ఇద్దరిదీ ‘కార్పొరేట్’ జెండాయే! | Those 'corporate' flag! | Sakshi
Sakshi News home page

ఇద్దరిదీ ‘కార్పొరేట్’ జెండాయే!

Published Wed, Apr 30 2014 12:19 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

ఇద్దరిదీ ‘కార్పొరేట్’ జెండాయే! - Sakshi

ఇద్దరిదీ ‘కార్పొరేట్’ జెండాయే!

ఎన్నికల తదుపరి ఎవరికీ అధిక్యత లభించదేమోనని కార్పొరేట్ కుబేరుల భయం. ‘జనాకర్షక పథకాలకు ప్రభుత్వ భారీ వ్యయాలు తప్పవు. దాన్ని మనం భరించలేం’ అని ‘అసోచామ్’ ఆందోళన వ్యక్తం చేసింది. నిన్నటి వరకు మన్మోహన్ జపం చేసిన వారే మోడీ నామ సంకీర్తన చేస్తున్నారు. ‘మోడీ గాలి’ని సృష్టించాలని నానా పాట్లు పడుతున్నారు.
 
 రాజకీయవేత్తల ఎన్నికల చర్చలు చెవిటివాళ్ల సంవాదంగా సాగడం సర్వ సాధారణం. నోళ్లకే తప్ప చెవులకు పెద్దగా పనుండదు. జాతీయ మీడియా రాత్రి చర్చలు చాలా వరకు ఈ కోవకు చెందేవే. నకళ్లలా రూపొందిన కాంగ్రెస్, బీజేపీల ప్రణాళికలపైన, వాటి ఆర్థిక విధానాలపైన సాగిన చర్చ అలాంటిదే. కాబట్టే ధరల భగభగలతో కడుపు మండుతున్నవాళ్లంతా తప్పక పట్టించుకోవాల్సిన ఒక వాస్తవం మరుగున పడిపోయింది. కాంగ్రెస్, బీజేపీల జెండాలు వేరైనా ఆర్థిక ఎజెండా ఒకటేనని, మోడీ, రాహుల్‌లో ఎవరు గద్దెనె క్కినా సామాన్యుల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలోకి పడటమేనని తేల్చే  ఆ వాస్తవం వెలుగు చూడకపోవడమే మంచిదనుకున్నారేమో. గత ఆర్థిక సంవత్సరం(2012-13) మన స్థూల జాతీయోత్పత్తిలో 4.8 శాతంగా (8,780 కోట్ల డాలర్లు) ఉన్న కరెంటు అకౌంటు లోటు ఈ ఏడాది 1.7 శాతానికి  (3,200 కోట్ల డాలర్లు) తగ్గనున్నదని గత శనివారం ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. కాడ్  పెరుగుదల కారణంగా దేశం విదేశీ చెల్లింపుల సంక్షోభం అంచులకు చేరుతోందన్న ఆందోళన తొలగిందని, ఈ ఏడాది కోశ (ఫిస్కల్) లోటును జీడీపీలో 4.6 శాతానికి తగ్గించడం సాధ్య మైందని సంతోషం వెలిబుచ్చారు. అమాత్యులు ఒక్క విషయాన్ని విస్మరిం చారు. ప్రభుత్వ వ్యయాలు పెచ్చుపెరగడమే కోశ లోటుకు కారణమనీ, అదే సకల ఆర్థిక రుగ్మతలకు మూలమనేదే... 1991 నుంచి జెండాల తేడాలు లేకుండా పాలకులు అనుసరిస్తున్న మన్మోహనామిక్స్ లేదా స్వేచ్ఛాయుత వాణిజ్య మతం మౌలిక సూత్రం. ఆ మత శాసనాలను అనుసరించే వినియో గదారుల సబ్సిడీలు, సంక్షేమ వ్యయాలలో కోతలు, కరెంటు చార్జీల మోత లు, పెట్రో వాతలను జోరుగా సాగించారు. కోశ లోటు తగ్గింపునకు, వృద్ధికి అదే మార్గమన్నారు. కానీ అవేవీ లేకుండానే కోశ లోటును తగ్గించడం ఎలా సాధ్యమైంది? దిగుమతులకు ఎగుమతులకు మధ్య తేడాయే వాణిజ్య లోటు. అదే కరెంటు అకౌంటు లోటు (క్యాడ్)లోని ప్రధానాంశం. మన ఎగుమతులు పెరగకుండానే, చమురు దిగుమతులు తగ్గకుండానే క్యాడ్ ఎలా తగ్గింది?   

 కలవారి స్వర్ణ దాహం కథ

 గత ఏడాది మూడో త్రైమాసికలో బంగారం దిగుమతుల విలువ 1,780 కోట్ల డాలర్లు కాగా. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అవి 310 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ ఒక్క కారణంతోనే వాణిజ్య లోటు 58 శాతం తగ్గి, క్యాడ్ 53 శాతం తగ్గింది. గత ఏడాది మూడో త్రైమాసికానికి జీడీపీలో 6.5 శాతంగా ఉన్న క్యాడ్ ఈ ఏడాది మూడవ త్రైమాసికానికి 0.9 శాతానికి తగ్గింది! కార ణం బంగారం దిగుమతులపై ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు. 2007-08 నుంచి  2011-12 మధ్య మన దేశంలో బంగారం గిరాకీ అసాధారణంగా పెరిగింది. బంగారం నికర దిగుమమతులు 1,370 కోట్ల డాలర్ల నుంచి 4,920 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ అధోగతి పట్టడంతో సంపన్నవర్గాలు బం గారాన్ని పెట్టుబడిగా పోగేసుకోవడం పెరిగింది. కాబట్టే బంగారం ధరలు, దిగుమతులు జోరుగా పెరిగాయి. ఈ స్వర్ణ దుర్దాహం తాకిడికి విదేశీ వాణిజ్యంలో భారీ లోటు ఏర్పడింది. డాలర్లలో చేయాల్సిన చెల్లింపులు పెరిగి డాలర్లకు గిరాకీ పెరిగింది. రూపాయి విలువ పాతాళానికి చేరింది. విదేశీ మారకం నిల్వలు కరిగి, విదేశీ చెల్లింపుల సంక్షోభం ఏర్పడే స్థితి తలెత్తింది. ఎగుమతులు, దిగుమతుల స్వేచ్ఛలో వేలు పెట్టరాదని మడి కట్టుకున్న ప్రభు త్వ విధానానికి భిన్నంగా ఆర్‌బీఐ బంగారం దిగుమతులపై విధించిన  ఆంక్షల వల్లనే ఆ గండం గడిచింది. ధరల పెరుగుదలకు ప్రజలు హాహాకా రాలు చేస్తే ఎవరికీ పట్టలేదు. కానీ ఆర్‌బీఐ, చిదంబరం త్వరలోనే బంగారం దిగుమతులపై ఆంక్షలను సడలిస్తామని హామీలు కురిపిస్తున్నారు. బంగా రంపై కస్టమ్స్ డ్యూటీని 2 శాతం నుంచి 10 శాతానికి పెంచితే ఎవరు అల్లాడిపోయారని? ఎందుకీ ఆంక్షల సడలింత? యూపీఏని  సూక్ష్మదర్శినితో పరిశీలించి మరీ రచ్చకెక్కిస్తున్న బీజీపీ ఇదేమిటని నోరు మెదపడం లేదు ఎందుకు? పైకి ఏమి చెప్పినా ఆ రెండు పార్టీలది ఒకటే ఆర్థిక మతం... మన్మోహన్ సారథ్యంలో అమలవుతున్న స్వేచ్ఛా విపణి విధానాల మతం.   

 ఇంపోర్టెడ్ ‘ప్రజాభిప్రాయం’

 తమ మాటే ప్రజాభిప్రాయమని దబాయించి చలాయించుకుంటున్న జాతీ య మీడియా ఆర్థిక ‘నిపుణులు’ బంగారం దిగుమతులపై ఆంక్షలను విధించి న నాడే... ఇంకేముంది బంగారం స్మగ్లింగ్ పెరిగి పోయి, ఎక్కడికక్కడ హాజీ మస్తాన్‌లు పుట్టుకొచ్చేస్తారని భయపెట్టారు. గతించిన ఆంక్షల, కంట్రోళ్ల ‘లెసైన్స్ రాజ్’ తిరిగొచ్చేసిందని శోకాలు తీశారు. ఇదంతా మనోళ్ల పుర్రెలో పుట్టిన బాపతూ కాదు. బంగారు గనుల యజమానుల సంస్థ ‘వరల్డ్ గోల్డ్ కౌన్సిల్’ (డబ్ల్యూజీసీ) విలాపాల రిపీటర్ స్టేషన్ల మోత. డబ్ల్యూజీసీ బంగారం అమ్మకాలు పడిపోకూడదని తప్పుడు మాటలు, దొంగ జోస్యాలు చెప్పింది. ఆంక్షలతో చట్టబద్ధమైన, చట్టవిరుద్ధమైన బంగారం దిగుమతులు రెండూ కలిసి తడిసి మోపెడై కరెంటు అకౌంటు లోటు సమస్య మరింత విషమిస్తుందని అది ఢంకా బజాయించింది. క్యాడ్ సమస్య తీవ్రం కాలేదు. రికార్డు స్థాయిలో 1.4 శాతానికి తగ్గింది. కోశ లోటు 4.6 శాతానికి పరిమిత మైంది. బంగారం స్మగ్లింగ్ జోరు పెరిగిందీ లేదు. దొడ్డిదారిన వచ్చినా, రాచమార్గాన వచ్చినా బంగారానికి డాలర్లు చెల్లించాల్సిందే. దొడ్డి దారిన వచ్చిన బంగారానికి ఎగుమతులు-దిగుమతుల (ఎగ్జిమ్) సంస్థల పేరిట  దిగుమతుల విలువను ఎక్కువగా చూపి మూల్యాన్ని చెల్లిస్తారు.అంటే స్మగ్లింగ్ పెరిగితే కాడ్ తగ్గదు, పెరుగుతుంది. కోశ లోటు తగ్గింపునకు మార్గం సంక్షేమ వ్యయాల కోతలు కానే కాదు. ప్రత్యామ్నాయాలున్నాయని కలవారి స్వర్ణ దాహం కథలోని ఆర్థిక నీతి. ఆ నీతిని విస్మరించిన ఫలితంగానే ప్రపంచం దీర్ఘకాలిక ఆర్థిక ప్రతిష్టంభనలో కొట్టు మిట్టాడుతోంది.

 పూజారి మారితే మతం మారేనా?

 ఆ విధానాల నుంచి వైదొలగినందుకు లెంపలు వేసుకుంటున్న చిదంబరం, ఆర్‌బీఐలు బంగారం దిగుతులపై ఆంక్షలను తొలగిస్తామంటున్నారు. మళ్లీ తలెత్తే కాడ్ సమస్యను ఎలా అధిగమిస్తారు? ఇది, గుజరాత్ సహా దేశమంతా  అమలవుతున్న ఆర్థిక విధానాల సహేతుకను సవాలు చేసే ప్రశ్న. కాంగ్రెస్, బీజేపీల వద్ద ఉన్నది ఒక్కటే సమాధానం... ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం కూడదు. ఇద్దరిదీ ఒక్కటే పరిష్కార మార్గం...  మన కార్పొరేట్ కుబేరులూ, వారి అసోచామ్, ఫిక్కీల వంటి సంస్థలు చూపుతున్న మార్గం. ‘ప్రభుత్వ వ్యయాలపై కొరడా,’ ‘వినియోగదారుల సబ్సిడీల రద్దు,’ ‘సంక్షేమ వ్యయాల్లో భారీ కోతలు.’ ఈ ఏడాది సగటు వర్షపాతానికంటే తక్కువ  వర్షపాతం నమోదు కావచ్చని అంటున్నారు. మూడు నెలలుగా కాస్త ఉపశమించిన ఆహార ధరలు తిరిగి పేట్రేగుతున్నాయి. ఎంతగా విదేశీ పెట్టుబడులకు, సంస్థలకు తలుపులు బార్లా తీసినా గత ఏడాది పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి 0.9 శాతానికి మించలేదు. ఈ ఏడాది ఇంతవరకు  -1.9 శాతం (రుణాత్మక) వృద్ధిని చూపుతోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ప్రభుత్వ ఆర్థిక విధానాలు సామాన్య ప్రజల్ని గట్టెక్కిస్తాయా? అగాధంలోకి తోసేస్తాయా? అనేదే. రేపు ఎన్నికల్లో ‘ఎవరికీ ఆధిక్యతలేని పరిస్థితి’ ఏర్పడుతుందేమోనని మన కార్పొరేట్ కుబేరుల ఆందోళన. ‘జనాకర్షక పథకాల కోసం ప్రభుత్వం భారీ వ్యయాలను చేయాల్సి వస్తుంది. అలాంటి పరిణామాన్ని మనం భరించలేం’ అని అసోచామ్ ఆ ఆందోళనను వ్యక్తం చేసింది. అందుకే అవి నిన్నటి వరకు మన్మోహన్‌ను ఆకాశానికెత్తిన నోళ్లతోనే మోడీ నామ సంకీర్తన సాగిస్తున్నాయి. జాతీయ చానళ్ల సాయంతో ‘మోడీ గాలి’ని సృష్టించడానికి నానా పాట్లు పడుతున్నాయి. కార్పొరేట్ తటస్థతను వీడి వారు నేడు మోడీ వైపు ఎందుకు మొగ్గారు? ఎన్నికల వేళ సైతం కూలినాలి, పేద జనం వ్యతిరేకతను లెక్కచేయక గ్రామీణ ఉపాధి, ఆహార భద్రతా పథకాలను తప్పు పట్టగలిగిన ఏకైక నేత ఆయనే. ఎవరికీ జంకక సంక్షేమ వ్యయాలపై కత్తి దూయగల ఏకైక వీరుడు ఆయనే. అందుకే ఆయన పట్టాభిషేకం కోసం  వారి ఆరాటం.

 పిళ్లా వెంకటేశ్వరరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement