- కేపీసీసీ హర్ష మొయిలీ పేరును చేర్చడంపై అసంతృప్తి
- కాంగ్రెస్‌లో అప్పుడే టికెట్ల లొల్లి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్‌లో టికెట్ల కోసం రగడ మొదలైంది. మంగళూరు టికెట్‌ను కేంద్ర మాజీ మంత్రి జనార్దన పూజారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఇక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసాన్ని వ ుుట్టడించినంత పని చేశారు. ఈ స్థానం కోసం పార్టీ తయారు చేసిన అభ్యర్థుల జాబితాలో కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ కుమారుడు హర్ష మొయిలీ పేరుంది.
జిల్లా కాంగ్రెస్ కమిటీ కేవలం పూజారి పేరును మాత్రమే సిఫార్సు చేయగా, కేపీసీసీ హర్ష మొయిలీ పేరును ఎందుకు చేర్చిందంటూ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రిని కలుసుకోవాలన్న వారి ప్రయత్నం నెరవేరలేదు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, శాసన సభ సమావేశాల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి వారిని కలుసుకోలేక పోయారు. ఎట్టకేలకు సాయంత్రం ముఖ్యమంత్రిని కలుసుకోగలిగారు.
తమ గోడును వెళ్లబోసుకున్నారు. అత్యంత సీనియర్ నాయకుడైన పూజారిని అవమానపరిచే విధంగా పార్టీలో పరిణామాలు జరుగుతున్నాయని వారు ఆక్రోశం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వారిని అనునయిస్తూ, పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతానని హామీ ఇచ్చారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలని కూడా షరతు విధించారు.
పరమేశ్వరకు అధిష్టానం అనుగ్రహం
రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించడానికి కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. శాసన సభ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినందున ఎగువ సభలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసే సందర్భంలో అవకాశం కల్పించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నప్పటికీ, మంత్రి పదవితో సరిపెట్టుకోవాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున దళితుల్లో ప్రముఖుడైన పరమేశ్వరకు మంత్రి వర్గంలో స్థానం కల్పించడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలన్నది ఆలోచనగా కనిపిస్తోంది. ఇదే వ్యూహంతో ఇటీవల ఒక్కలిక సామాజిక వర్గానికి చెందిన డీకే. శివ కుమార్, మైనారిటీలకు చెందిన ఆర్. రోషన్ బేగ్‌లకు స్థానం కల్పించారు. ప్రస్తుతం శాసన సభ ఎన్నికలు జరుగుతున్నందున ఈ నెల 30 తర్వాత పరమేశ్వరను మంత్రి వర్గంలో చేర్చుకోవచ్చని వినిపిస్తున్నా, అంతకు ముందే అవకాశం కల్పించే ఆస్కారం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.