- మంత్రి ఆంజనేయ
బెంగళూరు: కార్పొరేట్ కబంద హస్తాల్లో మోదీ ప్రభుత్వం చిక్కుకుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయ విమర్శించారు. బెంగళూరులోని కేపీసీసీ ప్రధాన కార్యాలంలో ఆదివారం జరిగిన బాబుజగ్జీవన్‌రాం జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదినెలలు అయినా ఇప్పటికీ సామాన్య ప్రజలకు మేలు చేకూర్చే ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదన్నారు. అయితే వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన కార్పొరేట్ సంస్థల ప్రయోజనం కోసం అభివృద్ధి ముసుగులో కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ బ్యాంకుల్లోని బ్లాక్‌మనీను ఇప్పటి వరకూ ఎందుకు భారతదేశానికి తిరిగి తీసుకురాలేకపోయారని ప్రశ్నిం చారు.
కార్పొరేట్ కంపెనీ ప్రతినిధుల ఒత్తిళ్ల వల్లే మోదీ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మోదీ ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఆ కార్యక్రమానికి మహాత్మాగాంధీ స్ఫూర్తి అని చెప్పడం సరికాదు. మహాత్మాగాంధీ దళిత వాడలకు వెళ్లి ఒట్టి చేతులతో చీపురు పట్టి అక్కడి ప్రాంతాలను శుభ్రం చేశారు. అయితే మోదీ మాత్రం సూటు, బూటుతోపాటు చేతులకు గ్లౌజులు, మొహానికి మాస్కులు వేసుకుని మహాత్మాగాంధీ పేరుతో ఉన్న శుభ్రమైన వీధుల్లో చీపురును పట్టుకుని శుభ్రం చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు.’ అని ఆంజనేయ ఎద్దేవా చేశారు.
కార్పొరేట్ కబంద హస్తాల్లో మోదీ
Published Mon, Apr 6 2015 1:31 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM
Advertisement
Advertisement