సదుపాయాలు లేవని ఎంసీఐ వేటు - మంత్రి శరణ్‌ప్రకాశ్ పాటిల్
బెంగళూరు : మౌలిక సదుపాయాలు సరిగా లేవన్న కారణంతో బెంగళూరు, మైసూరు, హుబ్లీ, బళ్లారిలోని వైద్య విద్య కళాశాలల్లోని 250 సీట్లపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) కోత విధించినట్లు సాక్షాత్తు రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్‌ప్రకాశ్ పాటిల్ వెల్లడించారు. బెంగళూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన బుధవారం మాట్లాడారు. ఏటా మెడికల్ కళాశాలల్లోని సదుపాయాలను ఎంసీఐ బృందం పరిశీలిస్తుందని, అనంతరం ఆయా కళాశాలలకు సీట్లను కేటాయిస్తుందని తెలిపారు. గత సంవత్సరమూ ఇలాగే 250 సీట్లకు కోత విధించగా.. తాను చొరవ తీసుకొని వాటిని మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చానని తెలిపారు. ఈ సారి కూడా ఎంసీఐతో చర్చిస్తానన్నారు. బెంగళూరు మెడికల్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే రూ.117 కోట్లు విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో ఆరు మెడికల్ కళాశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సంవత్సరం గుల్బర్గ, కొప్పళలో కళాశాలలను ప్రారంభిస్తామన్నారు.
నాణ్యత, పారదర్శకతకు ‘మండలి’..
వైద్య విద్య కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులకు నాణ్యమైన మందులను పారదర్శకతతో కొనుగోలు చేయడానికి తమిళనాడులో ఉన్న విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అందుకోసం ప్రత్యేక ‘మండలి’ని ఏర్పాటు చేస్తామని, తద్వారా తక్కువ ధరకే మందులు లభిస్తాయని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి అనుమతి లభించిందని, ఆర్థికశాఖతో, మంత్రి మండలిలో దీనిపై చర్చించి త్వరలో అమలు చేస్తామని శరణ్‌ప్రకాశ్ పాటిల్ తెలిపారు.
వైద్య కళాశాలల్లో... 250 సీట్లకు కోత
Published Thu, Jun 12 2014 2:47 AM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
Advertisement