- మొత్తం నామినేషన్లు 916
- 51 నామినేషన్ల తిరస్కరణ
- బీదర్‌లో అత్యధికం.. ఉత్తర కన్నడలో అత్యల్పం
- కోడ్ ఉల్లంఘన కేసులు 479 నమోదు
- రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్‌కుమార్ వెల్లడి
సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలోని 28 లోక్‌సభ స్థానాలకు వచ్చే నెల 17న జరుగనున్న ఎన్నికలకు గాను మొత్తం 916 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్‌కుమార్ ఝా తెలిపారు. వీటిలో 51 నామినేషన్లను తిరస్కరించినట్లు చెప్పారు. గురువారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....శనివారం సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 552 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారని తెలిపారు. బీదర్‌లో అత్యధికంగా 38 మంది, ఉత్తర కన్నడ స్థానంలో తక్కువగా 10 మంది నామినేషన్లు దాఖలు చేశారని వివరించారు. చిత్రదుర్గ స్థానానికి మొత్తం 19 మంది నామినేషన్లు వేయగా, అన్నీ సక్రమంగా ఉన్నాయని వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద 479 కేసులు
నమోదయ్యాయని తెలిపారు. నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు సహా రూ.2.64 కోట్ల సొత్తు, రూ.1.35 కోట్ల విలువ చేసే 34,869 లీటర్ల మద్యాన్ని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు.
ఆమోదించిన నామినేషన్లు
చిక్కోడి-14, బెల్గాం-18, బాగల్‌కోటె-20, బిజాపుర-16, గుల్బర్గ-14, రాయచూరు-12, బీదర్-38, కొప్పళ-17, బళ్లారి-12 ,హావేరి-24, దార్వాడ-20, ఉత్తర కన్నడ-10, దావణగెరె-26, శివమొగ్గ-18, ఉడుపి-చిక్కమగళూరు-14, హాసనన-23, దక్షిణ కన్నడ-17, చిత్రదుర్గ-19, తుమకూరు-24, మండ్య-22, మైసూరు-22, చామరాజనగర-17, బెంగళూరు రూరల్-16, బెంగళూరు ఉత్తర-19, బెంగళూరు సెంట్రల్-27, బెంగళూరు దక్షిణ-24, చిక్కబళ్లాపుర-23, కోలారు-26.