రగులుతున్న చిచ్చు
- రోజు రోజుకూ పెరుగుతున్న వర్గపోరు
- రమ్య ఫిర్యాదుపై భగ్గుమన్న ‘మండ్య’ నేతలు
- ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లే ఓడిందని విమర్శ
- పార్టీ అభివృద్ధికి కృషి చేసిన మాపై ఆరోపణ చేస్తే ఊరుకోమంటూ హెచ్చరిక
- కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదాపై సీనియర్ల ఆగ్రహం
- సీఎంపై అధిష్టానానికి ఫిర్యాదుకు కేపీసీసీలో ఓ వర్గం వ్యూహం
సాక్షి, బెంగళూరు : రాష్ర్ట కాంగ్రెస్‌లో అసమ్మతి రగులుతూనే ఉంది. రోజురోజుకూ పార్టీలో వర్గ పోరు పెచ్చుమీరుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తమ పార్టీ కన్నా బీజేపీయే అధికంగా సీట్లు సాధించడం కాంగ్రెస్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీలో విభేదాలకు అద్దం పడుతోంది.
తన ఓటమికి మంత్రి అంబరీషే కారణమంటూ మండ్య లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రమ్య అధిష్టా నానికి ఫిర్యాదు చేయడం.. ముఖ్యమంత్రి నిర్లక్ష వైఖరే కారణమంటూ కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ తన మద్దతుదారులతో విమర్శలు చేయిస్తుండటం ఇందుకు నిదర్శనం. మంత్రి మండలి విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీని సీఎం సిద్ధరామయ్య వాయిదా వేస్తుండటంపై పార్టీ నేతలు అసంతృప్తితో రగలిపోతున్నారు.
రమ్య కాంగ్రెస్ అధిష్టానానికి చేసిన ఫిర్యాదులో ‘ఈ ఎన్నికల్లో నేను గెలిస్తే మండ్య జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైతుందని...సదరు నాయకులు భావించారు. అంతేకాకుండా పార్టీ భవిష్యత్‌ను ఫణంగా పెట్టి వ్యక్తిగత ప్రయోజనం ఆశించి మంత్రి అంబరీష్, అతని అనుచరులు తెరవెనుక మంత్రాంగాన్ని నడిపి నన్ను ఓడించారు.’ అని పేర్కొన్నట్లు సమాచారం.
ఈ ఆరోపణలపై మండ్యకు చెందిన కాంగ్రెస్ నాయకులు శివరామేగౌడ, అమరావతి చంద్రశేఖర, ఎల్.డీ రవి తదితరులు బుధవారం బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రమ్యపై నిప్పులు చెరిగారు. తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ‘గత పార్లమెంటు ఉప ఎన్నికల్లో గెలిచిన రమ్య అనంతరం స్థానిక నాయకుల పట్ల చిన్నచూపు చూశారు. మా మాటకు ఏ మాత్రం విలువ ఇవ్వలేదు. క్షేత్ర స్థాయి కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలకూ ఆమె అందుబాటులో లేరు.
ఈ కారణాల వల్లే రమ్య ఓడారు. అయితే అనవసరంగా మాపై ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక నాయకులైన మమ్మల్ని, క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. పార్టీ కోసం క ృషి చేసే మాపై ఇలా లేనిపోని విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం. అవసరమైతే పార్టీని వీడడానికైనా మేంసిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని కేపీసీసీ నాయకుల ద ృష్టికీ తీసుకెళ్లాం. ఇక అధిష్టానాన్ని కలిసి వాస్తవాలను వివరించే ఆలోచనలో ఉన్నాం. త్వరలో ఈ విషయంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు.
సీఎం ‘వాయిదా’ మంత్రం..
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి మండలి విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీని వాయిదా వేస్తుండటంపై కొంతమంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అసంత ృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విస్తరణ చేపడితే కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే ఒకే ఒక కారణంతో సిద్ధు విస్తరణను వాయిదా వేస్తూ నిర్లక్షం చేస్తున్నారని వారు వాపోతున్నారు.
ఈ విషయంపై కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ ‘ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా పూర్తి స్థాయిలో మంత్రి మండలి లేకపోవడం సరికాదు. రానున్న శాసనసభ సమావేశాల్లోపు మంత్రి మండలి విస్తరణ చేపట్టక పోతే హై కమాండ్‌ను కలిసి సిద్ధు వ్యవహార శైలిపై ఫిర్యాదు చేయడానికి కేపీసీసీలోని ఓ ప్రముఖ నాయకుడి వర్గం సిద్ధమవుతోంది.’ అని పేర్కొన్నారు.