సాక్షి, ముంబై: గుజరాతీలకు వ్యతిరేకంగా సామ్నాలో వచ్చిన సంపాదకీయం రాజేసిన చిచ్చు రగులుతూనే ఉంది. ఇది గుజరాతీ-మరాఠీల మధ్య వివాదంగా రూపాంతరం చెందుతోందని సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఈ వివాదాన్ని స్వార్థప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తుండడంతో రానున్న రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.
గతంలో ఉత్తరభారతీయులు-భూమిపుత్రుల(మరాఠీ ప్రజలు) మధ్య తలెత్తిన వివాదం ఎంతటి నష్టాన్ని కలగజేసిందో తెలిసిందే. తాజాగా అటువంటి వివాదమే మళ్లీ రాజుకుంటోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముంబైని గుజరాతీ ప్రజలు, వ్యాపార వేత్తలు వేశ్యలాగా వినియోగించుకున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలతో సామ్నా పత్రికలో ఓ సంపాదకీయం ప్రచురితమైంది. గుజరాతీలు మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోలేదని, వారు మోడీ ర్యాలీకే ప్రాధాన్యతనిచ్చారని సంపాదకీయంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.
తెరదించే ప్రయత్నం చేసిన శివసేన...
పరిస్థితిని గమనించిన శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రేతోపాటు ఆయన కుమారుడైన యువసేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. గుజరాతీలు ముంబైలో భాగమని, అన్ని విషయాలపై బాల్‌ఠాక్రేతో వారు చర్చించేవారని, ఆయనతో సన్నిహితంగా మెలిగేవారని ఉద్ధవ్, ఆదిత్యఠాక్రేలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. చివరకు సామ్నా సంపాదకీయంతో పార్టీకి సంబంధం లేదని, సామ్నా మాటను పార్టీ మాటగా భావించరాదంటూ ప్రకటించారు. అప్పటితో వివాదం సద్దుమణిగిందనే అంతా భావించారు.
మళ్లీ చిచ్చురేపిన ‘ప్రకటన’...
గుజరాతీయుల కారణంగానే ముంబై ఆర్థికంగా అభివృద్ది చెందడంతోపాటు ఇతర అభివృద్ధి జరిగిందంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ప్రకటనగా మలిచి బెస్ట్‌బస్సులపై అతికించడం తాజా వివాదానికి కారణమైంది. ఇటువంటి ప్రకటన బెస్ట్ బస్సులపై కనిపించడంపట్ల మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే సమర్థించవచ్చు గాక! కానీ బెస్ట్ బస్సులపై గుజరాతీ వార్తా పత్రిక ప్రకటనలను మా పార్టీ వ్యతిరేకిస్తోంది. ముంబై అభివృద్ధిలో మరాఠీ ప్రజల సహకారాన్ని ఆ పత్రిక నిర్లక్ష్యం చేసింది. ముంబై అభివృద్ధిలో గుజరాతీలు చేసిన ప్రయత్నాలకు మాత్రమే ‘సందేశ్’ పత్రిక ప్రాధాన్యమిచ్చింద’ని ఎమ్మెన్నెస్ కార్పొరేటర్ సందీప్ దేశ్‌పాండే విమర్శించారు.
ముంబై అభివృద్ధిలో మరాఠీల పాత్రే లేనట్టుగా సదరు ప్రకటన ఉందన్నారు. అందువల్ల వెంటనే ఆ పత్రిక ప్రకటనలను తొలగించాలని పాండే డిమాండ్ చేశారు. ముంబై అభివృద్ధికి మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగానూ తోడ్పడలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఆ పత్రిక ప్రకటనలో మరాఠీల ప్రస్తావనే లేదన్నారు. ఈ ప్రకటనలను తొలగించనట్లయితే తమదైన పద్దతిలో ఆందోళనకు దిగుతామని కూడా ఎమ్మెన్నెస్ హెచ్చరించింది. ఈ వివాదంపై స్పందించిన శివసేన సభ్యుడు, బెస్ట్ కమిటీ చైర్మన్ అరుణ్‌దూధ్‌వాడకర్ మాట్లాడుతూ, ఆ అడ్వర్టయిజ్‌మెంట్‌ను పరిశీలిస్తామని, ఏమైనా అభ్యంతరకరమైనవి ఉంటే తొలగిస్తామని హామీ ఇచ్చారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలించే ఇటువంటి ప్రకటనలను తొలగించాల్సిందేనని అన్నారు.
పోస్టర్లను తొలగించిన బెస్ట్
ఎమ్మెన్నెస్ హెచ్చరికల నేపథ్యంలో బెస్ట్ బస్సులపై అతికించిన ‘సందేశ్’ ప్రకటన పోస్టర్లను శనివారం తొలగించారు. ఇరుప్రాంతాల ప్రజల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బెస్ట్ తీసుకున్న నిర్ణయం అమలై, పోస్టర్లను తొలగించడంతో వివాదం సద్దుమణిగితే మంచిదేనని, అయితే రాజకీయ నాయకుల స్వార్థపూరిత బుద్ధి మళ్లీ చిచ్చు రేపేందుకు కారణాలు వెతికే అవకావశముందని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెన్నెస్ నేతలు తమ పార్టీ అధినేతను కాదని ఇటువంటి ప్రకటనలు చేయడం అగ్నికి ఆజ్యం పోయడమేనని, పార్టీ అధినేత కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
చల్లారని చిచ్చు!
Published Sat, May 10 2014 10:42 PM | Last Updated on Tue, Aug 21 2018 2:46 PM
Advertisement