కోర్టుకు బ్రదర్స్!
► చార్జ్‌షీట్ నకలు అప్పగింత
► మీడియాపై న్యాయవాదుల చిందులు
► మౌనంగా మారన్ ముందుకు
సాక్షి, చెన్నై: మారన్ బ్రదర్స్ మంగళవారం చెన్నై సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. 2500 పేజీలతో కూడిన చార్జ్‌షీట్ నకలును వీరికి కోర్టు వర్గాలు అప్పగించాయి. తదుపరి విచారణ జూలై 28కి న్యాయమూర్తి జవహర్ వాయిదా వేశారు. యూపీఏ హయాంలో కేంద్ర టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో దయానిధిమారన్ హై స్పీడ్ ఇంటర్నెట్ బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్లను దుర్వినియోగం చేసినట్టుగా ఆరోపణలు బయలు దేరాయి.
ఈ కనెక్షన్లను తమ కుటుంబానికి చెందిన సన్ టీవీ నెట్‌వర్క్‌కు అప్పగించడంతో ప్రభుత్వానికి కోటి 78 లక్షల మేరకు ఆదాయానికి గండి పడిందని సీబీఐ గుర్తించి కేసు నమోదు చేసింది. దయానిధిమారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌తో పాటు అప్పటి బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు బ్రహ్మనాథన్, వేలుస్వామి, మారన్ వ్యక్తిగత కార్యదర్శి గౌతమన్, సన్‌టీవీ సిబ్బందికన్నన్, రవి మీద అభియోగం మోపుతూ ఈ కేసులు దాఖలయ్యాయి.
కేసు విచారణ చెన్నై సీబీఐ కోర్టులో సాగుతూ వస్తోంది. ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ ఎనిమిదో తేదీన సీబీఐ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. గత విచారణ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లందరూ కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి జవహర్ ఆదేశించారు. ఆ మేరకు మారన్ బ్రదర్స్ మంగళవారం కోర్టుమెట్లు ఎక్కారు.
కోర్టుకు బ్రదర్స్ :
కళానిధి మారన్, దయానిధి మారన్‌తో పాటు మిగిలిన వారు ఉదయాన్నే హైకోర్టు ఆవరణలోని సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. కోర్టుకు హాజరైన వీరిని వీడియో, ఫొటోలు తీయడానికి మీడియా ఉత్సాహాన్ని ప్రదర్శించింది. అయితే, ఆ బ్రదర్స్ తరఫు న్యాయవాదులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. కోర్టులో న్యాయమూర్తి జవహర్ ఆదేశాల మేరకు 2500 పేజీలతో కూడిన చార్జ్‌షీట్ నకలును ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ అందజేశారు. వీటిని పరిశీలించి, తదుపరి తమ వాదన వినిపించేందుకు తగ్గ సమయాన్ని కోర్టు కేటాయించింది.
తదుపరి విచారణను జూలై 28వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు నుంచి వెలుపలకు వస్తున్న మారన్ బ్రదర్స్‌ను తమ కెమెరాల్లో బంధించేందుకు మీడియా యత్నించగా, వారి న్యాయవాదులు మళ్లీ అడ్డుకున్నారు. ఫొటోలు, వీడియోల్ని తీయనివ్వకుండా మీడియా మీద తిరుగబడ్డారు. మీడియా వర్గాలను బెదిరిస్తూ, కాస్త దూకుడు ప్రదర్శించారు. న్యాయవాదులు రవీంద్రన్, స్నేహ అయితే, కాస్త దూకుడుగా ప్రదర్శించడంతో మీడియా వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మీడియా మీద తమ న్యాయవాదులు దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నా, ఓ మీడియా సంస్థలకు అధిపతిగా ఉన్న మారన్ బ్రదర్స్ వారించకుండా మౌనంగా ముందుకు సాగడం గమనార్హం.