
మినీ పోరు మొదలు
బీబీఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఈ నెల 22న ఓటు హక్కును వినియోగించుకోనున్న 71.80లక్షల ఓటర్లు
నగరంలో 6,733 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
హత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. దీంతో నామినేషన్‌ల దాఖలు ప్రక్రియ సైతం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ను బీబీఎంపీ కమిషనర్ కుమార్ నాయక్ విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో బీబీఎంపీ పరిధిలోని మొత్తం 198 వార్డుల్లోని 71.80లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 37,68,498మంది పురుషులు, 34,68,400 మంది మహిళలు, 1,149 ఇతర ఓటర్లు ఉన్నారు. ఇక ఓటింగ్ ప్రక్రియకు గాను బీబీఎంపీ పరిధిలో మొత్తం 6,733 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని రూ.5లక్షలుగా నిర్ణయించారు. ఎన్నికల కోసం అదనంగా ఖర్చు చేసే వారిపై నోడల్ అధికారులు నిఘా వేయనున్నారు.
- సాక్షి, బెంగళూరు
ఎన్నికల విధుల్లో 35వేల మంది అధికారులు....
బీబీఎంపీ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, శాంతి భద్రతల నడుమ నిర్వహించేందుకు గాను జిల్లా ఎన్నికల అధికారులుగా నలుగురు వ్యవహరించనున్నారు. 28 మంది అదనపు జిల్లా ఎన్నికల అధికారులు, 53 మంది ఎన్నికల అధికారులు, 53 మంది అదనపు ఎన్నికల అధికారులు, 198 మంది సహాయక ఎన్నికల అధికారులు, 27 మంది ఓటరు నమోదు అధికారులు, 63 మంది సహాయక ఓటరు నమోదు అధికారులు, ఐదుగురు ప్రత్యేక ఎన్నికల పర్యవేక్షకులు, 88 మంది నోడల్ అధికారులను నియమించారు. వీరితో పాటు 7,979 మంది ప్రిసైడింగ్ అధికారులు, 7,979 మంది సహాయక ప్రిసైడింగ్ అధికారులు, 19,678 మంది పోలింగ్ బూత్ స్థాయి అధికారులను ఎన్నికల ప్రక్రియ కోసం నియమించారు. మొత్తంగా 35,636 మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.
వెబ్‌సైట్‌లో ఓటర్ల జాబితా....
బీబీఎంపీ పరిధిలోని ఓటర్ల జాబితాను ఇప్పటికే బీబీఎంపీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఓటర్ల వివరాలతో పాటు వారు ఏ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది తదితర వివరాలను సైతం ఈ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఒకవేళ తమ పేరు ఓటర్ల జాబితాలో లేకపోయినా, లేక ఏవైనా మార్పుచేర్పులున్నా మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందజేసేందుకు గాను సహాయవాణి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలనుకునే వారు 080-22224748, 080-22221158నంబర్లలో సంప్రదించవచ్చు.