువాత తనకు వ్యాపారం బాగా కలిసి వచ్చిందని, ఎలాంటి కష్టాలు లేవని, తాబేలును సొంత బిడ్డలాగా చూసుకుంటున్నానని పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే వన్యప్రాణులను ఇంటిలో పెంచడం చట్ట ప్రకారం నేరం కావడంతో అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే దేశంలో నక్షత్ర తాబేలుకు భారీ డిమాండ్ ఉంది. ఒక్కొటి రూ. 10 లక్షల నుంచి 15 లక్షల వ రకు విక్రయిస్తున్నారని పోలీసులు చెప్పారు. నక్షత్ర తాబేలును జేకేవీకే అధికారులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. కేసు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.