బిచ్చగాళ్ల అడ్డాలు మెట్రో స్టేషన్లు
Published Sat, Sep 14 2013 11:36 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM
న్యూఢిల్లీ: మెట్రో రైల్వే స్టేషన్ల పరిసరాలు బిచ్చగాళ్లతో నిండిపోతున్నాయి. గడిచిన కొంతకాలంగా ఈ సమస్య మరింత జటిలమవుతోంది. మెట్రో రైల్వే వ్యవస్థ అందుబాటులోకి రావడం నగరవాసులకు వరంగా మారింది. అయితే అదే సమయంలో బిచ్చగాళ్లు, అనాథలు, నిరాశ్రయులు, దేశదిమ్మరులు ఈ స్టేషన్లను ఆక్రమిస్తున్నారు. ప్రస్తుతం అనేక మెట్రో స్టేషన్లలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నోయిడా సిటీ సెంటర్, సెక్టార్-18, ఝండేవలాన్, షాదిపూర్, చాందినీ చౌక్...ఇలా ఏ స్టేషన్ల వద్దచూసినా వీరే కనిపిస్తారు. డబ్బు ఇవ్వమనో... అన్నం పెట్టమనో అందరినీ బతిమిలాడుకుంటూ ఉంటారు. స్టేషన్‌నుంచి అడుగు బయటికెళుతుంటే ఇక కనిపించే దృశ్యాలన్నీ ఇవే. ఇదే విషయమై పశ్చిమ జనక్‌పురి-కర్కర్‌డుమాల మధ్య ప్రతి రోజూ రాకపోకలు సాగించే ల్యూబా చోప్రా అనే విద్యార్థిని మాట్లాడుతూ ‘మెట్రో స్టేషన్లలోని మెట్ల వద్ద బిచ్చగాళ్లను చూడాల్సిరావడం చిరాకుగా అనిపిస్తుంది.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ప్రతిరోజూ ఓ కొత్త బిచ్చగాడు కనిపిస్తాడు. మెట్రో రైల్వే స్టేషన్లు వారికి కొత్త ఆలయాలుగా మారాయి. ప్రతిరోజూ ఓ కొత్తబిచ్చగాడు కనిపిస్తుండడంతో వీరంతా వంతుల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారేమో అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇదొక వ్యవస్థీకృత వ్యాపారం. అయితే దురదృష్టమేమిటంటే దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.కాగా ఈ తరహా నిర్లక్ష్య ధోరణి నోయిడా సిటీ సెంటర్ స్టేషన్‌లోనూ బాగా కనిపిస్తుంది. అక్కడ బిచ్చగాళ్ల సంఖ్య విపరీతంగా ఉండడంతో పాదచారులకు దారి దొరకని పరిస్థితి కొనసాగుతోంది. ఇదే విషయమై ప్రసూన్ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ ‘ఉదయం వేళల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. అయితే బిచ్చగాళ్లు దారికి అడ్డంగా ఉండడం వల్ల మంచే జరుగుతోంది.
ఒకరిపై మరొకరు పడిపోయే పరిస్థితి తప్పిపోతోంది. ఈ రకంగా బిచ్చగాళ్ల వల్ల కొంతమేలే జరుగుతోంది’ అని అన్నాడు. అయితే వారు డబ్బు కోసం బాగా విసిగిస్తుంటారన్నాడు. బిచ్చగాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని, దీనిని నియంత్రించేవారే లేరని వాపోయాడు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించకపోతే జేబు దొంగతనాలు పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదన్నాడు. ఈ సమస్యను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) అధికారులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదంటూ విచారం వ్యక్తం చేశాడు. ఆయా మెట్రో స్టేషన్ల బయట పోలీసులు కానీ లేదా భద్రతా సిబ్బంది కానీ లేకపోడంతో బిచ్చగాళ్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది.
Advertisement
Advertisement