కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి జిల్లా) : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. సంతానం కలగలేదని రాచి రంపాన పెట్టాడు. అదనంగా కట్నం తేవాలని చేయిచేసుకోవటం మొదలుపెట్టాడు. చివరకు ఏమైందో ఏమో.. అనుమానాస్పద స్థితిలో మంటల్లో కాలి బూడిదైంది ఆ ఇల్లాలు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రంగారెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. ఈసీఐఎల్‌కు చెందిన సుశీలకు ఒక కుమారుడు రాజు, కుమార్తె శ్రీలత(భాగ్యలక్ష్మి) (29) సంతానం. డిగ్రీ వరకు చదువుకున్న శ్రీలత దేవరయాంజల్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వరుసకు మేనమామ అయ్యే పోచయ్య(31)ను ప్రేమించి 2007లో కుషాయిగూడ సమీపంలోని ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లికి శ్రీలత కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు.
పిల్లలు లేరని వేధింపులు..
శ్రీలత, పోచయ్య కాపురం కొంతకాలం సజావుగానే సాగింది. పిల్లలు పుట్టకపోవటంతో పోచయ్య భార్యను అవమానించడం, కట్నం కోసం వేధించటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లిన శ్రీలత రూ.50 వేలు తెచ్చి ఇవ్వగా బైక్ కొన్నాడు. తరువాత ఆటో ట్రాలీకి రూ.లక్ష కావాలని, వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు రూ.80 వేలు కావాలని శ్రీలతను వేధించసాగాడు. ఆమె నిరాకరించటంతో పది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి పోచయ్య భార్య శ్రీలతను తీవ్రంగా కొట్టి, ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
కాగా సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఇంట్లో నుంచి మంటలు వచ్చాయి. ఆ మంటల్లో శ్రీలత కాలి అక్కడికక్కడే చనిపోయింది. ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉండగా కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చిందన్నదే ప్రశ్నగా మారింది. కిరోసిన్ పోసి శ్రీలతను హతమార్చాడా లేదా.. మనస్తాపానికి గురైన శ్రీలత ఆత్మహత్య చేసుకుందా.. అన్న విషయం విచారణలో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు 306, 498ఏ,174 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోచయ్య కోసం గాలిస్తున్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి
Published Mon, Dec 7 2015 6:43 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement