ఇక మాంసం మంట! | meat price hikes @400 | Sakshi
Sakshi News home page

ఇక మాంసం మంట!

Published Mon, Oct 28 2013 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

meat price hikes @400

 న్యూఢిల్లీ: ఆహార పదార్థాల ధరలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఇది వరకే భారీగా ఉన్న ఉల్లి ధరలతో తిప్పలు పడుతున్న దిల్లీవాలాలు మాంసానికి కూడా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మటన్ ధర రూ.30 వరకు పెరగడంతో కిలో ధర రూ.400 దాకా పలుకుతోంది. అయితే వీటి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. చికెన్ ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు తెలిపారు. నవరాత్రి తరువాత ఇతర రాష్ట్రాల కోళ్లు, గొర్రెల సరఫరాలు పెరగడం వల్ల గత వారం నుంచి వీటి టోకు ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదని ఘాజీపూర్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. చాలా మంది అమ్మకందారులు మటన్ సరఫరాలు తగ్గడం వల్లే వాటి ధరలు పెంచాల్సి వచ్చిందని అంటున్నారు.
 
 అలకనంద ప్రాంత వ్యాపారి ఒకరు మాత్రం అసలు విషయం చెప్పాడు. తన పక్క దుకాణదారుడు ధరలు పెంచడాన్ని గమనించి తానూ అదే బాట పట్టానని అంగీకరించాడు. పత్పర్‌గంజ్‌లో గత వారం కిలో మటన్‌ను రూ.360కి అమ్మిన ఓ దుకాణదారుడు ఈవారం దానిని రూ.380కి పెంచాడు. ‘ఈద్, దసరా వల్ల మాంసానికి కొరత ఏర్పడింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ నుంచి కూడా సరఫరాలు తగ్గిపోయాయి. వచ్చే వారం నుంచి ధరలు తగ్గిపోవచ్చు’ అని అతడు వివరించాడు.
 
 వసంత్‌కుంజ్, సీఆర్ పార్క్ ప్రాంతాల్లో అయితే కిలో మటన్‌కు రూ.400 పెట్టాల్సిందేనని స్థానికులు చెబుతున్నారు. అధిక ధరలకు సరఫరాలు తగ్గడమే కారణమని వ్యాపారులు అంటుండగా, లజ్‌పత్‌నగర్‌లోని ఓ దుకాణదారుడు మాత్రం సరఫరాలు పెరిగాయని, అందుకే తాము ధరలు తగ్గించామని తెలిపాడు. రూ.400 కిలో పలికిన మటన్‌ను తాము రూ.380కే అమ్ముతున్నామని చెప్పాడు. చికెన్ టోకు ధరలు తక్కువగానే ఉన్నందున వాటి ధరలు పెరిగే అవకాశమే లేదని ఘాజీపూర్ మండీ చైర్మన్ రియాసత్ అలీ అన్నారు. ఈ మండీలో శనివారం కోడిధర రూ.48-62 వరకు పలికింది. సరఫరాలో కొరత ఏమీ లేదని శనివారం కూడా 160 ట్రక్కుల్లో కోళ్లు వచ్చాయని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement