the Lok Sabha polls
-
రగులుతున్న చిచ్చు
రోజు రోజుకూ పెరుగుతున్న వర్గపోరు రమ్య ఫిర్యాదుపై భగ్గుమన్న ‘మండ్య’ నేతలు ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లే ఓడిందని విమర్శ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన మాపై ఆరోపణ చేస్తే ఊరుకోమంటూ హెచ్చరిక కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదాపై సీనియర్ల ఆగ్రహం సీఎంపై అధిష్టానానికి ఫిర్యాదుకు కేపీసీసీలో ఓ వర్గం వ్యూహం సాక్షి, బెంగళూరు : రాష్ర్ట కాంగ్రెస్‌లో అసమ్మతి రగులుతూనే ఉంది. రోజురోజుకూ పార్టీలో వర్గ పోరు పెచ్చుమీరుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తమ పార్టీ కన్నా బీజేపీయే అధికంగా సీట్లు సాధించడం కాంగ్రెస్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీలో విభేదాలకు అద్దం పడుతోంది. తన ఓటమికి మంత్రి అంబరీషే కారణమంటూ మండ్య లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రమ్య అధిష్టా నానికి ఫిర్యాదు చేయడం.. ముఖ్యమంత్రి నిర్లక్ష వైఖరే కారణమంటూ కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ తన మద్దతుదారులతో విమర్శలు చేయిస్తుండటం ఇందుకు నిదర్శనం. మంత్రి మండలి విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీని సీఎం సిద్ధరామయ్య వాయిదా వేస్తుండటంపై పార్టీ నేతలు అసంతృప్తితో రగలిపోతున్నారు. రమ్య కాంగ్రెస్ అధిష్టానానికి చేసిన ఫిర్యాదులో ‘ఈ ఎన్నికల్లో నేను గెలిస్తే మండ్య జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైతుందని...సదరు నాయకులు భావించారు. అంతేకాకుండా పార్టీ భవిష్యత్‌ను ఫణంగా పెట్టి వ్యక్తిగత ప్రయోజనం ఆశించి మంత్రి అంబరీష్, అతని అనుచరులు తెరవెనుక మంత్రాంగాన్ని నడిపి నన్ను ఓడించారు.’ అని పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఆరోపణలపై మండ్యకు చెందిన కాంగ్రెస్ నాయకులు శివరామేగౌడ, అమరావతి చంద్రశేఖర, ఎల్.డీ రవి తదితరులు బుధవారం బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రమ్యపై నిప్పులు చెరిగారు. తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ‘గత పార్లమెంటు ఉప ఎన్నికల్లో గెలిచిన రమ్య అనంతరం స్థానిక నాయకుల పట్ల చిన్నచూపు చూశారు. మా మాటకు ఏ మాత్రం విలువ ఇవ్వలేదు. క్షేత్ర స్థాయి కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలకూ ఆమె అందుబాటులో లేరు. ఈ కారణాల వల్లే రమ్య ఓడారు. అయితే అనవసరంగా మాపై ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక నాయకులైన మమ్మల్ని, క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. పార్టీ కోసం క ృషి చేసే మాపై ఇలా లేనిపోని విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం. అవసరమైతే పార్టీని వీడడానికైనా మేంసిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని కేపీసీసీ నాయకుల ద ృష్టికీ తీసుకెళ్లాం. ఇక అధిష్టానాన్ని కలిసి వాస్తవాలను వివరించే ఆలోచనలో ఉన్నాం. త్వరలో ఈ విషయంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు. సీఎం ‘వాయిదా’ మంత్రం.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి మండలి విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీని వాయిదా వేస్తుండటంపై కొంతమంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అసంత ృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విస్తరణ చేపడితే కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే ఒకే ఒక కారణంతో సిద్ధు విస్తరణను వాయిదా వేస్తూ నిర్లక్షం చేస్తున్నారని వారు వాపోతున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ ‘ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా పూర్తి స్థాయిలో మంత్రి మండలి లేకపోవడం సరికాదు. రానున్న శాసనసభ సమావేశాల్లోపు మంత్రి మండలి విస్తరణ చేపట్టక పోతే హై కమాండ్‌ను కలిసి సిద్ధు వ్యవహార శైలిపై ఫిర్యాదు చేయడానికి కేపీసీసీలోని ఓ ప్రముఖ నాయకుడి వర్గం సిద్ధమవుతోంది.’ అని పేర్కొన్నారు. -
నూతనోత్సాహం
15.70 లక్షల మంది కొత్త ఓటర్లు త్వరలో గుర్తింపు కార్డులు ఎన్నికల ప్రధానాధికారి అనిల్ కుమార్ వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో కొత్తగా 15.70 లక్షల మంది ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ కుమార్ ఝా తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్వరలోనే వీరికి గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. కాగా లోక్‌సభ ఎన్నికలకు సోమవారం ఒక్క రోజే 73 మంది 114 నామినేషన్లను దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 28 నియోజక వర్గాల్లో 190 మంది అభ్యర్థులు 280 నామినేషన్లను దాఖలు చేశారని తెలిపారు. ప్రముఖుల నామినేషన్లు రాష్ట్రంలోని వివిధ నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థులుగా ధార్వాడలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, హావేరిలో శివకుమార్ ఉదాసి, బెల్గాంలో సురేశ్ అంగడి, హాసనలో విజయ్ శంకర్, గుల్బర్గలో రేవూ నాయక్ బెళమగి, చిక్కోడిలో రమేశ్ కత్తి, తుమకూరులో జీఎస్. బసవరాజులు నామినేషన్లు వేశారు. బెల్గాంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ హెబ్బాల్కర్ నామినేషన్ వేశారు. జేడీఎస్ అభ్యర్థులుగా శివమొగ్గలో గీతా శివ రాజ్‌కుమార్, చామరాజ నగరలో ఎం. శివన్న, ఉత్తర కన్నడలో శివానంద నాయక్, బెంగళూరు గ్రామీణలో ప్రభాకర రెడ్డి, గుల్బర్గలో డీసీ. సాగర్, మండ్యలో సీఎస్. పుట్టరాజులు నామినేషన్లు దాఖలు చేశారు. -
లోక్‌సభ ఎన్నికలు 18 మందితో ఎన్సీపీ జాబితా
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికలకు శరద్‌పవార్ నేతృత్వంలోని 18 మంది అభ్యర్థులతో ఎన్సీపీ జాబితా ప్రకటించింది. తన కోటాలో మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో హింగోలి, హాత్కణాంగలే, మావల్, బీడ్ నియోజకవర్గాలకు అభ్యర్థులెవరనే అంశంపై కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఆది నుంచి అంతా అనుకుంటున్నట్టుగానే కొందరు సీనియర్ మంత్రులను ఎన్సీపీ... ఈ ఎన్నికల బరిలోకి దింపింది. ప్రజాపనులశాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌ను ఈ ఎన్నికల బరిలోకి దింపనుందంటూ అనేక రోజులుగా ఊహాగానాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉత్కంఠకు తెరదింపుతూ నాసిక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఛగన్ భుజ్‌బల్‌ను బరిలోకి దింపనున్నట్టు ఎన్సీపీ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు సాతారా నుంచి ఉదయన్‌రాజే భోస్లేకు టికెట్ ఇస్తుందా?లేదా? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపైనా ఎన్సీపీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అభ్యర్థిగా ఉదయన్‌రాజే పేరును ప్రకటించింది. వీరితోపాటు భాండారా-గోండియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి మరోసారి ప్రఫుల్ పటేల్, బారామతి నుంచి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఠాణే నుంచి సంజీవ్ నాయిక్, ఉస్మానాబాద్ నుంచి పద్మసింగ్ పాటిల్, ముంబై నుంచి సంజయ్ దీనాపాటిల్లను బరిలోకి దింపనుంది. ఇక శరద్‌పవార్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న షోలాపూర్ జిల్లాలోని మాఢా లోక్‌సభ నియోజకవర్గంలో ఎట్టకేలకు విజయ్‌సింహ్ మోహి తే పాటిల్, కొల్హాపూర్ స్థానానికి ధనంజయ్ మాడిక్లను ప్రకటించింది. ఇక శివసేన నుంచి ఎన్సీపీలో చేరిన ప్రస్తుత ఎంపీ ఆనంద్ పరాంజ్‌పేను కల్యాణ్ నుంచి బరిలోకి దింపుతోంది. గతంలో ఆయన కల్యాణ్ నియోజకవర్గం నుంచి శివసేన టికెట్‌పై గెలుపొందారు. ఆనంద్ పరాంజ్పే ఇటీవలే ఎన్సీపీలో చేరిన సంగతి విదితమే. తన కోటాలోని మొత్తం 22 నియోజకవర్గాల్లో 18 మందితో జాబితాను విడుదల చేసిన ఎన్సీపీ... మిగిలిన నాలుగు స్థానాల నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలనుంచి ఎవరిని బరిలోకి దింపనున్నారు? అభ్యర్థుల జాబితాను ఎందుకు ప్రకటించలేదనే విషయమై అందరి దృష్టీ కేంద్రీకృమైంది. గట్టి పోటీ ఎదురవనుందనే ఆలోచన కారణంగానే అభ్యర్థుల ప్రకటన విషయంలో ఎన్సీపీ అధిష్టానం జాప్యం చేస్తోందని తెలుస్తోంది. వీటిలో బీడ్ లోక్‌సభ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండేకు మంచి పట్టు ఉంది. మరోవైపు హత్కణాంగలే, హింగోళి, మావల్ లలో శివసేన అత్యంత పటిష్టంగా ఉంది. దీంతో ఈ నియోజకవర్గాలలో కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. ఇందుకు ప్రధాన కారణం అక్కడ శివసేనతోపాటు అటు గోపీనాథ్ ముండేను ఎదుర్కొనే సత్తా కలిగిన నాయకులను బరిలోకి దింపాలని ఎన్సీపీ యోచిస్తున్నట్టు తెలియవచ్చింది. కాగా బీజేపీ కూడా గురువారం లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో మంత్రి విజయ్‌కుమార్ గావిత్ కుమార్తె డాక్టర్ హీనాగావిత్ కూడా ఉన్నారు. ఈమెకు బీజేపీ అధిష్టానం నందుర్బార్ టికెట్‌ను కేటాయించింది. అభ్యర్థుల వివరాలు ఈశాన్య ముంబై: సంజయ్ దీనాపాటిల్, నాసిక్: ఛగన్ భుజ్‌బల్, భండారా-గోండియా: ప్రఫుల్ పటేల్, ఉస్మానాబాద్: పద్మసింహ్ పాటిల్, బారామతి: సుప్రియా సూలే, సాతారా: ఉదయన్ రాజే భోస్లే, జల్గావ్: సతీష్ పాటిల్, ఠాణే: సంజీవ్ నాయిక్, కల్యాణ్-డోంబివలి: ఆనంద్ పరాంజ్పే, అహ్మద్‌నగర్: రాజీవ్ రాజలే, రావేర్: మనీష్ జైన్, బుల్డాణా: కృష్ణరావ్ ఇంగలే, శిరూర్: దేవదత్త నికమ్, పర్భణి: విజయ్ కాంబ్లే, కొల్హాపూర్: ధనంజయ్, అమరావతి: నవనీత్ రాణా, దిండోరి: భారతీ, మాఢా: విజయ్‌సింహ్ మోహితేపాటిల్. -
మంగళూరు టికెట్‌పై రగడ
కేపీసీసీ హర్ష మొయిలీ పేరును చేర్చడంపై అసంతృప్తి కాంగ్రెస్‌లో అప్పుడే టికెట్ల లొల్లి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్‌లో టికెట్ల కోసం రగడ మొదలైంది. మంగళూరు టికెట్‌ను కేంద్ర మాజీ మంత్రి జనార్దన పూజారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఇక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసాన్ని వ ుుట్టడించినంత పని చేశారు. ఈ స్థానం కోసం పార్టీ తయారు చేసిన అభ్యర్థుల జాబితాలో కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ కుమారుడు హర్ష మొయిలీ పేరుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ కేవలం పూజారి పేరును మాత్రమే సిఫార్సు చేయగా, కేపీసీసీ హర్ష మొయిలీ పేరును ఎందుకు చేర్చిందంటూ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రిని కలుసుకోవాలన్న వారి ప్రయత్నం నెరవేరలేదు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, శాసన సభ సమావేశాల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి వారిని కలుసుకోలేక పోయారు. ఎట్టకేలకు సాయంత్రం ముఖ్యమంత్రిని కలుసుకోగలిగారు. తమ గోడును వెళ్లబోసుకున్నారు. అత్యంత సీనియర్ నాయకుడైన పూజారిని అవమానపరిచే విధంగా పార్టీలో పరిణామాలు జరుగుతున్నాయని వారు ఆక్రోశం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వారిని అనునయిస్తూ, పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతానని హామీ ఇచ్చారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలని కూడా షరతు విధించారు. పరమేశ్వరకు అధిష్టానం అనుగ్రహం రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించడానికి కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. శాసన సభ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినందున ఎగువ సభలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసే సందర్భంలో అవకాశం కల్పించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నప్పటికీ, మంత్రి పదవితో సరిపెట్టుకోవాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున దళితుల్లో ప్రముఖుడైన పరమేశ్వరకు మంత్రి వర్గంలో స్థానం కల్పించడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలన్నది ఆలోచనగా కనిపిస్తోంది. ఇదే వ్యూహంతో ఇటీవల ఒక్కలిక సామాజిక వర్గానికి చెందిన డీకే. శివ కుమార్, మైనారిటీలకు చెందిన ఆర్. రోషన్ బేగ్‌లకు స్థానం కల్పించారు. ప్రస్తుతం శాసన సభ ఎన్నికలు జరుగుతున్నందున ఈ నెల 30 తర్వాత పరమేశ్వరను మంత్రి వర్గంలో చేర్చుకోవచ్చని వినిపిస్తున్నా, అంతకు ముందే అవకాశం కల్పించే ఆస్కారం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
బీజేపీ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు
సింధనూరు టౌన్, న్యూస్‌లైన్ : బీజేపీలోకి తిరిగి చేరే విషయంలో తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని, ఒకవేళ అలాంటి ఆహ్వానం ఏదైనా అందితే తమ పార్టీ నాయకులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని బీఎస్ఆర్ పార్టీ సంస్థాపక అధ్యక్షుడు బీ. శ్రీరాములు అన్నారు. ఆయన శుక్రవారం సింధనూరులో విలేకరులతో మాట్లాడారు. బీజేపీలోకి యడ్యూరప్పను తిరిగి చేర్చుకునే విషయంలో ప్రయత్నాలు జరిగి ఉండవచ్చన్నారు. అయితే చేరిక విషయంలో తాను ఎలాంటి వ్యక్తిగత నిర్ణయం తీసుకునేది లేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలను నిర్ల క్ష్యం చేయడం వల్ల తమ పార్టీ అభ్య ర్థులు ఓటమి పాలు కావాల్సి వచ్చిందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇది పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారి, చిత్రదుర్గం, హావేరి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలనే యోచన ఉందన్నారు. బెళగావి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి బట్టబయలైందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిపై మండిపడ్డారన్నారు. కొందరు ఉపాధ్యాయులు కూడా డిమాండ్ల పరిష్కారం కోసం పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడటం చూస్తే ప్రభుత్వం ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చడంలో ఎంతగా విఫలమైందో అర్థమవుతుందన్నారు. వెంటనే వరి, మొక్కజొన్న, పత్తికి మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరే ప్రయత్నాలు చేస్తున్న విషయం గుర్తు చేయగా, తాము ఆయన కన్నా చిన్నవారమని, చిన్న చిన్న తప్పులు చేసి ఉండవచ్చని వాటిని ఆయన క్షమిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. కార్యక్రమంలో బీఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.కరియప్ప, బసనగౌడ దద్దల్, ప్రముఖులు కే.భీమణ్ణ, వకీల్ నిరుపాది తదితరులు పాల్గొన్నారు.