కోలారు(బెంగళూరు): వరకట్నం వేధింపుల నేపథ్యంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన జిల్లాలోని శ్రీనివాసపురం తాలూకా రాయల్పాడు ఫిర్కా ఉప్పరపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు...శ్రీనివాసపురం తాలూకా ఉప్పరపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ(20)ని ఇదే తాలూకాలోని దింబాల గ్రామానికి చెందిన నవీన్‌కు ఇచ్చి ఏడాది క్రితం వివాహం చేశారు. నవీన్ బెంగుళూరులో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా దంపతులు జేపీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే కట్నం తేవాలని కొంత కాలంగా నవీన్ ఆమెను వేధిస్తున్నట్లు సమాచారం.
ఈక్రమంలో వినాయక చవితి పండుగకు లక్ష్మి దింబాల గ్రామంలోని భర్త ఇంటికి వచ్చింది. తర్వాత పుట్టినింటికి వెళ్లి భర్త వేధింపులపై తల్లిదండ్రుల వద్ద గోడువెల్లబోసుకుంది. అనంతరం భర్త ఇంటికి వెళ్లింది. సెలవు కావడంతో నవీన్ కూడా గ్రామానికి చేరుకున్నాడు. బుధవారం రాత్రి నవీన్ లక్ష్మి తల్లిదండ్రులకు ఫోన్‌చేశాడు. మీ కుమార్తె మూర్ఛ పోయిందని, శ్రీనివాసపురం ఆస్పత్రికి తీసుకు వెళుతున్నట్లు తెలిపాడు. దీంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకోగా అక్కడ అంబులెన్స్‌లో లక్ష్మి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఇదిలా ఉండగా తమ కుమార్తెను భర్తే గొంతు నులిమి హత్య చేశాడని ఆరోపిస్తూ మృతదేహాన్ని నవీన్ ఇంటిముందే గొయ్యి తవ్వి ఖననం చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని లక్ష్మి పోషకులకు నచ్చజెప్పి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. లక్ష్మిని ఆమె భర్త నవీన్ హత్య చేసినట్లు పోషకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
వివాహిత అనుమానాస్పద మృతి
Published Fri, Sep 9 2016 11:04 AM | Last Updated on Fri, May 25 2018 12:54 PM
Advertisement
Advertisement