- 15.70 లక్షల మంది కొత్త ఓటర్లు
- త్వరలో గుర్తింపు కార్డులు
- ఎన్నికల ప్రధానాధికారి అనిల్ కుమార్ వెల్లడి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో కొత్తగా 15.70 లక్షల మంది ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ కుమార్ ఝా తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్వరలోనే వీరికి గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. కాగా లోక్‌సభ ఎన్నికలకు సోమవారం ఒక్క రోజే 73 మంది 114 నామినేషన్లను దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 28 నియోజక వర్గాల్లో 190 మంది అభ్యర్థులు 280 నామినేషన్లను దాఖలు చేశారని తెలిపారు.
ప్రముఖుల నామినేషన్లు
రాష్ట్రంలోని వివిధ నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థులుగా ధార్వాడలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, హావేరిలో శివకుమార్ ఉదాసి, బెల్గాంలో సురేశ్ అంగడి, హాసనలో విజయ్ శంకర్, గుల్బర్గలో రేవూ నాయక్ బెళమగి, చిక్కోడిలో రమేశ్ కత్తి, తుమకూరులో జీఎస్.
బసవరాజులు నామినేషన్లు వేశారు. బెల్గాంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ హెబ్బాల్కర్ నామినేషన్ వేశారు. జేడీఎస్ అభ్యర్థులుగా శివమొగ్గలో గీతా శివ రాజ్‌కుమార్, చామరాజ నగరలో ఎం. శివన్న, ఉత్తర కన్నడలో శివానంద నాయక్, బెంగళూరు గ్రామీణలో ప్రభాకర రెడ్డి, గుల్బర్గలో డీసీ. సాగర్, మండ్యలో సీఎస్. పుట్టరాజులు నామినేషన్లు దాఖలు చేశారు.