తిరువొత్తియూరు: వివాహమైన రెండేళ్లకే చెన్నై ఓటేరిలో పోలీసు భార్య మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. చెన్నై ఓటేరి మలయప్పన్ వీధికి చెందిన విఘ్నేష్ (25) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. అతను చెన్నై కార్పొరేషన్ పోలీసు ఆయుధ విభాగంలో పోలీసు. కృష్ణగిరి రాయకోటకు చెందిన విఘ్నేష్‌కు కృష్ణగిరి డెంకినికోటకు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లక్ష్మీ (24)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది బిడ్డ ఉంది.
వేలూరులో పోలీసు శిక్షణ పొందిన తరువాత విఘ్నేష్ 10 రోజుల ముందు చెన్నైలో ఉద్యోగంలో చేరాడు. దీంతో చిన్నారిని లక్ష్మి తల్లిదండ్రుల ఇంట్లో వదిలిపెట్టి భార్య లక్ష్మితో కలిసి 10 రోజుల ముందు ఓటేరి మలయప్పన్ వీధిలో కాపురం పెట్టాడు. మంగళవారం ఉదయం విధులకు వెళ్లిన విఘ్నేష్ మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఎంతసేపటికీ తలుపులు తీయలేదు. దీంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశాడు.
ఆ సమయంలో లక్ష్మి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతోంది. దిగ్భ్రాంతి చెందిన విఘ్నేష్ ఓటేరి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి అంబులెన్స్‌లో వచ్చిన వైద్యులు లక్ష్మి మృతి చెందినట్టు తెలిపారు. విషయం తెలిసి లక్ష్మి తండ్రి రామస్వామి ఓటేరికి చేరుకుని వరకట్న వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓటేరి సీఐ మహ్మద్ నాజర్ విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment